హోదా ఏపీ ప్రజల శ్వాస


Wed,June 19, 2019 02:55 AM

MLA Kona Raghupathi elected as Deputy Speaker of AP Assembly

-ఇచ్చేదాకా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: ఏపీ సీఎం జగన్
-హోదా తీర్మానంపై అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రత్యేక హోదా ఏపీ ప్రజల శ్వాస అని, హోదా ఇచ్చేవరకు కేంద్రంపై ఒత్తిడితేస్తూనే ఉంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. అందరి జీవితాల్లో మార్పు తేవాలనే లక్ష్యంతో పనిచేస్తామని, తాము ప్రవేశపెట్టిన నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా సామాజిక మంత్రి మండలిని ఏర్పాటుచేశామని చెప్పిన జగన్.. నామినేటెడ్ పోస్టుల్లో కూడా సామాజిక న్యాయం పాటిస్తామని తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ర్టానికి ప్రత్యేక హోదాపై చేసిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానంపై విపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం.. సీఎం జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో పాలనావ్యవస్థలు నాశనమయ్యాయని, ధ్వంసమైన రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చడం కోసమే సీఎంగా ప్రమాణంచేశానని జగన్ పేర్కొన్నారు. నీతివంతమైన పరిపాలన అందిస్తామని, అలా చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. పారదర్శక టెండర్ల ప్రక్రియ కోసం జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేస్తామని తెలిపారు.

ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రానున్న ఐదేండ్లు తమ ప్రణాళికలు ఉంటాయన్నారు. మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ వలే భావిస్తాం. సీఎం, మంత్రుల చాంబర్లు చూస్తే మా మ్యానిఫెస్టో కనబడుతుంది. రైతులకు సున్నా వడ్డీకే రుణా లు ఇస్తాం. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభిస్తాం. రైతన్నల సంక్షే మానికి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తాం. రెండువేల కోట్లతో ప్రకృ తి వైపరీత్యాల నిధిని ఏర్పాటుచేస్తాం. విద్యాహక్కు చట్టాన్ని పునరుద్ధరిస్తాం.

జనవరి 26న అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తాం. వచ్చే ఐదేండ్లలో నిరక్షరాస్యత శాతాన్ని సున్నాకి తీసుకొస్తాం. పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు, అంగన్‌వాడీలకు జీతాలు పెంచాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేస్తాం. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించాం. ఆగస్టు 15న ఐదు లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమిస్తాం. అక్టోబర్ రెండున గ్రామ సచివాలయాలను ప్రారంభించి పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ను రద్దుచేస్తాం. జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తాం అని వివరించారు.

అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఆంధ్రప్రదేశ్ ఉభయసభలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. కొత్త ప్రభుత్వం ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు (19 గంటల 25 నిమిషాలపాటు) నడిచాయి. 175 మంది సభ్యులు ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

ప్రత్యేక హోదా సాధించలేకపోయాం: చంద్రబాబు

ఏపీకి ప్రత్యేక హోదాను తాము సాధించలేకపోయామని, హోదా సాధన బాధ్యతను ప్రజలు వైఎస్సార్సీపీకే ఇచ్చారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఏపీ ప్రత్యేక హోదా తీర్మానంపై చర్చలో భాగంగా మంగళవారం చంద్రబాబు మాట్లాడారు. గడిచిన ఐదేండ్లకాలంలో హోదా సాధన కోసం ప్రయత్నించామని, కానీ తమ వల్ల కాలేదని పేర్కొన్నారు. తాము విఫలమైనందుకు ప్రజలు వైఎస్సార్సీపీకి 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇచ్చారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి తెలంగాణకు చెందిన ఏడు ముంపు మండలాలను తమ ప్రభుత్వమే ఏపీలో విలీనం చేసిందని గుర్తుచేశారు.

డిప్యూటీ స్పీకర్ కోన

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలుచేయడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం సభానాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తదితరులు రఘుపతిని స్పీకర్ స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులంతా డిప్యూటీ స్పీకర్‌కు అభినందనలు తెలియజేశారు.

5794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles