వెలుగుచూడని బతుకులు


Sun,August 25, 2019 02:39 AM

Modern life away from sunlight

-గాలి చొరబడని ఇండ్లు.. ఎండ తగులని చర్మం
-సూర్యరశ్మికి దూరంగా ఆధునిక జీవితం
-చీకటిగదుల్లో ఐదింతల కాలుష్యం
-మూసిన కిటికీలు, వెంటిలేటర్లతో ప్రమాదం
-అత్యధికం విటమిన్ డీ లోపం కేసులే
-బోనస్‌గా ఆస్తమా, బీపీ, నిద్రలేమి

గాలి చొరబడని ఇండ్లు.. ఎండ తగులని చర్మం.. కష్టమెరుగని శరీరం.. చెమటచుక్క రాల్చని జీవితం! పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా జీవితం బందీఖానలోనే! తలుపులు మూసేసిన చీకటిగదుల్లో కాలుష్యం కాటేస్తుంటే.. శరీరం రోగాలమయం! ఒంటికి ఎండ సోకక డీ విటమిన్ లోపాలు! ఇంట్లో ఏ ఒక్కరికి జలుబుచేసినా, జ్వరమొచ్చినా.. ఇంటిల్లిపాదికీ వరుసబెట్టాల్సిందే! గొప్పలు చాటుకొనే క్రమంలో అనేకమంది ప్రకృతికి దూరంగా బతికేస్తున్నారని నిపుణులు అంటున్నారు. కిటికీలు, తలుపులు మూసుకుపోయిన ఇండ్లల్లో ప్రమాదకరమైన పద్ధతిలో ఇండోర్ జనరేషన్ రూపుదిద్దుకుంటున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పట్టణాల్లో 90% సమయాన్ని ఇండోర్‌లోనే (గాలి, వెలుతురు సోకని గదుల్లో) గడిపేస్తున్నారని వెలక్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ రిసెర్చ్ అండ్ డాటా ఎనాలసిస్ అనే సంస్థ పేర్కొంటున్నది. ఇండోర్ జనరేషన్ పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే మున్ముందు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శిరందాస్ ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గాలి, వెలుతురు. ఈ భూమి మీద సకలజీవుల ఉనికికి, మనుగడకు కారణమైన ప్రధాన అంశాలు. అంతటి ముఖ్యమైన అంశాలు.. కారణాలేమైనా ఇప్పుడు ఆధునిక జీవితాల్లో అట్టడుగు ప్రాధాన్యానికి పడిపోతున్నాయి. గాలి, వెలుతురును ప్రకృతి పుష్కలంగా ప్రసాదిస్తున్నా.. ఆస్వాదించడానికి అవకాశం ఉన్నవారు కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తుండటమే ఇక్కడ విషాదం. కిటికీలు, తలుపులు మూసేసిన ఇండ్లలో విద్యుత్ వెలుగులు నింపేస్తున్నారు. ఇండ్లేకాదు.. తరగతి గదులు, పనిప్రదేశాలు, వ్యాయామశాలలు ఆఖరుకు టాయిలెట్లు సైతం కృత్రిమ వెలుగుల మధ్యే ఉంటున్నాయి. ఫలితంగా గాలి, వెలుతురు చొరబడక.. అంతిమంగా మనిషి రోగాల బారినపడుతున్నాడు. గాలి, వెలుతురు రాకుండా తలుపులు మూసివేసిన ఇండ్లలో కాలుష్యం ఐదింతలు ఉంటుందని అంచనా.

చాలామంది పిల్లలు స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించడానికి తరగతి గదుల్లో సరైన గాలి, వెలుతురు లేకపోవడమేనని ఒక అధ్యయనంలో తేలింది. అన్నీ మూసిన గదుల్లో చదువులు పిల్లల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏసీ గదుల్లో పెరిగే, చదివే పిల్లలకంటే స్వేచ్ఛగా, ప్రకృతితో మమేకమై తిరిగేవారిలో ప్రజ్ఞాపాటవాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. పొద్దంతా ఎండలో గడిపే రైతన్నకు, ఇండోర్‌లో పనిచేసే వ్యక్తులకు మధ్య తేడాను వారు ప్రస్తావిస్తున్నారు. వడ్రంగులు, భవననిర్మాణ కార్మికులు, బోర్లువేసే కార్మికులు, ఇతరరత్రా కూలిపనులు చేసేవారు ఎండలో, దుమ్ముధూళి మ ధ్య పనిచేసినా.. వారు శ్వాససంబంధ సమస్య లు ఎదుర్కొనకపోవటానికి వారు ఆరుబయట పనిచేయడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. నగరాల్లో ప్రతి 10 మందిలో ఎనిమిదిమంది రోజుకు 22 గంటలు ఇండోర్‌లోనే గడిపేస్తున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

వైద్యులకూ బీపీ సమస్య!

గాంధీ మెడికల్ కాలేజీలో చదివిన ఓ బ్యాచ్ వైద్యులు ఇటీవల గెట్ టుగెదర్ ఏర్పాటుచేసుకొని క్షేమసమాచారాలు మాట్లాడుకొన్నారు. చాలామంది తమకు బీపీ సమస్య మొదలైనట్లు చెప్పుకొన్నారు. రోజంతా ఇండోర్‌లో క్లోజ్డ్ రూ ముల్లో గడపడం వల్లే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆఖరుకు వారంతా తేల్చారు.

పిల్లలను బయటికి తీసుకెళ్తేనే ఆరోగ్యం

ఉదయం ఏడింటికే ఆటోల్లోనో బస్సుల్లోనో బడికి వెళ్లే పిల్లలకు ప్రకృతి అంటే తెలియటం లేదు. వారానికొక్కసారైనా ఆరుబయట గడిపేందుకు వెళ్లే కుటుంబం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటున్నట్లు జర్మనీలోని హెడిల్‌బెర్గ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గాలివెలుతురు సోకడమే కాకుండా.. ఆర్థిక సంబంధ, మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడిపే తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. నగర వాతావరణంలో పెరిగే పిల్లలకు వారానికి ఒక్కసారైనా పల్లె వాతావరణం పరిచయం చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇండోర్ జనరేషన్‌లో సమస్యలివే..

-ఇంట్లోని గాలి కాలుష్యంతోనే 40% మందికి ఆస్తమా వస్తున్నది.
-చీకటిగదుల్లో జీవితాన్ని బందీచేసుకున్నవారికి తలనొప్పి, గొంతునొప్పి సమస్యలు అధికం.
-బాహ్యప్రపంచాన్ని చూడని మనుషుల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. మూసిన గదిలో జీవిస్తే ప్రభావం ఎక్కువ.
-కంటి సమస్యలు అధికమవుతున్నాయి.
-బీపీ సమస్య జటిలంగా మారుతుంది.
-సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.
-ఒంటి నొప్పులు, త్వరగా అలసిపోవడం, ఎముకల బలహీనత.
-శ్వాస సంబంధ సమస్యలు అధికమవుతాయి.
Velugu1

ఇలా చేద్దాం

-ప్రకృతితో మమేకం కావాలి. కిటికీలు సాధ్యమైనంత వరకు తెరిచి ఉంచాలి. ఏసీల వినియోగాన్ని తగ్గించుకోవాలి.
-ఉదయం వేళల్లో సూర్యరశ్మి ఇంట్లోకి నేరుగా, విస్తారంగా వచ్చేటట్లు చూసుకోవాలి.
-రోజూ పొద్దున శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. ఉదయం కనీసం 30 నిమిషాలైనా ఎండలో నడక అలవాటు చేసుకుంటే.. డీ విటమిన్ కాస్తయినా లభిస్తుంది.
-ప్రతి రోజు బయటికి వెళ్లాలి. ఇంటిని సహజసిద్ధమైన వెలుగులతో నింపాలి.
-ఉతికిన బట్టలను ఎండలోనే ఆరేయాలి. కార్పెట్లను క్రమం తప్పకుండా శుభ్రపర్చాలి.
-మూసి ఉన్న గదుల్లో వంటలు చేయొద్దు.

ప్రమాదకరంగా పనిప్రదేశం

Lingaiah
ఈ రోజుల్లో పనిచేసే చోటు ప్రమాదకరంగా మారింది. ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో ఓజోన్ శాతం పెరుగుతుంది. అది ప్రమాదం. ఇండోర్ గేమ్స్‌తోనూ ఇబ్బందే. ఎండ తగులకపోవటంవల్ల విటమిన్ డీ సరిపడా అందటం లేదు. ఏసీ గదుల్లో క్లోరో కార్బన్స్ లీక్ కావటం కూడా సమస్యే. ఏ ఇంట్లోనైనా గాలి వచ్చేవెళ్లే మార్గాలు లేకుండా చేయటం ప్రమాదం. క్లోజ్డ్ రూముల్లో పనిచేసేటప్పుడు ఎక్కువమంది ఉంటే కార్బన్‌డయాక్సైడ్ శాతం పెరుగుతుంది. అలాంటప్పుడు సమస్యలు తలెత్తడం ఖాయం. అందుకే ప్రతి ఒక్కరూ ఉదయం కాస్త ఎండ తగిలేటట్లు లైఫ్ స్టయిల్‌ను మార్చుకోవాలి.
- డాక్టర్ ఎన్ లింగయ్య, ప్రిన్సిపల్ సైంటిస్ట్, కెటాలసిస్ అండ్ ఫైన్ కెమికల్ డివిజన్, ఐఐసీటీ

సూర్యరశ్మితోనే ఆరోగ్యం పదిలం

Rameshsagar
మా దగ్గరికి వచ్చే చాలామందిలో బీపీ, శ్వాస సంబంధ సమస్యలు అధికం. కొన్నిసార్లు ఇంటిల్లిపాదీ వైరల్ ఫీవర్‌తో వస్తున్నారు. కొంచెం విశ్లేషిస్తే వారింట్లోకి గాలి, వెలుతురు రాని పరిస్థితులే కనిపిస్తున్నాయి. క్లోజ్డ్ రూముల్లో పనిచేసేవారికి ఆరోగ్య సమస్యలు అధికమవుతున్నాయి. ఆఖరుకు వైద్యుల్లోనూ బీపీ వంటి సమస్యలు తలెత్తడానికి కారణం రోజులో చాలాగంటలు ఏసీ గదుల్లో గడిపేయడమే. ప్రతి ఒక్కరి చర్మానికి కాసేపయినా సూర్యరశ్మి తగలాలి. అప్పుడే డీ విటమిన్ లోపాన్ని అధిగమించొచ్చు. ప్రతి ఒక్కరి నుంచి వ్యర్థాలు మలమూత్రాలద్వారానే బయటికి పోతాయని అనుకుంటారు. కానీ చర్మం ద్వారా కూడా అని తెలుసుకోవటంలేదు. ప్రతిరోజూ కాస్త చెమట పట్టేంత శ్రమ పడకుంటే కష్టమే. మా దగ్గరికి వచ్చేవారిలో శ్వాససంబంధ వ్యాధులకు కారణం వారి ఇంటి వాతావరణమే. కొందరు వ్యాయామం పేరిట కూడా ఏసీల్లోనే గడిపేస్తున్నారు. ఇంట్లోనే శ్వాస, తుమ్ము, దగ్గుల వల్ల గాలి కాలుష్యం ఏ స్థాయిలో ఉంటుందో గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఎండలో కాసేపయినా గడపడంవల్ల అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చు.
- డాక్టర్ రమేశ్‌సాగర్, వివేకానంద మెడికల్ సెంటర్, హయత్‌నగర్

1539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles