కాంగ్రెస్‌ది హీన సంస్కృతిMon,April 16, 2018 03:09 AM

-అధికారం రాదనే అక్కసుతోనే విమర్శలు
-మేడ్చల్ కలెక్టర్.. రెవెన్యూ ఉద్యోగులను మాజీ మంత్రి సర్వే దూషించడం తగదు
-ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే వేముల వీరేశం ధ్వజం
vemula-veeresham
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వంపైన, అధికారులపైన అనుచితంగా ప్రవర్తించడం కాంగ్రెస్ హీన సంస్కృతికి నిదర్శమని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. అధికారం రాదనే అక్కసుతోనే కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సీఎం కేసీఆర్ పాలనను కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల మంత్రులు సహా అన్నివర్గాల వారు ప్రశంసిస్తున్నప్పటికీ ఇక్కడి కాంగ్రెస్ నేతలకు మాత్రం బుద్ధిరావడం లేదని విమర్శించారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కర్నె ప్రభాకర్, వేముల వీరేశం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు జూపల్లి కృష్ణారావు, జీ జగదీశ్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవుపలికారు. మంత్రి జూపల్లిపై ఇసుక అక్రమ రవాణ చేస్తున్నారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఇసుక పాలసీని పంజాబ్ కాంగ్రెస్ మంత్రి సిద్ధు ఓ వైపు ప్రశంసిస్తుండగా, అదే పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు చవకబారు ఆరోపణలుచేస్తున్నారన్నారు.

వీరిని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. సూర్యాపేట కలెక్టర్‌పైన, మంత్రి జగదీశ్‌రెడ్డిపైన చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవమూ లేదని, కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఎన్నారై సైదిరెడ్డి నుంచి ఆరు ఎకరాలు మాత్రమే ప్రభుత్వం సేకరించిందని, దీనికి సంబంధించి డబ్బులు కూడా చెల్లించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. మేడ్చల్ కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ దురుసుగా ప్రవవర్తించడం తగదని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. బాలానగర్ మెట్రో రైల్వేస్టేషన్‌కు అంబేద్కర్ పేరుపెట్టే కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగిపై దాడిచేసిన సర్వే వైఖరీ గర్హనీయమన్నారు. ఇటీవల రాజ్‌భవన్‌లో గవర్నర్ పట్ల కూడా సర్వే అనుచితంగా ప్రవర్తించారని గుర్తుచేశారు. సర్వే సత్యనారాయణతోపాటు కాంగ్రెస్ నేతలు తమ తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు.

కాంగ్రెస్ నేతల తీరుచూసి ప్రజలు నవ్వుకుంటున్నారు..

రెండు దశాబ్దాలపాటు టీఆర్‌ఎస్సే అధికారంలో ఉంటుందని, తమకు ఎప్పటికీ అధికారం రాదనే ఆందోళనతో కాంగ్రెస్ నాయకులు నిరాధార ఆరోపణలకు దిగుతున్నారని ప్రభాకర్, వీరేశం అన్నారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను గుర్తించకుండా కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, వారి తీరునుచూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేయడం తగదని, నాలుగేండ్లుగా ప్రభుత్వంపై చేసిన ఏ ఒక్క ఆరోపణలను నిరూపించలేకపోయారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై నిరాధార ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ప్రభాకర్, వీరేశం పేర్కొన్నారు.

829

More News

VIRAL NEWS