రాష్ర్టాభివృద్ధి పట్టని బీజేపీ


Wed,August 14, 2019 01:49 AM

Minister Talasani Srinivas Yadav Fires On BJP Leaders

-తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శం
-ఎంఐఎంతో దోస్తీని బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొడుతున్నారు
-మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉన్నందునే బ్యాలెట్ ఓటింగ్ ద్వారా 32 జెడ్పీలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టారని, దీనిని బీజేపీనేతలు గుర్తించడంలేదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. పొద్దునలేస్తే.. సీఎం కేసీఆర్ కుటుంబంపైపడి ఏడవడంతప్ప బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు రాష్ర్టాభివృద్ధి పట్టడంలేదని విమర్శించారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదానికి అనుగుణంగానే దేశం గర్వించేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుదేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది కల్వకుంట్ల ప్రభుత్వమని బీజేపీనేత లక్ష్మణ్ అనడంలో వింతేమున్నదని, కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం కొనసాగుతున్నట్టే.. తెలంగాణలో కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం నడుస్తున్నదని పేర్కొన్నారు.

కేంద్రంనుంచి నిధులు తెప్పించండి

ఎంఐఎంతో టీఆర్‌ఎస్ దోస్తీని బూచిగా చూపించి, ప్రజలను రెచ్చగొడుతున్న బీజేపీ నేతలు ఆ పార్టీతో పోరాడితే.. ఎవరువద్దన్నారు? మధ్యలో టీఆర్‌ఎస్‌ను ఎందుకు లాగుతున్నారని మంత్రి తలసాని ప్రశ్నించారు. కేంద్రంనుంచి నిధులు తెప్పించి ప్రజల్లో పరపతి పెంచుకుంటే బీజేపీని ఎవరు కాదన్నారని నిలదీశారు. నిన్నమొన్న బీజేపీలో చేరిన ఓవ్యక్తి కూడా ఏదేదో మాట్లాడుతున్నారని, టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు పార్టీ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చిందని, ఆయన తండ్రి గౌరవార్థం హైదరాబాద్‌లో విగ్రహం ఏర్పాటుచేసిన విషయాన్ని గుర్తుతెచ్చుకోవాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ బలపడుతానంటే ఎవరూ కాదనరని, నాలుగు ఎంపీసీట్లు గెలిచినంత మాత్రాన బీజేపీ నేతలు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు.

సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులెవరూ నామినేటెడ్ కోటాలో పదవులు తెచ్చుకోలేదని, ప్రజలు ఆశీర్వదిస్తేనే గెలిచారని స్పష్టంచేశారు. 370 ఆర్టికల్ రద్దును రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడొద్దని, దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం ప్రవేశపెట్టే ఆయా అంశాలకు మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్న తపనతో సీఎం కేసీఆర్ నీటి పంపకాలు సజావుగా ఉండేలా చొరవ చూపుతున్నారని చెప్పారు. కేంద్రం కొత్త పార్లమెంటు భవనాన్ని కడుతామంటే తప్పనిసరిగా మద్దతు ఇస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు భయపడదని, మున్సిపల్ ఎన్నికలు గడువులోపుగానే జరుగుతాయని, ముందస్తు ఎన్నికలకుపోయి గెలిచిన టీఆర్‌ఎస్‌కు ఎన్నికలంటే భయంలేదని తలసాని పేర్కొన్నారు.

1022
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles