విషాద గ్రామాలు


Thu,September 13, 2018 01:21 AM

MP Vinod Kumar Pays Condolence to Kondagattu Bus Accident Victims

-60కి చేరిన మృతుల సంఖ్య.. శోకసంద్రంలో ఆరు గ్రామాలు
-తల్లిని పోగొట్టుకున్న బిడ్డలు.. భర్తను పోగొట్టుకున్న భార్య..
-హోరు వానలోనే అంత్యక్రియలు
-బాధితులను పరామర్శించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ వినోద్
-అంత్యక్రియలకు రూ.20 వేల చొప్పున అందజేసిన అధికారులు

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఇటీవలికాలంలో అత్యంత విషాదఘటనగా మారిన కొండగట్టు ప్రమాద ఉదంతంలో మృతుల సంఖ్య 60కి చేరింది. కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి మండలం రాఘవపూర్‌కు చెందిన రజిత, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన సుమలత బుధవారం మృతిచెందారు. దుర్ఘటనలో విగతజీవులైనవారితో కొడిమ్యాల మండలంలోని ఆరు గ్రామాలు మరుభూమిని తలపించాయి. హిమ్మత్‌రావుపేటలో 9 మంది, డబ్బు తిమ్మయ్యపల్లిలో 10 మంది, తిర్మలాపూర్‌లో 6, రాంసాగర్‌లో 9, శనివారంపేటలో 12 మంది కోనాపూర్‌కు చెందినవారు ఇద్దరు బస్సు ప్రమాదంలో మృత్యు వాతపడ్డారు. మంగళవారం మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి రాత్రికే స్వగ్రామాలకు చేర్చారు. బుధవారం అంతిమ సంస్కారాలు జరిగాయి. గ్రామాల్లో ఒకరిద్దరు చనిపోతేనే తల్లడిల్లిపోయే జనం ఏకంగా పదుల సంఖ్యలో గ్రామస్థులు ఒకే దుర్ఘటనలో చనిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఒక్కో ఇంట్లో ఒకటికి మించి మృతదేహాలుండటంతో ఆ విషాదానికి అంతులేకుండాపోయింది.

ఫ్రీజర్లను అందించిన స్వచ్ఛంద సంస్థలు

కొందరు మృతుల కుటుంబీకులు దూర ప్రాంతాల్లో ఉండటంతో వారు వచ్చే వరకు మృతదేహాలను భద్రపర్చే విషయం సమస్యగా మారడంతో మంగళవారం రాత్రి మృతదేహాలను ఐస్‌గడ్డలపై ఉంచి, ఉనుకతో కప్పిపెట్టారు. విషయం తెలుసుకున్న వైద్యశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, జాగృతి సంస్థ సభ్యులు ప్రతి మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్లను సమకూర్చారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ వినోద్, ఉమ, శోభ దుర్ఘటనలో మృతిచెందిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లిన ఎంపీ బీ వినోద్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నివాళులర్పించారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కొండగట్టులో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతులకు నివాళులర్పించారు. మృతుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని చూసి చలించిపోయిన ఎంపీ వినోద్ కరీంనగర్, జగిత్యాల కలెక్టర్లతో మాట్లాడి, ప్రతి కుటుంబానికి దహన సంస్కారాలకోసం తక్షణం రూ.20 వేలు అందజేయాలని కోరడంతో ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఉదయం 10:30 గంటలకు జోరుగా వాన పడుతున్నప్పటికీ.. వర్షంలోనే అంత్యక్రియలు నిర్వహించాల్సివచ్చింది.

క్యూ కట్టిన రాజకీయ నాయకులు, ప్రముఖులు

ఘటన స్థలంతోపాటు, మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరిశీలిచేందుకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు బుధవారం క్యూకట్టారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, మండవ వెంకటేశ్వర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బోయిని అశోక్, గజ్జెల కాంతం, మేడిపల్లి సత్యం, బండ శంకర్, సుద్దాల దేవయ్య, ఐల్నేని సాగర్‌రావు తదితరులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం కొడిమ్యాల మండలంలోని బాధిత గ్రామాలకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. టీడీపీ తరఫున మృతుల కుటుంబాలకు రూ. 25వేల చొప్పున అందజేశారు. సాయంత్రం బాధిత కుటుంబాలను స్వామి పరిపూర్ణానంద, మందకృష్ణమాదిగ పరామర్శించారు. మృతుల కుటుంబాలను జాగృతి సంస్థ జిల్లాశాఖ అధ్యక్షుడు అమర్‌దీప్‌గౌడ్ పరామర్శించారు. ఈసందర్భంగా జాగృతి జిల్లాశాఖ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలను కలిశామన్నారు.

ఆయన వెంట జాగృతి నాయకులు నీలగిరి రాజేందర్‌రావు, శ్రీనివాసరావు ఉన్నారు. రోడ్డు ప్రమాదం సంఘటనను ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ సేవ్ లైఫ్స్ ఫౌండేషన్ సభ్యులు బుధవారం పరిశీలించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం జరుపుతూ, ప్రమాద కారకాలను అన్వేషించడంతోపాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సేవ్ లైఫ్స్ సంస్థ పనిచేస్తున్నది. కొండగట్టు దుర్ఘటన జరిగిన నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర రోడ్డు సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్‌ను సంప్రదించారు. ఆయన ఆదేశాల నేపథ్యంలో సంస్థకు చెందిన ముగ్గురు ప్రతినిధి ఇంజినీర్లు, అభిజీత్, సౌరబ్, స్వరూప్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

mp-vinod2

మరుభూమి సాక్షిగా మహాకూటమికి పురుడుపోసే యత్నం

కొండగట్టు దుర్ఘటన సాక్షిగా విపక్షాల నేతలు కుళ్లురాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొండగట్టు దుర్ఘటనా స్థలాన్ని మహాకూటమికి పురుడుపోసే వేదికగా మార్చారు. ఓ పక్క సహాయ చర్యలు సాగుతుండగానే.. వాటికి ఆటంకం కలిగించేలా ధర్నాలు, ఘెరావ్‌లు చేయడం ప్రజలకు ఏవగింపు కలిగించింది. బుధవారం కాంగ్రెస్, టీడీపీ, సీపీఐకి చెందిన నేతలు భారీ కాన్వాయ్‌లో కొండగట్టుకు చేరుకొని మానవీయ దృష్టితో బాధితులను ఓదార్చాల్సింది పోయి, నాయకులను, ప్రభుత్వాన్ని సందర్భం లేకుండా దూషించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్లు చేశారు. మహావిషాదాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డగోలుగా నిందించడంద్వారా సానుభూతి పొందాలని కాంగ్రెస్ నేత వీహెచ్ తమ నేతలకు పిలుపునివ్వడం అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

కొండగట్టుకు ప్రత్యామ్నాయ మార్గం: ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ

ప్రయాణికులను సురక్షితంగా తీసుకువెళ్లేలా కొండ గట్టుకు ప్రత్యామ్నాయమార్గాన్ని గుర్తించాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, రోడ్డురవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ బుధవారం బస్‌భవన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లతో అత్యవసరసమావేశం నిర్వహించారు. ప్రమాద కారణాలపై చర్చించారు. భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచిం చడానికి పోలీస్, రోడ్లు, రవాణ, ఆర్టీసీ అధికారులతో కమిటీని ఏర్పాటుచేశారు. ముఖ్యంగా కొండగట్టుకు ఇతర విభాగాల సమన్వయంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేశారు.

2173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles