త్వరలోనే ఎన్నారై పాలసీ


Sun,January 13, 2019 02:45 AM

mp Kavitha says telangana state is planning new NRI policy

-ఎన్నారైల సంక్షేమానికి రూ.100 కోట్లు
-వంద దేశాల్లో గులాబీ జెండా ఎగరాలి
-టీఆర్‌ఎస్ ఎన్నారై యూకే సెల్ ఎనిమిదో వార్షికోత్సవంలో నిజామాబాద్ ఎంపీ కవిత

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్నారైల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఇందుకోసం రూ. 100 కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే ఎన్నారై పాలసీని ప్రకటించుకుందామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణభవన్‌లో శనివారం టీఆర్‌ఎస్ ఎన్నారై యూకే (లండన్) శాఖ ఎనిమిదో వార్షికోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్‌చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాలు, గల్ఫ్ లాంటి దేశాల్లో తెలంగాణ బిడ్డల సమస్యలు ఒక్కోరకంగా ఉన్నాయన్నారు. అక్కడి వారికి ఇక్కడి పార్టీకి వారధులుగా ఎన్నారై సెల్ పనిచేయాలని కోరారు. అందరం కలిసి పనిచేస్తే దేశానికే కాదు ప్రపంచానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు. విదేశాల్లో తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ప్రొఫెసర్ జయశంకర్ సార్ వివరించారని, ఆయన సూచనలతో విదేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలు వివిధ పేర్లతో సంఘాలు పెట్టుకొని పని చేశారని తెలిపారు. ఆ సమయంలో రకరకాలుగా అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారని, నవ్విన నాప చేను పండిన చందంగా తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖలు ప్రస్తుతం 33 దేశాల్లో విస్తరించాయని, రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో గులాబీ జెండా ఎగిరేలా కృషిచేస్తామని ఎంపీ కవిత వివరించారు. మన ఇండస్ట్రియల్ పాలసీని చూసి అమెరికా వాసులు ఇలాంటి పాలసీ తమ వద్ద లేదన్న విషయం తెలంగాణ బిడ్డలుగా మనకు గర్వకారణమన్నారు. విదేశాల్లో ఉన్న ఎన్నారై విభాగం ప్రతినిధులు సోషల్ మీడియా అనే పదునైన ఆయుధం ద్వారా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రపంచానికి తెలిపేలా కేసీఆర్‌కు అండగా నిలువాలని బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ యూకే వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ఇప్పటివరకు ఏడు వార్షికోత్సవాలను లండన్‌లో జరుపుకొన్నామని తెలిపారు. పార్టీకి, సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, టాంకాం చైర్మన్ రంగారెడ్డి, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, న్యూజిలాండ్ శాఖ కోశాధికారి అభిలాష్ రంగినేని, యూఎస్ ప్రతినిధులు సుధీర్, సురేశ్, రమేశ్, టీఆర్‌ఎస్ ఖతార్ ప్రతినిధి అభిలాష్ బండి, దక్షిణాఫ్రికా ప్రతినిధి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

mp-KAVITHA2

జాగృతి సదస్సుకు అన్నా హజారే

ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడి
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల18న జరిగే ఇంటర్నేషనల్ యూత్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ (టీజేఐవైఎల్‌సీ) ప్రారంభకార్యక్రమానికి సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సదస్సుకు హాజరుకావాలని గవర్నర్ నరసింహన్‌ను శనివారం రాజ్‌భవన్‌లో కలిసి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 20న జరిగే ముగింపు కార్యక్రమానికి వచ్చేందుకు గవర్నర్ నరసింహన్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు. మొదటి రోజు యువత అభివృద్ధిపై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చర్చా గోష్ఠిని నిర్వహిస్తారని పది వేర్వేరు అంశాలపై చర్చా గోష్ఠులు జరగనున్నాయని తెలిపారు. 103 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని అన్నారు. 16 దేశాల నుంచి 70 మంది వక్తలు, 40 మంది ప్రత్యేక ఆహ్వానితులు వస్తారని వివరించారు.

2436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles