రేపే కౌంటింగ్


Wed,May 22, 2019 02:47 AM

nearly 10k policemen besides armed men to be deployed at counting centres in telangana on may 23

- 18 జిల్లాల్లోని 35 కేంద్రాల్లో..
- ప్రతీ సెగ్మెంట్‌లో 14 టేబుళ్లు
- మేడ్చల్‌లో 28, నిజామాబాద్‌లో 36 టేబుళ్లు
- 15 నుంచి 30 రౌండ్లలో ఫలితం తేలే అవకాశం
- ముందుగా ఖమ్మం.. ఆఖరున నిజామాబాద్ ఫలితం!
- ఉదయం 5.30 గంటల నుంచే విధుల్లోకి సిబ్బంది
- కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు బంద్
- పదివేల మందితో పటిష్ఠ భద్రత: అడిషనల్ డీజీ జితేందర్


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లోక్‌సభ సాధారణ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకున్నది. దేశంలో ఏడువిడుతల్లో పోలింగ్ ముగియగా.. ఇక ఫలితాల కోసం ఉత్కంఠ నెలకొన్నది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గతనెల 11న ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. గురువారం ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లుచేసింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగుతుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించినప్పటికీ.. ఫలితాల కోసం ఓటర్లు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుమేరకు ప్రతి నియోజకవర్గానికి సగటున ఐదు వీవీ ప్యాట్లను లెక్కించి ఈవీఎంలలోని ఓట్లతో సరిపోల్చనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు
DG-Jitender2
కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లో 18 జిల్లాల్లో 35 కేంద్రాలను ఏర్పాటుచేశారు. లెక్కింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్టు అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో బుధవారం సాయంత్రం నుంచే 144 సెక్షన్ అమ ల్లో ఉంటుందని చెప్పారు. గురువారం ఉద యం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు. 23న ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుండగా.. ఉదయం 5.30 గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్రాల్లో ఉండాలని అధికారులు సూచించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండ గా..110సెగ్మెంట్లలో లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుచేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 టేబుళ్లు ఏర్పాటుచేశారు. మేడ్చల్, ఎల్‌బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో 28 టేబుళ్ల చొప్పున కేటాయించారు. కాగా, అన్నిచోట్లా పర్యవేక్షణ కో సం అదనంగా ఒక టేబుల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో 500కుపై గా పోలింగ్ కేంద్రాలుండటంతో 28 టేబుళ్లను ఏర్పాటుచేసినట్టు ఈసీ వెల్లడించింది. ఇక్కడ 30రౌండ్లలో లెక్కింపు పూర్తిచేసే అవకాశం ఉంది. ముందుగా ఈవీఎంల తాళాలు తీసి, లెక్కించిన అనంతరం చివరగా ర్యాండమ్ పద్ధతిలో అదే వీవీప్యాట్లను లెక్కిస్తారు. ఈవీఎం ల్లో పోలైన ఓట్లతో పోల్చుకుని సరిచూసుకున్న తర్వాతనే విజేతలను అధికారికంగా ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపునకు ఒక్కోరౌండ్‌కు 25 నుంచి 30 నిమిషాలు పడుతుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే మరింత సమయం పడుతుందని ఈసీ అధికారులు చెప్తున్నారు. ముం దుగా ఖమ్మం ఆఖరుగా నిజామాబాద్ పార్లమెంట్ ఫలితం వెల్లడి కానున్నదని అంచనా. నిజామాబాద్‌లో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీపడిన విషయం తెలిసిందే.

మధ్యాహ్నంకల్లా ఫలితంపై అంచనా

ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. మధ్యాహ్నంకల్లా 15 రౌండ్లు పూర్తిచేసే అవకాశం ఉండటంతో ఫలితాలపై ఒక అంచనాకు రావచ్చని తెలుస్తున్నది. కొన్ని నియోజకవర్గాల్లో 15 నుంచి 20 రౌండ్లలోనే ఫలితాలు తేలిపోనున్నాయి. అయితే వీవీప్యాట్లను కూడా లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితం కొంత ఆలస్యం కానున్నట్టు అధికారులు చెప్తున్నారు. కౌం టింగ్ కేంద్రంలో 14 లెక్కింపు టేబుళ్లతోపాటు, రిటర్నింగ్ అధికారికి ఓ టేబుల్ ఉంటుంది. కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ప్రతి అభ్యర్థికి టేబుల్‌కు ఒక ఏజెంట్ చొప్పున 15 మంది ఏజెంట్లకు అనుమతి ఉంటుందని, వీరందరికీ గుర్తింపుకార్డులు జారీచేస్తున్నట్టు ఈసీ పేర్కొన్నది. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5.30 గంటలకల్లా కౌంటింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. ఉదయం 5 గంటలకు స్ట్రాంగ్‌రూంలు తెరువనున్నట్టు అధికారులు తెలిపారు.
DG-Jitender1

అన్ని ఏర్పాట్లు పూర్తి

లోక్‌సభ ఎన్నికల లెక్కింపునకు కేంద్ర ఎన్నికలసంఘం అన్ని ఏర్పాట్లుచేసింది. లెక్కింపు కే్ంరద్రంలోకి సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు, సిగరెట్లు, మద్యం వంటివాటిని తీసుకురావద్దని అధికారులు సూచించారు. ఈసీ అనుమతి ఉన్నవారిని మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. లెక్కింపు తర్వాత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఇతర కార్యాలయాలకు లోకల్ హాలిడేగా ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీచేశారు.

అనుమతి తీసుకుంటేనే విజయోత్సవ ర్యాలీలు

లోక్‌సభ ఎన్నికల లెక్కింపునకు రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్టు ఎన్నికల నోడల్ అధికారి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు కలిపి మొత్తం 10వేల మందితో భద్రతా ఏర్పాట్లుచేసినట్టు వెల్లడించారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఎలక్షన్ సెల్ ఇంచార్జి, ఎస్పీ సుమతితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈవీఎం, వీవీప్యాట్లను రాష్ట్రవ్యాప్తంగా 37 ప్రాంతాల్లోని 123 స్ట్రాంగ్‌రూంల్లో భద్రపర్చి మూడంచెల భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 23న లెక్కింపు సందర్భంగా వాటిని కేంద్ర సాయుధ బలగాల నిఘాతో కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీస్ కమిషనర్లు, ఆయా జిల్లాల ఎస్పీల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. డీఎస్పీస్థాయి అధికారి పర్యవేక్షిస్తారన్నారు. కేంద్రాలకు 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అదనపు బలగాలను కేటాయించినట్టు తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకునేందుకు పోలీసు అనుమతి తప్పకతీసుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా సహకరించిన ప్రజలందరికీ తెలంగాణ పోలీసుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రశాంతవాతావరణంలో ముగిసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇందూరులో మాక్ కౌంటింగ్

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని సీఎంసీ కళాశాలలో నిజామాబాద్ నియోజకవర్గ మాక్‌కౌంటింగ్ నిర్వహించారు. కలెక్టర్, నిజామాబాద్ లోక్‌సభ రిటర్నింగ్ అధికారి ఎం రామ్మోహన్‌రావు సమక్షంలో అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా కంప్యూటర్ల ద్వారా మాక్ కౌంటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ విధానాన్ని ఏఆర్వోలు నిశితంగా పరిశీలించాలని, ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరిచూసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఏఆర్వోలు జాన్ శామ్సన్, వెంకటేశ్వర్లు, వేణు, గోపీరామ్, శ్రీనివాస్, డీబీసీడీవో ఉదయ్ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.

5903
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles