కథ..సముద్రపు అల

Sun,October 13, 2019 02:50 AM

-ఘనంగా ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ కథల పోటీల బహుమతుల ప్రదానోత్సవం
-సమాజ రుగ్మతలు కథల్లో ప్రతిఫలించాలి: ప్రముఖ నవలారచయిత అంపశయ్య నవీన్
-ముల్కనూరు గ్రంథాలయ అభివృద్ధికి కృషి: రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు

వరంగల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నవల సముద్రమైతే.. కథ సముద్రపు అల వంటిదని ప్రఖ్యాత నవలారచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. సమాజంలో పఠనాసక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో రచనావ్యాసంగంపై అంతగా దృష్టి సారించలేని వాతావరణంలో కథల పోటీలు నిర్వహించడమే కాకుండా.. ఉత్తమ కథను ఎంపిక చేసి రూ.50 వేల నగదు బహుమతి ఇవ్వడం అపూర్వమని పేర్కొన్నారు. ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల బహుమతుల ప్రదానోత్సవం శనివారం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జరిగింది. ఈ సమావేశంలో నవీన్ మాట్లాడుతూ వర్ధమాన కథారచయితలు కథాంశాలను జాగ్రత్తగా ఎంపికచేసుకోవాలని.. సమాజ రుగ్మతలను పాఠకుల్లో చదివే ఆసక్తి పెంచేలా రచనలు చేయాలని సూచించారు.

కథారచనలో శిల్పరీతులను పాటించడం అవసరమని అభిప్రాయపడ్డారు. ముఖ్య అతిథిగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి బడి విద్యాలయమైతే, గుడి గ్రంథాలయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలు, కులాల సంప్రదాయాలను గౌరవిస్తూ సామరస్యపూర్వక, శాంతికాముక విధానాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో సమాజం పురోగమించాలని సూచించారు. ముల్కనూరు ప్రజాగ్రంథాలయానికి తన ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి నిధులనుంచి రూ.25 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. శాంతియుత విజ్ఞా నం అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఎలాంటి విద్వేషాలు లేకుండా పచ్చని పంటలతో రాష్ట్రం కళకళలాడాలని సీఎం కేసీఆర్ ఆశిస్తున్నారని చెప్పారు. ప్రజాగ్రంథాలయానికి నిధులను సమకూర్చడంతోపాటు గ్రంథాలయం హాలులో ఆడియోవిజువల్ వ్యవస్థ ఏర్పాటుకు, ఆధునిక హంగులతో డిజిటలైజేషన్ చేసేందుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని లక్ష్మీకాంతారావు హామీ ఇచ్చారు.

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: అయాచితం శ్రీధర్

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని రాష్ట్ర గ్రంథాలయాభివృద్ధి సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ పేర్కొన్నారు. సాహిత్యకారులు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులకు గ్రంథాలయాలు ఉపయోగపడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ పుస్తకప్రియుడు కావడంతో గ్రంథాలయాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు. నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా కథల పోటీలు నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కే సీతారామారావు మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రంథాలయాలు డిజిటలైజ్ కావాలని సూచించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తల రచనలు స్ఫూర్తిగా తీసుకొని యువతరం ఎదుగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజపు భావోద్వేగం, సంఘర్షణ, జీవనవిధానం వివిధ సాహిత్య రూపాల్లో ఇంకా ఊహించినంతగా రాలేదని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ సమాజ జీవితాన్ని ప్రతిబింబించే సాహిత్యం మరింత చిక్కగా, వాస్తవానికి దగ్గరగా రావాలన్నారు. తెలంగాణ సమాజం గొప్ప భావోద్వేగం నుంచి, పోరాట పరిస్థితుల నుంచి బయటపడి, ఇప్పుడిప్పుడే తనను తాను రూపొందించుకుంటున్నదని.. ఈ పరిణామం అంతా ఒకే పార్శంలో కాకుండా విభిన్నకోణాల్లో ఆవిష్కరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. తెలంగాణ సమాజ చిత్రణను కొంతవరకైనా అద్దంపట్టే రీతిలో రచనలు చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ముల్కనూరు ప్రజాగ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా కథల పోటీ నిర్వహించామని, భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో నవలా పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. పుస్తకపఠనం తగ్గిపోతున్న దశలో ముల్కనూరు ప్రజాగ్రంథాలయం గొప్పగా నిర్వహించడం మిగతావాళ్లకు స్ఫూర్తినిస్తుందని ఆయన ప్రశంసించారు. అనంతరం కథల పోటీలో బహుమతులు గెలుచుకున్న కథకులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్మన్ జీ సుధీర్‌కుమార్, ఎంపీపీ జక్కుల అనితారమేశ్, జెడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్ మాడుగుల కొమురయ్య, ముల్కనూరు గ్రంథాలయ నిర్వాహకుడు, జాయింట్ ఐజీ (స్టాంపులు రిజిస్ట్రేషన్లు) వేముల శ్రీనివాసులు, కిషన్, గొల్లపల్లి లక్ష్మయ్య, ఎదులాపురం తిరుపతి, తాళ్ళ వీరేశం, పల్లా ప్రమోద్‌రెడ్డి, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కథకులకు బహుమతుల ప్రదానం

ప్రథమ బహుమతి గెలుచుకున్న విత్తనం కథకుడు పెద్దింటి అశోక్‌కుమార్‌ను రూ.50వేల చెక్కు, ప్రశంసాపత్రం, శాలువాతో సత్కరించారు. ద్వితీయ బహుమతి పొందిన హరామ్ కథకుడు హుమాయూన్ సంఘీర్‌కు రూ.25వేల చెక్కు,ఒట్టిపోయిన అడవి కథకుడు శిరంశెట్టి కాంతారావుకు రూ.25వేల చెక్కు, తృతీయ బహుమతి పొందిన కథకులు పుట్టగంటి గోపీకృష్ణ (బేబక్క), ఎగుర్ల గణేశ్ (అమ్మ పండుగ), రామా చంద్రమౌళి (సిద్ధయ్య మఠం) ని సన్మానించారు. కథల పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ప్రముఖ రచయిత పెనుగొండ విశ్వేశ్వర్, నమస్తే తెలంగాణ ఫీచర్స్ ఎడిటర్ నగేశ్ బీరెడ్డి సహా పలువురిని సత్కరించారు.

768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles