రెండ్రోజుల్లో మరింత చలి


Fri,January 11, 2019 02:31 AM

More Two days Heavy cold weather in Telangana

-ఉత్తరాది నుంచి శీతలగాలులు
-మంచుదుప్పట్లో రాష్ట్రం
-ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
-హైదరాబాద్‌లో 10.9గా నమోదు

హైదరాబాద్/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల తీవ్రతతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతుండటంతో పొడిగాలులు వీస్తున్నట్టు వెల్లడించారు. శుక్ర, శనివారాల్లో ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో శీతలగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 6 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మంచు దుప్పటి కప్పేస్తున్నది. ఉదయం 8 గంటలవరకు కూడా పొగమంచు కారణంగా రోడ్లు కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు సాయంత్రం 5 గంటలనుంచే చలి మంటలు కాగుతున్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టీ)లో 5, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 5.2, కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో 5.7, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 6, బేలలో 6.1, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 6.2, సిద్దిపేట జిల్లా పోతరెడ్డిపేట్‌లో 6.6, వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వాయర్- జన్నారంలో 6.7, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 6.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరికొన్ని రోజులు చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొంటున్నారు. అస్తమా, గుండె జబ్బులు, ఇతర వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Cold1

3690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles