కొత్త రాతి చిత్రాలివిగో..


Mon,July 25, 2016 02:31 AM

New Big stones at kanchanapally

-ఔత్సాహికుల అన్వేషణలో వెలుగులోకి
-మెదక్ జిల్లా కంచన్‌పల్లిలో మధ్యరాతి యుగం చిత్రాలు

కొత్త రాతి చిత్రాల తావు దొరికింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామానికి ఆగ్నేయాన మాలగుట్ట అని పిలువబడే కలిసిపోయివున్న రెండు చిన్నగుట్టలున్నాయి. అందులో 170-54-9 ఉత్తర అక్షాంశంపై, 780-15-47 తూర్పు రేఖాంశంపై ఉన్న సన్నాసిరాళ్ళు అని పిలువబడే ఒక పడిగెరాయికి ఎర్ర (జేగురు) రంగులో వేసిన రాతిచిత్రాలున్నాయి. ఈ చిత్రాలు దాదాపు పది అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పులున్న రాతిగోడ కాన్వాస్ మీద పెద్దసైజులో వేసివున్నాయి.
Rockhood
ఈ బొమ్మల్లో తలలు కింది వైపున్న రెండడుగుల ఎత్తు చేపలు, తల పైకి వున్న 3 అడుగుల ఎత్తున్న చేప ఒకటి, మరో రెండు వెలిసిపోయిన చేపలు, ఒక పింఛంతో అందమైన ఒక నెమలి బొమ్మ, ఒక పెద్ద వృత్తం, మరొకటి దానిపైన రంగునింపిన వృత్తం, వాటిపక్కన నిలువు గీతలు వేసిన బొమ్మలున్నాయి. మరెన్నో రంగుపెచ్చులూడిన బొమ్మలు ఏ ఆకారాలో తెలియనట్లున్నాయి. మధ్యలో ఒక జింకవంటి జంతువులో సగం (వెనక)భాగం చిన్న తోకతో కనిపిస్తున్నది. గుర్తింప వీలులేని కొన్ని రాతిచిత్రాల జాడలు అగుపిస్తున్నాయి. మరొక నెమలి పైనున్న చేపలపక్కన వెల్లకిలపడివున్నట్లు కనిపిస్తున్నది. బహుశ అది చనిపోయిన నెమలిని చిత్రించినట్లనిపిస్తున్నది. ఇందులోని చేపల చిత్రాలతో పోలిన చేపబొమ్మ మహబూబ్‌గనర్ జిల్లాలోని అక్క మహాదేవిగుహల్లోని రాతిచిత్రాలలో ఉంది. వరంగల్ జిల్లా పాండవులగుట్ట రాతిచిత్రాలలోని జేగురురంగు నింపిన పొడుగైన మూడు చేపల బొమ్మలు తలలు పైకి ఉంచినట్లు గీసివున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్ కొండలో కూడా చేపలబొమ్మలు రంగునింపినవే. కానీ, ఇక్కడ కంచన్‌పల్లి రాతిచిత్రాలు ప్రత్యేక చిత్రణతో కూడినవి. వీటి శైలి, ఇతివృత్తం వేరు. బొమ్మల మీద బొమ్మలు వేయడం వల్ల పాత చిత్రాలు, కొత్త చిత్రాలు కలగలసిపోయినవి. చేపల బొమ్మలు, నెమలి బొమ్మలు పూర్వమానవుల వేటవృత్తిని సూచించేవే.
Rockhood1
ఈ రాతి చిత్రాలున్న తావులో పనిముట్లు దొరకలేదు. పై నుంచిపడ్డ నీటిధారలవల్ల అక్కడ సన్ననిమట్టి పేరుకుపోయింది. ప్రస్తుతం బొమ్మలున్న రాతిగోడ కిందవున్న సొరికె అడవిపందుల ఆవాసమైంది. గుట్టపాదాలవద్ద మట్టిలో కూరుకుపోయిన ఒక క్లీనర్ (మొన విరిగివుంది) దొరికింది. చాపర్‌వంటి రాతిబిళ్లకూడా లభించింది. ఆ ప్రాంతమంతా గులకరాళ్ళున్నాయి. గులకరాతితో చేసిన గొడ్డలివంటి పాత, కొత్త చిత్రాలను, వాటి రేఖలనుబట్టి ఇవి మధ్య రాతియుగం ఆరంభకాలం నాటివని అనుకోవచ్చు. ఈ రాత చిత్రాలతావుని కనిపెట్టింది మెదక్ నివాసి, ఔత్సాహిక అన్వేషకుడు, డిమార్కిస్టు కే శంకర్‌రెడ్డి. ఈ అన్వేషణలో కొత్త తెలంగాణ చర్రితబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, మురళీకృష్ణ, గుండం మోహన్‌రెడ్డి (తెలంగాణ జాగృతి), సహాయకుడు చిట్టి (నరసింహారావు), కౌడిపల్లికి చెందిన అంపటి సంతోష్‌కుమార్, కంచన్‌పల్లి గ్రామస్థులు పాపయ్య, వెంకయ్యలు పాల్గొన్నారు.

3673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles