యాసంగిలో ఆరుతడే మేలు

Sat,December 14, 2019 03:21 AM

-వారబందీ పద్ధతిలో సాగునీటి సరఫరా
-వరి నుంచి రైతుల దృష్టి మళ్లించాలి
-సాగునీటి సలహా బోర్డు సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి

జోగుళాంబ గద్వాల జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాసంగిలో కాల్వల ద్వారా నీరు తీసుకొనే రైతులు ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయొద్దని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఈ విషయా న్ని రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉన్నదని సూచించారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని హరితహోటల్‌లో నిర్వహించిన సాగునీటి సలహా బోర్డు సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రైతులకు యాసంగిలో ఎత్తిపోతల పథకాల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందాలంటే వరికి దూరం గా ఉండాలని సూచించారు. ఆరు తడి సాగుచేసే వారికి వారబందీ పద్ధతిలో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తామన్నారు. నీటి పారుదులశాఖ ప్రతిపాదించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది యాసంగి పంటలకు జూరాల ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా 10 వేల ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా 20 వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తామన్నారు. ఆర్డీఎస్‌ కాల్వ, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాల ద్వా రా 20వేల ఎకరాలకు, జవహర్‌లాల్‌ నెహ్రు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 30 వేల ఎకరాలకు, రాజీవ్‌ భీమా ద్వారా 21,650 ఎకరాలకు, కోయిల్‌సాగర్‌ ద్వారా 6 వేల ఎకరాలకు, ఎంజీకేఎల్‌ఐ ద్వారా 1,86,300 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రతిపాదించినట్టు చెప్పారు. కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి వరద నీరు ఇప్పటికీ కొనసాగుతుండటంతో ప్రస్తుతం ప్రతిపాదించిన నీటి కేటాయింపులు మరింత పెంచేందుకు పునః సమీక్షించాలని నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఉమ్మడి పాలమూరుకు తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ ప్లాంట్‌కు నీటి కొరత లేకుండా మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. వారబందీ పద్ధతిలో రైతులకు సాగునీటిని అందించేందుకు లస్కర్ల కొరత ఉన్నందున తాత్కాలిక పద్ధతిలో లస్కర్లను నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

జములమ్మ కాల్వ ఏర్పాటుకు ప్రతిపాదన..

రాజోలి బండ పనుల పెండింగ్‌తోపాటు జములమ్మ రిజర్వాయర్‌ కాల్వ ఏర్పాటుపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలన్నారు. ఏదుల, బుద్దారం ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. రంగ సముద్రం, శంకర సముద్రం ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గోపల్‌దిన్నెకు సంబంధించి 0.6 మీటర్లు తగ్గించి నిర్మించినందున నిండటం లేదని, దానిని సరిదిద్దుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జూరాల వరద సమయంలో మరో కాల్వను ఏర్పాటు చేసి నేరుగా రామన్‌పాడు నింపుకొనేందుకు అవకాశం ఉన్నదని, మధ్యలో మరో రిజర్వాయర్‌ నిర్మించేందుకు అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా సూచించారు. సింగోటం నుంచి గోపాల్‌దిన్నెకు లింక్‌ చేయడం ద్వారా గోపాల్‌దిన్నె రిజర్వాయర్‌ నింపే విషయాన్ని పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మునిగల నుంచి చిన్న కెనాల్‌ ఏర్పాటు చేస్తే దాదాపు 7వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నదన్నారు. కేఎల్‌ఐ నుంచి పెద్దమందండి, అడ్డాకుల సాగునీరు అందించే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్లు సరిత, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, గద్వాల, వనపర్తి కలెక్టర్లు శశాంక, శ్వేతా మొహంతి, నీటిపారుదల సీఈ అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles