మీ సేవతో ఇసుక బుకింగ్Sat,January 13, 2018 02:01 AM

ఇసుక, మైనింగ్ పర్యవేక్షణకు డ్రోన్లు
-వాహనాలకు జీపీఎస్, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగులు
-రాష్ట్రస్థాయి ఫ్లయింగ్‌స్కాడ్ ఏర్పాటు
-సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత నిఘా
-గనులశాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

KTR-MINES
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్థానిక అవసరాలకు మీ సేవ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, గనులుశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. మీ సేవ ద్వారా బుక్ చేసుకుంటే వాటికి నిర్ణీత సమయంలోగా అనుమతులు ఇస్తామని, ఒకవేళ తిరస్కరిస్తే.. అందుకు కారణాలు కూడా వెంటనే తెలియజేస్తామని పేర్కొన్నారు. స్థానిక అవసరాల కోసం ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ఇసుకతోపాటు ఇతర ఖనిజాల మైనింగ్‌ను మరింత పాదర్శకంగా, కట్టుదిట్టంగా అమలుచేసేందుకు డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. శుక్రవారం బేగంపేటలోని మెట్రోరైలు కార్యాలయంలో గనులశాఖపై మంత్రి కేటీఆర్.. గనులు, పోలీస్, ఐటీశాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుకనిల్వలు, వాటి సరఫరాలో మరింత పారదర్శకత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వాహనాలకు జీపీఎస్, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగులను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఉపగ్రహ ఆధారిత టెక్నాలజీని మైనింగ్‌రీచ్‌ల పర్యవేక్షణకు ఉపయోగించాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌రంగంలో ఆదర్శవంతమైన విధానాలు పాటిస్తున్నదని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలోని ఇసుకరీచ్‌లలో ఏర్పాటుచేసిన జియోఫెన్సింగ్‌కు ఏమైనా ఉల్లంఘనలు జరిగాయా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారిక రీచుల్లో ఇప్పటివరకు ఎలాంటి ఉల్లంఘనలు జరుగలేదని మంత్రికి అధికారులు వివరించారు.

ప్రస్తుతం డిమాండ్‌కు మించి ఇసుకనిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇసుక రవాణాను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ, గనులశాఖ అధికారులతో రాష్ట్రస్థాయి ఫ్లయింగ్‌స్కాడ్స్ ఏర్పాటుచేస్తున్నామని మంత్రి వెల్లడించారు. టెక్నాలజీ సహకారంతో డంపులు, వాహనాల రాకపోకలు, ఓవర్‌లోడింగ్ గుర్తించేలా టెక్నాలజీని ఉపయోగించాలని, ఇందుకోసం ఐటీ సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇసుక తరలించేందుకు ఉపయోగిస్తున్న వాహనాలను పూర్తిస్థాయిలో గుర్తించేందుకు రవాణాశాఖ సహకారం తీసుకోవాలని చెప్పారు. ఇసుక రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో విజిలెన్స్ అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో చెప్పినట్టు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో స్థానిక అవసరాలకు ఇసుక తీసుకెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరంలేదని, కానీ వాటి ద్వారా డంపులు తయారుచేస్తే వాహనాలను సీజ్‌చేస్తామని స్పష్టంచేశారు. ఈ విషయంలో పోలీస్, రెవెన్యూ, గనుల శాఖాధికారులు ఉమ్మడిగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, గనులశాఖ డైరెక్టర్ సుశీల్‌కుమార్, టీఎస్‌ఎండీసీ ఎండీ మల్సూరు, ఐజీ స్టీఫెన్వ్రీంద్ర తదితరులు పాల్గొన్నారు.

797

More News

VIRAL NEWS