వెల్లువెత్తిన భాషాభిమానం


Thu,December 21, 2017 02:54 AM

Nandini Sidda Reddy Interview With Prapancha Telugu Mahasabhalu

తెలుగు మహాసభలతో తెలంగాణ స్వాభిమానానికి ఖ్యాతి
-అంతర్జాతీయ సదస్సుల నిర్వహణలో తెలంగాణ భేష్
-20 రోజుల వ్యవధిలో రెండు గొప్ప సదస్సులు
-నవంబర్‌లో జీఈఎస్, డిసెంబర్‌లో తెలుగు మహాసభలు
-జీఈఎస్‌తో పారిశ్రామిక ప్రపంచంలో ప్రఖ్యాతి
-2018లో మరిన్ని ప్రపంచ సదస్సులకు సన్నద్ధం
-ముఖ్యమంత్రి మార్గనిర్దేశంలో సమిష్టి కార్యాచరణలో అధికార యంత్రాంగం
-రెట్టించిన ఉత్సాహంలో సాహిత్య అకాడమీ
-నిరంతర కార్యక్రమాల కోసం వార్షిక కార్యాచరణ

SiddaReddy
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఐదు రోజుల పాటు రాజధానిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు యావత్ తెలంగాణ సమాజంలో మాతృభాషాభిమానం పెల్లుబికేలా చేశాయి. మహత్తరంగా సాగిన ఈ మహాసభల్లో పాల్గొనేందుకు 31 జిల్లాల నుంచి తెలంగాణ పౌరసమాజం ఉరుకలెత్తింది. మరుగున పడ్డ మన భాషాసాహిత్య సంపద వెలుగు చూసిన ఈ సందర్భం ప్రజల్లో భాషాచైతన్యాన్ని తీసుకొచ్చింది. దేశంలోనే అత్యంత పిన్నవయసున్న రాష్ట్రమైనా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తన ఖ్యాతి ఇనుమడించేలా అద్భుతమైన సదస్సులను నిర్వహించి 28 రాష్ర్టాలను అబ్బురపడేలా చేసింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంకల్పించినదే తడవుగా యావత్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఒక్కతాటిపై నిలిచి అందరూ ఔరా అనుకొనేలా.. ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా అలవోకగా అంతర్జాతీయ స్థాయి సదస్సులను దిగ్విజయం చేసింది. దీంతో తెలంగాణ ఖ్యాతి విశ్వవిఖ్యాతమైంది. తెలుగుసభల నిర్వహణ బాధ్యతను నెత్తినెత్తుకొన్న సాహిత్య అకాడమీ మరింత ఉత్సాహంతో కొత్త కార్యాచరణ రూపకల్పనలో నిమగ్నమైంది.

20 రోజుల్లో రెండు సదస్సులు..

మనకు పోటీ పక్క రాష్ర్టాలతో కాదు.. దేశాలతో అన్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మాటల నుంచి ప్రభుత్వ యంత్రాంగం ప్రేరణ పొందింది. కేవ లం 20 రోజుల వ్యవధిలో రెండు ప్రపంచ స్థాయి సదస్సులను అద్భుతంగా నిర్వహించిన రాష్ట్రం మనది. నవంబర్ 28 నుంచి మూడురోజులపాటు అగ్రరాజ్యం అమెరికా భాగస్వామ్యంతో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) అపూర్వంగా జరిగింది. అ మెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకాట్రంప్, ప్రధాని మోదీ సహా 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరైన సదస్సులో ఎవరికీ ఎలాంటి కష్టం కలుగకుండా అనితరసాధ్యమైన భద్రతా ఏర్పాట్లతో.. ఆహా అనిపించే ఆతిథ్యంతో అందరినీ సంతృప్తి పరిచింది. ఎంతోమంది వీఐపీలు ఈ సదస్సుకు హాజరైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ప్రణాళిక.. సమిష్టి కార్యాచరణతో ప్రభుత్వ యంత్రాం గం మన పోలీస్ వ్యవస్థ ఈ సదస్సును విజయవంతం చేయగలిగింది. ఇది జరిగి 15 రోజులైనా కాకుండానే డిసెంబర్ 15 నుంచి ఐదురోజులపాటు మన స్వాభిమానాన్ని, సారస్వతంపై మనకున్న సాధికారతను నిర్దంద్వంగా, నిక్కచ్చిగా విశ్వానికి చాటిచెప్పేందుకు ప్రపంచ తెలుగు మహాసభలను మరింత బాగా నిర్వహించుకున్నాం. మనమేమిటో.. మన సా మాజిక, సాంస్కృతిక నాగరికతావైభవ విరాడ్రూపం అంతర్జాతీయ సమాజానికి కనిపించింది. వివిధ రాష్ర్టాల నుంచి.. వివిధ దేశాల నుంచి హాజరైన 16వేల మంది ప్రతినిధులు తెలంగాణ సాహిత్యంతోపాటు తెలంగాణ ఆతిథ్యాన్ని కూడా లొట్టలేసుకొంటూ ఆస్వాదించారు.

సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో కదిలిన అధికార యంత్రాంగం..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్యమ నాయకుడిగానే కాదు.. పరిపాలనాదక్షుడిగా పక్క రాష్ర్టాలకే కాదు.. ఇతర దేశాలకు కూడా స్ఫూర్తినిచ్చేలా అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా.. దానిపై మొదటి నుంచీ ఒక స్పష్టమైన ఆలోచనతో..పక్కా ప్రణాళికతో.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను విభజించి అప్పజెప్పుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం కలిసికట్టుగా ముందుకు సాగుతూ.. అనుకున్న కార్యక్రమాలను అనుకున్నదానికంటే మెరుగ్గా విజయవంతం చేస్తున్నది. ప్రభుత్వ శాఖలన్నీ.. సమిష్టిగా వివిధ సదస్సుల నిర్వహణలో ఒక్కో పనిని విభజించుకొంటూ.. ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకొంటూ.. క్షేత్రస్థాయిలో ఏర్పడే సమస్యలను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకొంటూ ముందుకు సాగుతున్నాయి. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి.. అక్కడి నుంచి వచ్చిన సూచనల ప్రకారం మరింత ఉత్సాహంగా శ్రమిస్తున్నాయి.

మరిన్ని సదస్సులకు సై..

20 రోజుల వ్యవధిలో రెండు విభిన్న అంతర్జాతీయ సదస్సులను నిర్వహించి.. సదస్సులంటే ఇలాగే జరుపాలని హర్షాతిరేకాలు వ్యక్తమైన నేపథ్యంలో 2018 లో మరిన్ని సదస్సులు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రెట్టించిన ఉత్సాహంతో అడుగులు వేస్తున్నది. జనవరి 3నుంచి ఐదు రోజుల పాటు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 105వ ఇండియన్ కాంగ్రెస్ జరుగుతుంది. ప్రధాని మోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 14నుంచి 17 వరకు మైనింగ్ టుడే-2018 సదస్సు జరుగుతుంది. ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు నాస్కామ్ ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీలో జరుగుతుంది. ఫిబ్రవరి 22నుంచి 24వరకు ఇదే హెచ్‌ఐసీసీలో బయో ఆసియా సదస్సును నిర్వహిస్తారు. మార్చి 14నుంచి 18 వరకు పౌరవిమానయాన శాఖ భారత ఏవియేషన్ ప్రదర్శనను నిర్వహిస్తుంది.

ఇక ప్రతిఏటా తెలంగాణ తెలుగు సభలు

త్వరలోనే అకాడమీ కార్యక్రమాల క్యాలెండర్
రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి వెల్లడి

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ఏటా డిసెంబర్‌లో రాష్ట్ర స్థాయి తెలుగు మహాసభలను నిర్వహిస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నం దిని సిధారెడ్డి చెప్పారు. జనవరి నుంచే అకాడమీ నిర్వహించనున్న కార్యక్రమాల క్యాలెండర్‌ను రూపొందిస్తామని పేర్కొన్నారు. మార్చిలోగా వర్ధమాన రచయితలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. సాహిత్య అకాడమీ సారథ్యం లో నిరంతరం కార్యక్రమాలను నిర్వహించేవిధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నిర్వహణలో ప్రపంచ తెలుగు మహాసభలను జగద్వైభవంగా నిర్వహించగలిగామని, ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బాధ్యతగా పనిచేశారని పేర్కొన్నారు. బుధవారం నందిని సిధారెడ్డి మీడియా ప్రతినిధుల తో మాట్లాడుతూ ఆరు వేదికల మీద జరిగిన మహాసభల తీరుతెన్నులను వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంతో ప్రారంభించిన ప్రపంచ తెలుగు మహాసభల సంకల్పయాత్ర అద్భుతంగా జయప్రదమైందని ఆయన సంతోషం వ్యక్తంచేశారు. మొట్టమొదట తెలుగుభాషకు సంబంధించిన గొప్ప సాహిత్యాధారాలు తెలంగాణలోనే ఉన్నాయని చాటిచెప్పడం, భాషా సాహిత్యాలలో తెలంగాణ విశిష్టతలను తెలియచేయడం, తెలంగాణలో తెలుగు భాషావికాసాలకు అనన్య సామాన్యంగా కృషిచేసి మహోన్నత సంపదను ముందుతరాలకు అందించిన మహనీయులను చిరస్మరణీలయులను చేయాలన్న మూడు లక్ష్యాలను నూటికి నూరుశాతం సాధించామని సిధారెడ్డి చెప్పారు. ఆరు వేదికలపై ఐదు రోజులపాటు వందకు పైగా సాహిత్య కార్యక్రమాలు జరిగాయన్నారు. మహాసభల సందర్భంగా రెండు వందల పుస్తకాలను ఆవిష్కరించుకోగలిగామని, పాట, వచనకవిత్వం, పద్యకవిత్వం, నవల, కథ, గేయం, విమర్శ వంటి అన్ని సాహిత్య ప్రక్రియలపైన అర్థవంతమైన, గుణాత్మకమైన చర్చలు జరిగాయని సిధారెడ్డి వెల్లడించారు. సాహిత్య అకాడమీ 16 పుస్తకాలను ప్రచురించిందని నందిని సిధారెడ్డి చెప్పారు. ప్రచురణ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. అన్ని జిల్లాలలో సాహిత్య సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికీ కనుమరుగై ఉన్న రచయితలను, వారు రాసిన పుస్తకాలను, వారి సాహిత్య అమూల్య కానుకలను సంపాదించి ప్రచురిస్తామని సిధారెడ్డి తెలిపారు.

3510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles