కేసీఆర్ ఆత్మబంధువు


Mon,March 25, 2019 07:52 AM

mp Kavitha Election Campaign In Nizamabad

-కారుకు ఓటేస్తే అభివృద్ధి జోరు..
-మిగతా పార్టీలకు వేస్తే బేకార్
-16 స్థానాల్లో గెలిపిస్తే సీఎం కేసీఆర్ వాటిని 116 చేస్తారు
-తెలంగాణలోనే బీడీ కార్మికులకు పింఛన్లు
-కాంగ్రెస్‌ది కుంభకోణాల చరిత్ర
-ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత

నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ మల్లాపూర్: తెలంగాణకు ఆత్మబంధువు కేసీఆర్ అని నిజామాబాద్ పార్లమెంటు టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. నిజమైన ఆత్మబంధువు ఎవరో గుర్తు పెట్టుకొని కారుగుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పదహారు ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. సీఎం కేసీఆర్ వాటిని 116 చేస్తారని, ఆ తేలివి తేటలు, ఆ చాతుర్యం, ఆ నైపుణ్యం సీఎం కేసీఆర్‌కు ఉన్నదని అన్నారు. అందరినీకూడగడతారని, రాష్ర్టాన్ని ఏ విధంగా బాగుచేస్తున్నారో, రేపటి నాడు దేశాన్ని బాగు చేయడానికి మన తెలంగాణ బిడ్డనే ముందడుగు వేస్తారని అది మనందరికి గర్వకారణమవుతుందన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా సిరికొండ, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో ఎంపీ కవిత ప్రసంగించారు. ఏ ఎన్నికైనా సరే కారు గుర్తుకు ఓటేస్తే తప్పకుండా అభివృద్ధి జోరుగా ఉంటుందని, మిగతా పార్టీలకు ఓటేస్తే బేకార్‌గా ఉంటుందన్నారు. తెలంగాణలో బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామని, దేశం మొత్తం ఇంకా పదమూడు రాష్ర్టాల్లో బీడీ కార్మికులు ఉన్నప్పటికీ వారిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చే వెయ్యి రూపాయల పింఛన్‌లో రూ. 800 తాము ఇస్తున్నామని బీజేపీ వాళ్లు చెప్తున్నారని, అది వాస్తవం కాదని, రూ. 200 కేంద్ర ప్రభుత్వం, రూ. 800 రాష్ట్రం ఇస్తున్నదన్నారు. బీజేపీ పాలిత గుజరాత్‌లో పింఛను రూ. 750 ఇస్తున్నారని, మిగతా రూ. 50 ఎటుపోయినట్టని ప్రశ్నించారు.

mp-kavitha2

ఢిల్లీ పీఠం పై ఎవరుండాలో తేల్చే ఎన్నికలివి

ఢిల్లీలో ఎవరుండాలనే విషయం పై ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయని, ఎంపీ ఎవరు కావాలి, ప్రధానమంత్రి ఎవరు కావాలి ఈ అంశాల కోసం ఎన్నికలు జరుగుతున్నాయని కవిత అన్నారు. హైదరాబాద్ కన్నా కొంత పెద్దగా ఉన్న దుబాయ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. దుబాయ్ కన్నా వెయ్యిరెట్లు పెద్దదైన భారత్ ఇంకా ఎందుకు అభివృద్ధి చెందలేదని ఎంపీ కవిత ప్రశ్నించారు. పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవటమే ఇందుకు కారణమన్నారు. గతంలో ఎంపీగా గెలిచిన మధుయాష్కీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మండలానికి రెండు గ్రామాలు కూడా తిరుగలేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ చరిత్రలో పాతాళంలో ఉండే బొగ్గు నుంచి అంతరిక్షంలో ఉండే తరంగాల వరకు అన్నీ కుంభకోణాలేనని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ ప్రయోజనాలకు పాతరేసినట్టే అని పేర్కొన్నారు. మల్లాపూర్‌లో ప్రసిద్ధి గాంచిన శ్రీ కనక సోమేశ్వర కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణానికి కృషిచేస్తానని, అలాగే కొండ పైకి కాలినడకన ఎక్కి సోమన్నకు మొక్కులను చెల్లిస్తానని తెలిపారు. ప్రచారంలో ఆమె వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తదితరులున్నారు.

1497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles