తెలంగాణ అస్తిత్వ రెపరెపలు


Thu,December 7, 2017 03:44 PM

Nalleswaram Sankaram is a prominent figure in Telangana region

- మన భాష తీయదనం, విలక్షణతకు వేదికలు కానున్న ప్రపంచసభలు
- ఇక్కడి ప్రజల భాషకు వ్యాకరణ గ్రంథం కావాలి
- నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో తెరసం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం
naleshwaram
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో త్వరలో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక చారిత్రక ప్రత్యేకత ఉన్నదని తెలంగాణ రచయితల సంఘం (తెరసం) అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం అన్నారు. తెలంగాణ భాష తీయదనం, విలక్షణత, సొగసు, సౌందర్యం, ధ్వని, ఉచ్చారణలకు ఈ మహాసభలు వేదికలవుతాయని, తెలంగాణ భాష, సాహిత్య అస్తిత్వ జెండాలు రెపరెపలాడుతాయని ఆయన తెలిపారు. తెలంగాణ భాషకు వ్యాకరణం తీర్చిదిద్దడంపై మహాసభలు దృష్టి నిలుపాలని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం నమస్తే తెలంగాణ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..

ప్రపంచ తెలుగు మహాసభల విశిష్టత ఏమిటి?

భాష ఒక జీవనది. భాష సొగసు ప్రజల నాల్కల మీదనే ఉంటుంది. ఇందుకు ప్రత్యేక ఉదాహరణలు అవసరం లేదు. నన్నెచోడుడు, పాల్కురికి సోమన వాడిన పదబంధాలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల మాటల్లో కనిపిస్తుంటాయి. అయితే భాష చాలా పరిణామం చెందింది. అనేక చారిత్రక కారణాలతో కొద్దిమంది మాట్లాడే భాష వ్యావహారిక భాషగా చలామణిలో ఉన్నది. తెలంగాణ ప్రజల వాడుక భాష, ఉచ్చారణ, ధ్వనికి సంబంధించిన ఒక వ్యాకరణ పుస్తకం రావాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ తెలుగు మహాసభలు ఈ లోటును గమనిస్తాయని నా విశ్వాసం. కావాల్సిన విధంగా పుస్తకాల రూపకల్పన జరుగుతుందని నా ఆకాంక్ష.

తెలంగాణ తెలుగు అణచివేతకు గురైందన్న వాదనలపై మీరేమంటారు?

ప్రస్తుతం మనం ఒక విశాల దృక్పథంతో ఆలోచించాల్సిన సందర్భంలో ఉన్నాం. మనఇల్లు అయిన తెలంగాణకు ప్రపం చ తెలుగు భాషాభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాం. అయితే మనందరిలో తెలంగాణ ఉచ్ఛారణ అగౌరవం పాలైందనే భావన ఉన్నది. వివిధ ప్రాంతాలకు సంబంధించి వాడుకలో ఉన్న భాషకు యాస, మాండలికం, వ్యావహారికం అనే పర్యాయపదాలు ఉన్నాయి. అవి ఏవైనప్పటికీ, ప్రజలు సంరక్షించుకునే భాష జీవద్భాష. ఈమాట అన్ని ప్రాంతాలకూ వర్తిస్తుంది. తెలంగాణ ప్రజలు తెలంగాణ తెలు గు జీవద్భాషను పరిరక్షించారు. వారికి జేజేలు. రావిశాస్త్రి, చాసో, కాళీపట్నం వంటివారు అక్కడి మాండలికాలను రాసి, అక్కడి జీవభాషను బతికించారు. ఈ వరుసలో తెలంగాణ రచయితలు గొప్ప ప్రయోగాలు చేశారు. చాలా పేర్లు ఉదహరించగలను.

పూర్వ తెలంగాణ కవులలో తెలంగాణ భాషను పరిరక్షించినవారి గురించి చెప్పండి

మొదటివరుసలో నన్నెచోడుడు, పాల్కురికి సోమన వంటి మహనీయుల గురించి మనం తప్పకుండా చర్చించాలి. వారు తెచ్చింది భాషా విప్లవమే. ఇంటర్మీడియట్ వరకు తెలుగు తప్పనిసరి చేయడంపై.. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు తప్పనిసరి అనేది గొప్పనిర్ణయం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. మహాసభల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో చర్చనీయాంశమైంది. అయితే తెలంగాణలో మాట్లాడుకునే భాషకు ఒకప్రామాణికమైన వ్యాకరణాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటో తరగతి నుంచి మనం మాట్లాడుకునే మాటలతోనే పాఠ్యాంశాలు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. తద్వారా తెలుగు తప్పనిసరిగా తెలంగాణలో దేదీప్యమానమవుతుంది.

1489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS