నిజామాబాద్ మాజీ ఎంపీ గంగారెడ్డి కన్నుమూత

Tue,March 21, 2017 02:45 AM

సంతాపం వ్యక్తం చేసిన సీఎం కే చంద్రశేఖర్‌రావు
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుపాలని ఆదేశం

నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి (84) సోమవారం హైదరాబాద్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. 1956లో సర్పంచ్‌గా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన మూడుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. మంగళవారం డిచ్‌పల్లి శివారులోని ఫాంహౌస్‌లో గంగారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గంగారెడ్డి హఠాన్మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుపాలని అధికారులను ఆదేశించారు.
gangareddy
హైదరాబాద్/నిజామాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి (84) సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లికి చెందిన గడ్డం గంగారెడ్డి గ్రామస్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. 1956లో పడ్కల్ సర్పంచ్‌గా రాజకీయాల్లోకి వచ్చారు. రెండు పర్యాయాలు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఊరిపేరే ఆయన ఇంటిపేరుగా స్థిరపడింది. 1991లో టీడీపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. 1998, 99లోనూ ఎంపీగా విజయం సాధించారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. 2004లో డిచ్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లో, తర్వాత బీజేపీలో చేరారు. వయోభారం దృష్ట్యా కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నిజామాబాద్‌లో పీఎఫ్ కార్యాలయం, ఈఎస్‌ఐ దవాఖాన, రేడియోస్టేషన్ ఏర్పాటుకు గంగారెడ్డి కృషిచేశారు. ఆయన హయాంలోనే నిజామాబాద్-పెద్దపల్లి రైల్వే మార్గానికి పునాది పడింది. గంగారెడ్డికి నలుగురు సంతానం, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయి. సోమవారం గంగారెడ్డి మృతదేహాన్ని నిజామాబాద్ సుభాష్‌నగర్‌లోని నివాసానికి తరలించగా పలువురు నాయకులు, స్థానికులు నివాళులు అర్పించారు. మంగళవారం డిచ్‌పల్లి శివారులో కేశ్‌పల్లి ఫాంహౌస్‌లో గంగారెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
gangareddy2

అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం కేసీఆర్


గంగారెడ్డి మృతిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. గంగారెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావంలో, తెలంగాణ ఉద్యమంలో తన వెంట ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. గంగారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గంగారెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరుపాలని అధికారులను ఆదేశించారు. గంగారెడ్డి మరణం తీరని లోటని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తంచేశారు. నిజామాబాద్‌తోపాటు, తెలుగు ప్రజలకు సేవచేయడంలో గంగారెడ్డి ముందుండేవారని పేర్కొన్నారు. ఆయన మృతిపై విచారం వ్యక్తంచేశారు.

2042

More News

మరిన్ని వార్తలు...