వృద్ధుడి భూమి అన్యాక్రాంతం


Sat,August 24, 2019 02:41 AM

Nirmal district farmer Anjanna meets Dharmaganta Article

- సారంగాపూర్‌ రెవెన్యూ అధికారుల నిర్వాకం
- ‘ధర్మగంట’ను ఆశ్రయించిన నిర్మల్‌ జిల్లా బాధితుడు అర్జన్న


హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఓ ఎనభై ఏండ్ల వృద్ధుడికి వారసత్వంగా సంక్రమించిన భూమిని రెవెన్యూ అధికారులు మరోవ్యక్తి పేరుమీదకు బదలాయించారు. ఉన్న భూమంతా అన్యాక్రాంతం కావడంతో ఆ వృద్ధ రైతు ‘ధర్మగంట’ను ఆశ్రయించారు. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం కౌట్లా (బుజుర్గ్‌) గ్రామానికి చెందిన తీగల అర్జన్నకు సర్వే నంబర్‌ 693/1లో తండ్రి భీమన్న నుంచి వారసత్వంగా వచ్చిన 2.18 ఎకరాల భూమి ఉన్నది. అర్జన్నకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అర్జన్న తన భూమిలో సోయా, పత్తి పంటలను సాగుచేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ భూమికి పాస్‌పుస్తకం, పహాణీ కూడా ఉన్నాయి. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత అధికారులు కొత్త పాస్‌పుస్తకం కూడా జారీచేశారు. మొదటి విడుతలో రైతుబంధు సాయం కింద రూ.9,850 చెక్కు కూడా వచ్చింది. కానీ రెండో విడుత రైతుబంధు డబ్బులు మంజూరు కాకపోవడంతో అధికారులను సంప్రదించగా, భూమి అర్జన్న పేరిట లేదని చెప్పారు. దీంతో మీ సేవలో పహాణీ తీయించగా.. గ్రామ మాజీ సర్పంచ్‌ తీగల మోహన్‌ పేరిట పట్టా అయినట్టు తేలింది. తాను విక్రయించకుండానే ఆ భూమిని రెవెన్యూ అధికారులు తీగల మోహన్‌ పేరిట పట్టాచేశారంటూ బాధిత రైతు అర్జన్న ‘ధర్మగంట’ను ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు మాజీ సర్పంచ్‌తో కుమ్మక్కై తన భూమిని అక్రమంగా అతడికి కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై కౌట్ల వీఆర్వో ప్రకాశ్‌ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. పొరపాటుగా మోహన్‌ పేరిట పట్టా అయిఉంటుందని.. విచారణ జరిపి సరిచేస్తామని చెప్పారు.

300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles