రవిప్రకాశ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలి

Tue,October 8, 2019 03:21 AM

-పీఎంఎల్‌ఏ, ఫెమా నిబంధనలకు ఆయన పాతరేశారు
-వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు
-ఆధారాలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా), ఆదాయం పన్ను చట్టం (ఐటీ యాక్ట్)తోపాటు రిజర్వుబ్యాంకు నిబంధనల ఉల్లంఘనల వ్యవహారంలో రవిప్రకాశ్‌పై దర్యాప్తు జరిపించాలని ఆయన తన లేఖలో కోరారు. ప్రభుత్వానికి పెద్దమొత్తంలో పన్నులు ఎగ్గొటిన మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషీ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సానా సతీశ్‌బాబుతో రవిప్రకాశ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, ఎలక్ట్రానిక్ మీడియా వృత్తిని దుర్వినియోగంచేసి బ్లాక్‌మెయిలింగ్ ద్వారా రవిప్రకాశ్ పలువురి నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలుచేయడంతోపాటు ఆ సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రవిప్రకాశ్‌కు అనేక దేశాల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఉగాండాలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో కార్పొరేట్ అకౌంట్‌ను కలిగివున్న రవిప్రకాశ్‌కు.. మీడియా ఎన్‌ఎక్స్‌టీ లిమిటెడ్ చైర్మన్‌గా జాంబియాలోని ఇండో జాంబియా బ్యాంక్ లిమిటెడ్‌లో మరో ఖాతా ఉన్నదని, మీడియా ఎన్‌ఎక్స్‌టీ లిమిటెడ్ డైరెక్టర్‌గా రవిప్రకాశ్ భార్య దేవికకు కూడా ఈ బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పటికీ ఆ వివరాలను భారత ప్రభుత్వానికి తెలుపలేదని అన్నారు.

2009లో రవిప్రకాశ్ ఉగాండ రాజధాని కంపాలా సిటీకేబుల్‌లో షేర్లు కొనుగోలు చేశారని, అదే సంవత్సరం నవంబర్ 27న ఆయనకు ఆ షేర్లు బదిలీ అయ్యాయని, అలాగే రవిప్రకాశ్ 2011 అక్టోబర్ 5న అమెరికాలోని మాయా విజన్ ఎల్‌ఎల్‌సీలో కొనుగోలుచేసిన 15 వేల షేర్ల వివరాలను కూడా ప్రభుత్వానికి తెలియజేయలేదని పేర్కొన్నారు. రవిప్రకాశ్ డైరెక్టర్‌గా ఉన్న ఐకాస్ట్ ఇంటర్నేషనల్ సంస్థ పీఎంఎల్‌ఏ, ఫెమా, ఐటీ యాక్ట్, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి అమెరికాలోని వైటీఈఎల్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతోపాటు అందులో 200 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారని, ఆ సమాచారాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదని తెలిపారు. సింబా మీడియా కెన్యా లిమిటెడ్‌లో రవిప్రకాశ్ వ్యక్తిగతంగా, సిటీకేబుల్ ద్వారా షేర్లు కొనుగోలు చేసినప్పటికీ ఐటీ రిటర్నుల్లో ఆ వివరాలను పొందుపర్చలేదని, అనేక చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించిన రవిప్రకాశ్‌పై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని విజయసాయిరెడ్డి పేర్కొంటూ.. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సుప్రీంకోర్టు జడ్జికి రాసిన లేఖలో పొందుపర్చారు.

955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles