లింక్‌డ్‌ ఇన్‌ దోస్త్‌.. దోచేశాడు

Thu,November 14, 2019 04:18 AM

-హైదరాబాద్‌ యువతితో నైజీరియన్‌ సైబర్‌ నేరగాడి చాటింగ్‌ ప్రేమాయణం
-10 కోట్ల బహుమతుల ఆశచూపి.. రూ.94 లక్షలకు ఎసరు
-పర్సనల్‌ లోన్‌, తండ్రి పదవీ విరమణ సొమ్మూ జమ
-సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగిని

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:నైజీరియన్‌ నేరగాళ్లు వారి దేశంలోనే కూర్చుని ఇక్కడి అమాయకులకు వల వేస్తున్నారు. సైబర్‌ నేరాలకు పాల్పడుతూ లక్షలు దోచుకుంటున్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎవరో ఒకరు వారిబారిన పడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని సైబర్‌ నేరగాండ్ల వలకు చిక్కి ఏకంగా రూ.94 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంకా డబ్బు డిమాండ్‌ చేయడంతోపాటు, డ్రగ్స్‌ కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన ఐటీ ఉద్యోగినికి నెలకు రూ.రెండు లక్షల జీతం. మూడునెలల క్రితం ఆమెకు లింక్‌డ్‌ఇన్‌ సోషల్‌మీడియా సైట్‌ద్వారా ఓ వ్యక్తి ఫ్రెండ్‌గా పరిచయమయ్యాడు. తాను బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో పైలట్‌గా చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. దానిని స్వాగతించిన యువతి అతడితో చాటింగ్‌ ప్రారంభించారు. కొన్నిసార్లు వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ (వీవోఐపీ)లోనూ మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా అతడు ప్రేమిస్తున్నానంటూ ప్రతిపాదించగా యువతి ఓకే చెప్పింది. త్వరలోనే ఇండియాకు వస్తున్నానని, రూ.10 కోట్ల విలువైన బహుమతులు, బంగారు ఆభరణాలు తీసుకువస్తున్నానని చెప్పడంతో ఆమె నిజమేనని నమ్మింది. ఇంతలో ఒకరోజు ఫోన్‌చేసి.. ‘మా తండ్రికి అత్యవసరంగా క్యాన్సర్‌ చికిత్స చేయించాలి.. డబ్బులన్నీ బహుమతుల కోసం ఖర్చు చేశాను.. సాయం చేయాలి’ అంటూ అడిగాడు. నిజమేనని నమ్మిన ఆమె అతడు చెప్పిన ఖాతాలో డబ్బులు వేసింది. పలుమార్లు అలాగే చేసింది. తండ్రి పదవీవిరమణ చేసిన నగదును కూడా పెట్టుబడుల కోసమంటూ తీసుకుని అతడికే పంపింది. ఇది సరిపోక పర్సనల్‌ (వ్యక్తిగత రుణం) లోన్‌ను కూడా తీసుకున్నది. మొత్తం రూ.94 లక్షలు అతడు సూచించిన ఖాతాల్లో జమచేసింది.

ఆరులక్షలు ఇవ్వకపోతే డ్రగ్స్‌కేసు పెడుతా

సైబర్‌ నేరగాడు మొత్తం రూ.కోటికి యువతిని టార్గెట్‌ చేసినట్టు తెలుస్తున్నది. రూ.94 లక్షలు లాగేసుకున్న అతడు ఇంకా ఆరు లక్షలు కావాలంటూ ఫోన్‌ చేశాడు. చివరకు యువతి నిలదీయడంతో డబ్బులు ఇవ్వకపోతే నా దగ్గర డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నావంటూ పోలీసులకు చెప్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో దిక్కుతోచని ఆమె రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదుపై ప్రాథమికంగా విచారించిన రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు బాధితురాలి నుంచి డబ్బులు కొట్టేసింది నైజీరియన్‌గా తేలింది. సైబర్‌ నేరగాడు తన ఆచూకీ దొరకకుండా యువతితో వీవోఐపీ మీద మాట్లాడాడు. ఒకేఒక్కసారి వాట్సాప్‌లో మాట్లాడటంతో పోలీసులు దాని ఐపీ అడ్రసును కూపీ లాగగా నైజీరియా దేశం ఆచూకీ లభించింది. మొత్తం ఆరు ఖాతాల్లో డబ్బులను జమచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆగ్రా, అసోం, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాల్లోని బ్యాంక్‌ ఖాతాల నుంచి మరో 10 ప్రాంతాలకు నగదు బదిలీ అయినట్టు తేలింది. ఈ ఖాతాలను కూడా నైజీరియాలో ఉన్న సైబర్‌ నేరగాడు సేకరించినట్టు సమాచారం. సోషల్‌మీడియాలో ప్రేమను ప్రతిపాదించి వాట్సాప్‌, వీవోఐపీలో కాల్స్‌ మాట్లాడేవారిని ముందుగా అనుమానించాలని రాచకొండ సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ హరినాథ్‌ తెలిపారు. కోట్ల రూపాయల బహుమతులు ఇస్తానంటూ ఆశచూపేవారంతా మోసగాండ్లేనని గుర్తించాలని చెప్పారు. ఫొటోలు చూసి బోల్తా పడొద్దని, మాయమాటలకు చిక్కొద్దని సూచించారు.

1747
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles