ఎఫ్‌ఆర్‌బీఎంను 4 శాతానికి పెంచాలి

Thu,December 5, 2019 02:27 AM

-లోక్‌సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా తెలంగాణ రాష్ర్టానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5% నుంచి 4 శాతానికి పెంచాలని ఎంపీ రంజిత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీలో పన్ను రేట్లను హేతుబద్ధం చేయాలని కోరారు. ప్రస్తుతం కార్పొరేట్ ట్యాక్స్‌తోపాటు జీఎస్టీ వస్తు సేవలరేట్లను కూడా తగ్గించడంవల్ల రాష్ర్టాల ఆదాయం తగ్గుతున్నదని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించి వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నదని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిని మెరుగుపర్చడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు తొమ్మిది లక్షలు కావాలని కోరగా, కేంద్రం 3.5 లక్షల కనెక్షన్లను మాత్రమే ఇచ్చిందన్నారు. మిగతా కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. నిత్యావసర సరుకులకు, విలాసవంతమైన కార్లకు ఒకేవిధంగా పన్ను విధించొద్దని సూచించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ వర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను ప్రత్యేక నియామకపు ప్రక్రియలో భర్తీచేయాలని ఎంపీ రంజిత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం లోక్‌సభ జీరోఅవర్‌లో ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గ పరిధిలోని ఉర్దూ వర్సిటీలో మొత్తం 47 ప్రొఫెసర్ల పోస్టులు కాగా, అందులో 23 ఖాళీగా ఉన్నాయని, 95 అసోసియేట్ ప్రొఫెసర్లు , 266 అసిస్టెంట్ ప్రొఫెసర్లలో దాదాపు 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

దిశ ప్రతినిధులతో టీఆర్‌ఎస్ ఎంపీల భేటీ

పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేంద్రప్రభుత్వ పథకాల అమలుపై బుధవారం ఢిల్లీలో జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ (దిశ) ప్రతినిధులతో టీఆర్‌ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దిశ ప్రాజెక్టులోఉన్న 42 పథకాల్లో తెలంగాణలో 10 పథకాలను సమర్ధవంతంగా అమలుచేయవచ్చన్నారు. తెలంగాణకు వివిధ పథకాల కింద రూ.4 లక్షల కోట్ల నిధులు రావాల్సి ఉన్నదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో గ్రామీణాభివృద్ధి పథకాలు అమలయ్యేలా చూస్తామని ఎంపీ వెంకటేశ్ నేతకాని తెలిపారు. సమావేశంలో టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు, ఎంపీలు బీబీ పాటిల్, పీ రాములు, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్, రంజిత్‌రెడ్డి, దిశ ప్రాజెక్టు తెలంగాణ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, గ్రామీణాభివృద్ధిశాఖ ఆర్థిక సలహాదారు శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles