
-ప్రపంచ సమస్యలపై విస్తృతంగా చర్చలు-సదస్సు నిర్వహణపై జాగృతికి ప్రశంసలు-8 మందికి తెలంగాణ జాగృతి ఇండియా యూత్ ఫెలోషిప్-నేటి ముగింపు వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్ నరసింహన్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నోవాటెల్ వేదికగా ప్రారంభమైన జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాంధేయమార్గంలో సుస్థిరాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు పేరుతో నిర్వహిస్తున్న సదస్సును సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే.. ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ కవిత అధ్యక్షోపన్యాసం చేయగా, అన్నా హజారే, సార్క్ మాజీ సెక్రటరీ జనరల్ అర్జున్ బహద్దూర్ థాపా ప్రసంగించారు.. ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్‌గుప్తా వాక్ ద టాక్ ఆన్ యూత్ డెవలప్మెంట్ అంశంపై ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు. ఇందులో ఎంపీలు కవిత, అసదుద్దీన్ ఒవైసీ, గౌరవ్ గగోయ్ పాల్గొన్నారు.
అనంతరం గాంధీ, యూత్ అండ్ సస్టెయినబిలిటీ- పర్స్పెక్టివ్ ఫ్రం ద వరల్డ్ అంశంపై యూకే ఎంపీ సీమా మల్హోత్రా, న్యూజిలాండ్ ఎంపీ కన్వల్జిత్సింగ్ భక్షీ, ఒకినవా, ఆప్ఘనిస్తాన్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ వ్యవస్థాపకుడు జాన్ డిక్సన్, శ్రీలంక పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉప మంత్రి బుదికా పథిరాణా, మాసిడోనియా రిపబ్లిక్ పెట్టుబడుల శాఖ మాజీ మంత్రి గ్లిగర్ తస్కోవిచ్ ప్రసంగించారు. 2030 వరకు భవిష్యత్ మానవాళి మనుగడకు అవసరమైన ప్రాథమిక లక్ష్యాలను సాధించేందుకు ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా తెలంగాణ జాగృతి ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నది. ఇదే అంశంపై వేర్వేరుగా ఏర్పాట్లుచేసిన హాళ్లలో ప్రముఖులు పాల్గొని ప్రపంచ సమస్యలపై విస్తృతంగా చర్చించారు. సదస్సు నిర్వహణపై జాగృతిని ప్రశంసించారు. జాగృతి గురించి తెలిపేలా ఏర్పాటుచేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మాలావత్ పూర్ణకు తెలంగాణ జాగృతి యూత్ అచీవ్మెంట్ అవార్డు
జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు సందర్భంగా పలువురికి అవార్డులు, ఫెలోషిప్‌లు ప్రదానం చేశారు. 13 ఏండ్ల 11 నెలల అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణకు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే, ఎంపీ కవిత.. జాగృతి యూత్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చాటిన పూర్ణను సన్మానించారు. ఈ సందర్భంగా పూర్ణను ఎంపీ కవిత ప్రత్యేకంగా అభినందించారు. తన విజయంతో నిజామాబాద్ జిల్లాను ప్రపంచానికి పరిచయం చేసిందని పూర్ణను ప్రశంసించారు. మరిన్ని విజయాలు అందుకోవాలని దీవించారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా సామాజికరంగంలో విశేష సేవలందించిన ఎనిమిది మందికి తెలంగాణ జాగృతి ఇండియా యూత్ ఫెలోషిప్ ప్రదానం చేశారు. ఇందులో భాగంగా గ్రహీతలకు మెమెంటో, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ ఫెలోషిప్‌ను ఈ ఏడాది నుంచి ఇస్తున్నట్లు కవిత తెలిపారు. అనంతరం తన పక్కనే మాలావత్ పూర్ణకు కూర్చునే అవకాశం కల్పించిన కవిత.. అన్నా హజారేతో కలిసి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

రెండోరోజు ప్రముఖుల రాక
జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో రెండోరోజయిన ఆదివారం గ్లోబల్ పాలసీ ఇన్సైట్ సీఈవో ఆర్పిత్ చతుర్వేది, యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ ఈడీ కమల్‌సింగ్, భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రసంగిస్తారు. మహిళా నాయకత్వంపై ప్రత్యేక నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశంలో పలు రంగాల్లో రాణిస్తున్న, ప్రపంచంలో పలు కీలక హోదాల్లో ఉన్న మహిళా ప్రముఖులు పాల్గొంటారు. స్కిల్ బిల్డింగ్ ఫర్ సస్టెయినబిలిటీ, ఇన్నోవేషన్ వర్క్‌షాప్ మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాళ్లలో చర్చలు జరుగుతాయి. సాయంత్రం సదస్సు ముగింపు కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు.