ఉన్నది తక్కువ.. రికార్డుల్లో ఎక్కువ


Thu,May 23, 2019 01:47 AM

New passbooks that are not original farmers

-12 ఎకరాల 30 గుంటల భూమికిగాను 17 ఎకరాల 30 గుంటలకు పట్టాలు
-అసలైన రైతులకు అందని కొత్త పాస్‌పుస్తకాలు
-సాగు చేస్తున్నా రైతుబంధుకు దూరం
-సర్వే పేరుతో తిప్పించుకుంటున్నరెవెన్యూ అధికారులు
-నల్లగొండ జిల్లా దండంపల్లిలో రైతుల పరిస్థితి

నల్లగొండ, నమస్తే తెలంగాణ: క్షేత్రస్థాయిలో తక్కువ భూమి ఉండగా, రికార్డుల్లో ఎక్కువగా నమోదుచేశారు. అసలు రైతులకు పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా రైతుబంధుకు దూరంచేశారు. అన్నదాతలు ఏడాదిన్నరగా తిరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లా, మండలం దండంపల్లి గ్రామంలోని 166వ సర్వేనంబర్‌లో వాస్తవంగా 12 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నది. కానీ, పాత రికార్డుల్లో 17 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నట్టు రెవెన్యూ అధికారులు నమోదుచేశారు. ఈ భూమిలో ప్రస్తుతం పదిమంది రైతులు కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటున్నారు. కబ్జాలో లేకుండా ఉన్న మరో ఐదుగురికి సైతం రెవెన్యూ అధికారులు ఈ సర్వేనంబర్‌లో భూమి ఉన్నట్టు రికార్డులు సృష్టించి పాస్ పుస్తకాలు జారీచేశారు. మొత్తం 15 మందికి పాస్ పుస్తకాలు అందజేశారు. 1948లో రూపొందించిన సేత్వారి రికార్డుల ఆధారంగా ప్రభుత్వం భూప్రక్షాళన అనంతరం అన్ని సర్వేనంబర్లలో ఉన్న భూ వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఆయా సర్వే నంబర్లలో వాస్తవంగా ఉన్న భూమిని బట్టే కొత్తగా పాస్ పుస్తకాలు జారీచేసింది.

కొత్త పాస్‌పుస్తకం రాలేదు. రైతుబంధు దక్కలేదు..

దండంపల్లిలో 166 సర్వే నంబర్‌లో ధరణి వెబ్‌సైట్‌లో 12 ఎకరాల 30 గుంటలు మాత్రమే చూపిస్తున్నది. పాత పాస్‌పుస్తకాలను బట్టి ఎక్కువగా ఉన్న మిగతా భూమిని ధరణి తీసుకోవడంలేదు. పాత పాస్ పుస్తకాల ఆధారంగా కొత్త పాస్ పుస్తకాల్లో భూమిని నమోదుచేసి ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. సాగు చేసుకుంటున్న రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు అందక రైతుబంధును కోల్పోయారు. సాగు చేసుకుంటున్న రైతులతోపాటు కబ్జాలో లేకుండా పాస్ పుస్తకాలు మాత్రమే కలిగి ఉన్నవారు సైతం కొత్త పాస్ పుస్తకాల కోసం అధికారులను ఆశ్రయించారు. భూమి తక్కువగా ఉండి రికార్డుల్లో ఎక్కువగా ఉండటంతో ఎవరికి పాస్ పుస్తకాలు ఇవ్వాలో అర్థంగాక సర్వే పేరుతో రెవెన్యూ అధికారులు ఏడాదిన్నరగా తిప్పించుకుంటున్నారు. ధరణి వెబ్‌సైట్ ఆధారంగా భూ సర్వేచేసి గతంలో పాస్ పుస్తకాలు అందజేసిన రైతులకు అధికారులు నోటీసులు జారీచేయాలి. వారికి భూమి ఎలా వచ్చిందనే కోణంలో సర్వేచేసి సరిదిద్దాలి. కానీ, అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఏడాదిన్నరగా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు


తెలగమల్ల ప్రవీణ్‌కుమార్, దండంపల్లి

166వ సర్వే నంబర్‌లో మా అన్న నర్సింహకు 2 ఎకరాల 13 గుంటలు, రెండో అన్న కాశయ్యకు 22 గుంటలు, నాకు 2 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నది. ప్రస్తుతం కాశయ్య భూమి సాగు చేస్తున్నాడు. ముగ్గురికి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఏడాదిన్నరగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నాం. అయినా ఇవ్వడం లేదు. సర్వే నంబర్‌లో భూమి లేనోళ్లకు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సర్వేచేసి గతంలో భూమిని ఎవరు.. ఎక్కడ నుంచి కొనుగోలు చేశారు, ఎవరు సాగు చేసుకుంటున్నారో పరిశీలించాలి. లేదంటే మాలాంటి అసలు రైతులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నది.


సర్వేయర్ నివేదిక ఇవ్వకపోవడంతో ఆలస్యం

166వ సర్వే నంబర్‌లో భూమి తక్కువగా ఉన్నది. పాస్ పుస్తకాల్లో ఎక్కువగా ఉన్నందునే కొంతమందికి పాస్ పుస్తకాలను ఇవ్వకుండా నిలిపేశాం. నర్సింహతోపాటు వాళ్ల అన్నలకు భూమి ఉన్నమాట వాస్తవమే. భూసర్వే చేసి నివేదిక ఇవ్వాలని సర్వేయర్‌కు చెప్పాం. ఆయన ఇవ్వకపోవడం వల్లే ఆలస్యమైంది. రైతులను పిలిపించి, పాత పాస్‌పుస్తకంలో ఉన్న వివరాలను పరిశీలించి కొత్త పాస్‌పుస్తకాలను అందజేస్తాం.
- జహంగీర్, వీఆర్వో

130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles