శాసనసభకూ కొత్త భవనం


Wed,June 19, 2019 02:49 AM

New Legislature building in Telangana

-ఎర్రమంజిల్‌లో రూ.100 కోట్లతో నిర్మాణం
-ఇప్పుడున్నచోటే కొత్త సచివాలయం
-6 లక్షల చదరపు అడుగులు.. 400 కోట్ల ఖర్చు
-27న రెండింటికీ శంకుస్థాపన
-రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శాసనసభకు కొత్త భవనాన్ని నిర్మించాలని మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఎర్రమంజిల్‌లోని ఎత్తయిన ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న స్థలంలోనే సచివాలయం కొత్త భవనాన్ని కూడా నిర్మిస్తారు. ఈ రెండు భవనాలకు ఈ నెల 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. పార్లమెంట్ భవనాన్ని పోలినవిధంగా అసెంబ్లీ నిర్మాణం ఉండాలని మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. ఈ భవనంలో సెంట్రల్ హాల్, కౌన్సిల్ హాల్, అసెంబ్లీ హాల్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుత శాసనసభ భవనాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించాలని నిర్ణయించారు. క్యాబినెట్ భేటీలో మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రిమండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఏపీలో ప్రభుత్వం మారడం మూలాన సెక్రటేరియట్, శాసనసభ భవనాల అప్పగింత పూర్తయింది. రేపు (బుధవారం)అధికారికంగా అప్పగిస్తారు. ఈ రెండు భవనాలు ఖాళీ అయిన దరిమిలా కచ్చితంగా తెలంగాణకు సెక్రటేరియట్ భవనాన్ని, అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయానికొచ్చాం. గతంలో ఏపీ మొండికేయడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించాం. అందుకే, బైసన్‌పోలో గ్రౌండ్ కావాలని కేంద్రాన్ని అడిగాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడంతో ఇక్కడే సెక్రటేరియట్ నిర్మించాలని నిర్ణయించాం. 5 నుంచి 6 లక్షల ఎస్‌ఎఫ్‌టీ కడితే సరిపోతుందనే నిర్ణయానికొచ్చాం. ధరను పరిశీలిస్తే.. మంచి వరల్డ్ క్లాస్ ఫర్నిచర్‌తో కట్టుకున్నా.. అత్యంత మోడ్రన్‌గా కట్టుకుంటే కూడా.. రూ.400 కోట్లు ఖర్చు అవుతుందని అనుకుంటున్నాం. అసెంబ్లీ భవనం కూడా వంద కోట్లలో కట్టొచ్చని నిర్ణయించాం. పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్, అసెంబ్లీ హాల్, కౌన్సిల్‌హాల్ వంటివి ఇందులో ఉంటాయి. పార్లమెంట్ తరహాలోనే వసతులుంటాయి. సెపరేట్ హాల్స్ నిర్మిస్తాం.
KCR1
ఎర్రమంజిల్‌లో ఎలివేటెడ్ తరహాలో ఉన్న 17ఎకరాల భవనంలో కొత్త అసెంబ్లీ కడతాం. ఇప్పుడున్న అసెంబ్లీ భవనం హెరిటేజ్ బిల్డింగ్‌లా ఉంటుంది. దాన్ని కాపాడే ప్రయత్నంచేస్తాం. ప్రస్తుతమున్న అసెంబ్లీ ఫ్రంట్ ఎలివేషన్ తరహాలోనే కొత్త అసెంబ్లీ భవనం ఎలివేషన్ ఉంటుంది. ఇక సెక్రటేరియట్‌లో కొన్ని 50, 60 ఏండ్ల క్రితం కట్టిన బిల్డింగులున్నాయి. ఆ తర్వాత కట్టినవీ ఉన్నయ్. అందుకే, మొత్తం కూల్చి కట్టాలా? లేక కొన్ని అలాగే ఉంచి వాడుకోవాలా? అనే విషయాన్ని నిర్ణయిస్తాం. మనం సెక్రటేరియట్ కడుతున్నామని తెలుసుకొని దేశవ్యాప్తంగా ఆర్కిటెక్టులు డిజైన్లు పంపిస్తున్నారు. వాటిలో ఒకటి ఇదిగో ఇలా ఒక తమిళ ఆర్కిటెక్ట్ పంపించారు (అని ఎలివేషన్ చూపించారు). బిల్డింగ్ ఆల్‌మోస్ట్ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది? ఒకటే భవనం అటూఇటూగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. ముందంతా ఖాళీగా ఉంటుంది. అతిపెద్ద లాన్లు, అద్భుతమైన ఫౌంటెయిన్లు ఉంటాయి. హఫీజ్ కాంట్రాక్టర్ కూడా మంచి డిజైన్ పంపించాడు.

ఇవే రెండు, మూడున్నాయి. భూమి పూజ మాత్రం ఈ 27 నాడు చేస్తం. ఆ తర్వాత దసరా రోజు వరకూ మంచి రోజుల్లేవు. పూజ చేసుకుంటే ఏ టైమ్‌లో అంటే ఆ టైమ్‌లో తీసుకోవచ్చు. ఈలోపు ఆర్‌అండ్‌బీ మంత్రి అధ్యక్షతన, ముగ్గురు సభ్యులతో కలిపి ఒక ఉపసంఘం వేస్తాం. మొత్తం కూలగొట్టి కట్టాలా? లేక కొన్ని ఉంచుకుని, ఇంటిగ్రేట్ చేసుకుని కట్టాలా? అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. దీనివల్ల పని కూడా ఫాస్ట్‌గా జరుగుతుంది. మొత్తం సెక్రటేరియట్‌ను తరలించాలా? లేక పాక్షికంగానా? అనేది క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడుతుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు.

2357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles