ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 12న

Tue,February 19, 2019 03:55 AM

-రాష్ట్రంలో ఐదు స్థానాలకు మోగిన నగారా
-షెడ్యూల్ విడుదల
-21న నోటిఫికేషన్.. నామినేషన్లు ప్రారంభం
-28 వరకు నామినేషన్ల స్వీకరణ
-మార్చి 1న పరిశీలన
-5న ఉపసంహరణ
-12న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్
-అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాలు
-15 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనున్నది. ఈ స్థానాలను భర్తీచేసేందుకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రాహుల్‌శర్మ షెడ్యూల్ విడుదలచేశారు. మార్చి 12న పోలింగ్ జరుగనున్నది. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, ఫలితాలు వెల్లడిస్తారు. 15వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తున్నట్టు రాహుల్‌శర్మ పేర్కొన్నారు. పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీలలో మహమూద్ అలీ (టీఆర్‌ఎస్), మహ్మద్ సలీం (టీఆర్‌ఎస్), టీ సంతోష్‌కుమార్ (టీఆర్‌ఎస్), షబ్బీర్ అలీ (కాంగ్రెస్), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్) ఉన్నారు.

టీఆర్‌ఎస్‌కే విజయావకాశాలు

మార్చి 29తో ఖాళీ అయ్యే ఐదు ఎమ్మెల్సీ స్థానాలన్నింటిని గెలుచుకునే సత్తా ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో అధికార పార్టీలో మరికొందరికి చట్టసభ సభ్యులుగా అవకాశాలు లభించనున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా ఈ కోటాలో టీఆర్‌ఎస్ మొత్తం స్థానాలు కైవసం చేసుకోనున్నది. రాష్ట్రంలో మొత్తం 119 మంది శాసనసభ్యులు ఎమ్మెల్యే కోటా కింద కొత్తగా ఎమ్మెల్సీలను ఓటు ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలాబలాను పరిశీలిస్తే ఐదుకు ఐదు సీట్లను అధికార టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోనున్నది.

మండలిలో గల్లంతుకానున్న కాంగ్రెస్

శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రతిపక్ష హోదాను కోల్పోగా, వచ్చే నెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆ పార్టీ శాసనమండలిలో గల్లంతు కానున్నది. ఇటీవలికాలంలో ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌ను కలిసి తమను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా కోరారు. ఈ వినతిని అంగీకరిస్తూ వారిని విలీనంచేశారు. దీంతో కాంగ్రెస్ బలం ఇద్దరికి పడిపోయింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదాకు అవసరమైన సభ్యుల సంఖ్య లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పార్టీకి ప్రతిపక్ష హోదాను, షబ్బీర్ అలీకి ప్రతిపక్ష నాయకుడి హోదాను రద్దు చేస్తూ మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. మండలిలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పదవీకాలం వచ్చే నెల 29తో ముగియనున్నది. దీంతో ఆ పార్టీ మళ్లీ ఎన్నికల్లో గెలిచి మండలిలో అడుగుపెట్టే అవకాశాలు లేకుండాపోయాయి. దీంతో వచ్చే ఏప్రిల్ నెల నుంచి శాసనమండలిలో కాంగ్రెస్ గల్లంతుకానున్నది.

ఏపీలోనూ ఐదు స్థానాలకు..

ఏపీలో కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగుస్తున్నదని, వీటి కి ఎన్నికలు తెలంగాణతోపాటే నిర్వహించేందుకు విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొన్నా రు. ఏపీలో పీ నారాయణ, లక్ష్మీశివకుమారి, పామిడి శమంతకమణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అప్పారావు పదవీకాలం మా ర్చి 29తో ముగుస్తున్నదని, ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

3792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles