పట్టాలిచ్చి.. పాస్‌బుక్‌లు మరిచారు!


Fri,July 12, 2019 02:08 AM

Nagarkurnool District Farmers Meets Dharmaganta

-కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స లబ్ధిదారుల మొర
-నాలుగు దశాబ్దాలుగా కాస్తులో ఉన్నా పట్టించుకోని అధికారులు
-ఇప్పటికైనా రికార్డుల్లో నమోదుచేసి పాస్‌పుస్తకాలు ఇవ్వాలి
-ధర్మగంటను ఆశ్రయించిన నాగర్‌కర్నూల్ జిల్లావాసులు

వెల్దండ: ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించి, బతుకుదెరువు కోసం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకొన్న లబ్ధిదారులకు భూమిలిచ్చారు. ఆ మేరకు పట్టాలు కూడా పంపిణీచేశారు. 1976 నుంచి ఆ భూముల్లో సాగుచేస్తున్న రైతులపై అధికారులు కనీస కనికరం చూపడం లేదు. నాలుగు దశాబ్దాలకుపైగా పాస్‌పుస్తకాలకోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమి పట్టాలకు విలువ లేకుండాపోయిందని లబ్ధిదారులు వాపోతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతెపల్లి గ్రామానికి చెందిన 10 మంది నిరుపేదలకు 1976లో అప్పటి ప్రభుత్వం 21.32 ఎకరాల భూమిని సాగు చేసుకొని జీవనం గడిపేందకు సీలింగ్ పట్టాలను అందజేసింది.

పట్టాలు ఇచ్చేందుకు పురుషులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవాలని నిబంధన పెట్టింది. దీంతో గ్రామానికి చెందిన 10 మంది రైతులు శాంతయ్య, బాలయ్య, గెల్వయ్య, చిన్నయ్య, మల్లయ్య, లక్ష్మయ్య, చిన్నమైసయ్య, జంగయ్య, పాండ్యానాయక్, బాలయ్యలు తమకు బతుకుదెరువు దొరుకుతుందని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకొని భూమి పట్టాలు పొందారు. పోతెపల్లి శివారులోని సర్వే నంబర్లు 176, 177, 178 లో 21.32 ఎకరాల భూమిని గ్రామంలోని పది మంది దళితులు సాగు చేసుకొంటున్నారు. దాదాపు 43 ఏండ్లుగా భూమి సాగుచేసుకొంటున్న రైతులు భూమి శిస్తును సైతం కడతున్నా.. రికార్డుల్లో మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. పట్టాలు ఇచ్చిన అధికారులు వాటి పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా నేటికీ కాలయాపన చేస్తూనే ఉన్నారు. కార్యాలయం చుట్టూ ఎండ్ల తరబడి తిరుగుతున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని లబ్ధిదారుల వారసులు వాపోయారు. చివరికి కోర్టును అశ్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యను పరిష్కరించాలని ధర్మగంటను ఆశ్రయించారు.

ఏండ్లుగా తిప్పించుకొంటున్నరు


కొమ్ము వెంకటయ్య, పోతెపల్లి

రెవెన్యూ అధికారులు ఏం డ్లుగా పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా తిప్పించుకొంటున్నరు. మా సమస్యను పట్టించుకుంటలేరు. పిల్లల జీవితాలు బాగుపడాలని మా పెద్దలు శస్త్రచికిత్సలు చేయించుకొని, పట్టాలు పొందిండ్రు. 40 ఏండ్లకుపైగా భూములను సాగుచేస్తున్నం. ప్రభుత్వం ఇచ్చిన భూమిపైనే ఆధారపడి మేమంతా జీవిస్తున్నం.
- కొమ్ము వెంకటయ్య, పోతెపల్లి

ఇప్పటికీ కాస్తులోనే ఉన్నం


శ్రీరాములు, పోతెపల్లి

1976 నుంచి ఇప్పటికీ మా నాయినకు ఇచ్చిన భూమిలోనే సాగు చేసుకుంట జీవిస్తున్నం. పట్టా లు ఇచ్చిండ్రు కానీ.. పాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదు. మాకు ఆ భూమే జీవనాధా రం. అధికారులు చొరవచూపి పాస్‌పుస్తకాలు జారీచేయాలి.
- శ్రీరాములు, పోతెపల్లి


అధికారులు కరుణించాలి


కృష్ణయ్య, పోతెపల్లి

మా పెద్దలు భూమి వస్తుందని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్నరు. నాటి నుంచి నేటి వరకు సాగు చేసుకొని మా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కరుణించాలి. స్పందించి మాకు పాస్‌పుస్తకాలిచ్చి న్యాయంచేయాలి
- కృష్ణయ్య, పోతెపల్లి

214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles