జీడీపీలో రియల్‌వాటా 18%


Sun,August 25, 2019 02:20 AM

NAR India Convention takes off in Hyderabad

-నార్ ఇండియా చైర్మన్ రవివర్మ వెల్లడి
-హెచ్‌ఐసీసీలో అట్టహాసంగా 11వ సదస్సు ప్రారంభం
-దేశం నలుమూలల నుంచి 1,500 మంది రియల్టర్లు హాజరు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఎదుగుదలకు తోడ్పడుతున్న అతిపెద్ద రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం రెండవదిగా ఉన్నదని, జీడీపీలో ఈ రంగం వాటా 17 నుంచి 18 శాతం వరకు ఉంటుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (నార్) చైర్మన్ రవివర్మ తెలిపారు. నార్ ఇండియా 11వ సదస్సు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వచ్చిన 1,500 మంది రియల్టర్లు హాజరైన ఈ సదస్సులో రవివర్మ మాట్లాడుతూ.. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంపై 250 పరిశ్రమలు ఆధారపడ్డాయన్నారు. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో 80 శాతం అమ్మకాలు రియల్టర్ల ద్వారానే జరుగుతున్నాయని ప్రైస్ వాటర్‌హౌజ్ కూపర్స్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మహ్మద్ ఆసిఫ్ ఇక్బాల్ అన్నారు. సైయంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రియల్టర్లు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ రంగంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. నార్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సుమంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సొంతిం టి కల నిజం చేయడంలో రియల్టర్లు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారన్నారు.

ప్రధాన ఆకర్షణగా నిలిచిన మహిళా రియల్టర్లు

పురుషాధిక్యతతో కూడిన రియల్ ఎస్టేట్ రంగంలో మహిళలూ సత్తా చాటుతున్నారు. ఈ వృత్తిలో రాణిస్తున్న అల్పనా సంజయ్ అగర్వాల్, ప్రద్న్య సబ్నిస్, మమతా కొవ్వూరు, ప్రియా శ్రీధర్ తదితరులు సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. నార్ ఇండియాలో దేశవ్యాప్తంగా 48 చాప్టర్లతోపాటు 30 వేలకుపైగా సభ్యులున్నారు. ఒక్క బెంగళూరు నుంచే దాదాపు 200 మంది రియల్టర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. సెలబ్రిటీ చెఫ్ సంజీవ్‌కపూర్ తన అనుభవాల్ని రియల్టర్లతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్ శైలేంద్రసింగ్, అధ్యక్షుడు ఇర్షాద్ అహ్మద్, సుజాత బుర్లా, ఆదిత్యా గౌరా, ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాళ్లలో పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. గౌరా వెంచర్స్, ఎన్సీసీ అర్బన్, బిల్డింగ్ బ్లాక్స్, మంత్రి డెవలపర్స్ తదితర సంస్థల స్టాళ్లు రియల్టర్లను విశేషంగా ఆకర్షించాయి. గేమ్ చేంజర్ థీమ్‌తో నిర్వహించిన నృత్య కార్యక్రమాలు అలరించాయి.

589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles