33 జిల్లాల తెలంగాణ


Sun,February 17, 2019 03:09 AM

Narayanpet And Mulugu Districts Mandals 33 Districts in Telangana

-నేటినుంచి ఉనికిలోకి ములుగు, నారాయణపేట జిల్లాలు
-ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ జారీ
-ములుగులో 9 మండలాలు,నారాయణపేటలో 11
-ఒక్కో రెవెన్యూ డివిజన్‌తోనే కొత్త జిల్లాల ఏర్పాటు
-కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, డీఎఫ్‌వోల నియామకం
-ప్రస్తుతానికి పాత జిల్లా కేంద్ర అధికారులకే అదనపు బాధ్యత

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లాల పునర్విభజనలో భాగంగా మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం తుది ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 31 జిల్లాలుండగా.. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన సీఎం కే చంద్రశేఖర్‌రావు పాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటును ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారుల కసరత్తు తరువాత.. రెండు జిల్లాలను ఏర్పాటుచేస్తూ కొద్ది రోజుల క్రితమే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీచేశారు. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులను పరిశీలించిన రెవెన్యూ శాఖ శనివారం తుది నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ తుది నోటిఫికేషన్ ప్రకారం ములుగు, నారాయణపేట కొత్త జిల్లాలు ఈ నెల 17 (ఆదివారం) నుంచి మనుగడలోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ జారీచేశారు. రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన గెజిట్‌లో ప్రచురించాలని తుది నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనితో ఆదివారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరుతుంది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, డీఎఫ్‌వోలను నియమించారు. పాత జిల్లా కేంద్ర అధికారులకే ప్రస్తుతం అదనపు బాధ్యతలు అప్పగించారు.

నారాయణపేటలో 11 మండలాలు

ఇప్పటివరకు మహబూబ్‌నగర్ జిల్లాలో భాగంగా ఉన్న 11 మండలాలతో (నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూర్, ఊట్కూర్, నర్వ, మక్తల్, మాగనూర్, కృష్ణ) కొత్తగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్టు తుది నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ కొత్త జిల్లాలో నారాయణపేట రెవెన్యూ డివిజన్ ఉంటుంది. ఈ రెవెన్యూ డివిజన్‌లోనే మొత్తం మండలాలుంటాయి. అంటే ఒక్క రెవెన్యూ డివిజన్‌తోనే కొత్త జిల్లా ఏర్పడినట్టు చెప్పవచ్చు. ఇక మండలాలవారీగా గ్రామాల సంఖ్య విషయానికి వస్తే.. నారాయణపేట మండలంలో 26 గ్రామాలుండగా.. దామరగిద్దలో 27, ధన్వాడలో 9, మరికల్‌లో 14, కోస్గిలో 26, ఊట్కూర్‌లో 27, మాగనూర్‌లో 20, కృష్ణలో 14, నర్వలో 20, మద్దూర్‌లో 30, మక్తల్ మండలంలో 39 గ్రామాలున్నాయి.

ములుగు జిల్లాలో 9 మండలాలు

ఇప్పటివరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ములుగు రెవెన్యూ డివిజన్‌ను నూత న జిల్లా కేంద్రంగా మొత్తం 9 మండలాలతో ఏర్పాటుచేశారు. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి (సమ్మక్క సారక్క), ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలతో కలిపి ములు గు జిల్లా ఏర్పాటయింది. కొత్త జిల్లా లో ఒక్క ములుగు రెవె న్యూ డివిజన్ మాత్రమే ఉండనుంది. కొత్త జి ల్లాలో మండలాలవారీగా గ్రామాల సంఖ్య చూస్తే.. ములుగులో 19 గ్రామాలుండగా వెంకటాపూర్‌లో 10, గోవిందరావుపేటలో 14, తాడ్వాయిలో 73, ఏటూరునాగారంలో 39, కన్నాయిగూడెం లో 25, మంగపేటలో 23, వెంకటాపురం లో 72, వాజేడు మండలంలో 61 గ్రామాలుంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

నేటినుంచే ఏర్పాటు.. అధికారయంత్రాంగం సిద్ధం

శనివారం జారీచేసిన తుది నోటిఫికేషన్ ప్రకారం ములుగు, నారాయణపేట జిల్లాలు ఆదివారం నుంచి మనుగడలోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగాన్నికూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ రెండు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, డీఎఫ్‌వోలను నియమిస్తూ ఉత్తర్వులను జారీచేసింది. ప్రస్తుతానికి పాత జిల్లా కేంద్ర అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రొనాల్డ్‌రోస్‌కు కొత్తగా ఏర్పాటయిన నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ వీ వెంకటేశ్వర్లుకు కొత్త జిల్లా ములుగు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రమా రాజేశ్వరికి నారాయణపేట ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించగా.. జయశంకర్- భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్‌కు ములుగు జిల్లా ఎస్పీగా అదనపు బాధ్యతలను అప్పజెప్పారు. భూపాలపల్లి డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టికి ములుగు డీఎఫ్‌వోగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. మహబూబ్‌నగర్ డీఎఫ్‌వో సీహెచ్ గంగారెడ్డి నారాయణపేట డీఎఫ్‌వోగా కూడా వ్యవహరిస్తారు.

5298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles