అడ్డగోలు విమర్శలు కాదు..రాష్ర్టాభివృద్ధికి పాటుపడండి


Sun,August 25, 2019 02:38 AM

Minister Srinivas Goud Fires on BJP Leaders

-కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు
-జాతీయహోదా, నిధులు తీసుకురండి
-తెలంగాణ పథకాలను ప్రశంసించిన ప్రధాని సహా అనేకమంది మంత్రులు
-తెలియనట్టు రాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యలు
-బీజేపీలా మిస్డ్‌కాల్ సభ్యత్వాలు ఇస్తే మావి మూడు కోట్లు అవుతాయి
-బీజేపీ నేతలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అడ్డగోలు విమర్శలు మానుకుని, రాష్ర్టాభివృద్ధికి పాటుపడాలని, కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించి, నిధులు తేవాలని రాష్ట్ర బీజేపీ నాయకులకు ఎైక్సెజ్, పర్యాటక, క్రీడలశాఖల మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హితవు పలికారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెస్తే సంతోషిస్తామని అన్నారు. ఒకవైపు ప్రధానిమోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సహా అనేకమంది కేంద్రమంత్రులు తెలంగాణ పథకాలను, కార్యక్రమాలను ప్రశంసించడాన్ని ప్రస్తావిస్తూ.. ఇక్కడి బీజేపీ నాయకులకు అవి కనిపించడం లేదా? అని నిలదీశారు. బీజేపీలా మిస్డ్‌కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చేట్లయితే.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సభ్యత్వం మూడు కోట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శిస్తేనే బీజేపీ ఉన్నదని ప్రజలు గుర్తిస్తారనే భ్రమల్లో కాషాయపార్టీ నేతలు ఉన్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శనివారం శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరు గురించి తెలుసుకోవాలంటే.. రైతులను, ఆసరా పింఛన్ల లబ్ధిదారులను అడిగితే వారే చెప్తారని అన్నారు.

తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలను చూసి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక్కడ అధ్యయనం చేయడానికి అధికారులను, అనధికారులను పంపిస్తున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 51% సాగు పెరిగిందని నీతిఆయోగ్ తన తాజా నివేదికలో వెల్లడించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గతంలో బీజేపీ మంత్రులు రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఇక్కడి పథకాలను ప్రశంసించిన విషయాలను గుర్తుచేసుకోవాలని బీజేపీ నేత లక్ష్మణ్‌కు మంత్రి సూచించారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్‌లో మిషన్ భగీరథ అద్భుతమైన కార్యక్రమమని చెప్పారని, నీతిఅయోగ్ కూడా ఈ పథకాన్ని ప్రశంసించిందని గుర్తుచేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఇటీవలే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రశంసించారని, స్మృతిఇరానీ లాంటి అనేకమంది మంత్రులు సైతం ఈ కార్యక్రమాన్ని కొనియాడారని పేర్కొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన పీఎం కిసాన్ పథకం కూడా తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు పథకం స్ఫూర్తిగా తెచ్చిందేనని చెప్పారు. స్థానిక బీజేపీ నేతలు మాత్రం ఇవేవీ తెలియవన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ తరహా పథకాలు మీ రాష్ర్టాల్లో ఏవి?

రైతులకు ఉచిత కరంటు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్స్, సంక్షేమ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం వంటివి బీజేపీపాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. నోబెల్ బహుమతికి కేసీఆర్ అర్హుడేనని జల్‌శక్తి అభియాన్ బృందం సభ్యులు విపిన్ చంద్ర అన్నారని తెలిపారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ లేదని, బీసీ మంత్రి లేడని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్‌పై అధికారుల మనోభావాలు దెబ్బతినేలా బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర కరంట్ కోతలు ఉంటే.. ఇప్పుడు నిరంతర విద్యుత్ అందుతున్న విషయం వాస్తవం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ విషయంలో తెలంగాణ సాధించిన విజయాలను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్‌శర్మ ప్రశంసించారని గుర్తుచేశారు.

ఆలయాలమీద రాజకీయాలా?

గుడుల మీద రాజకీయాలు చేయాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. యాదాద్రి దేవాలయానికి కేంద్రం కనీసం రూ.100 కోట్లు అయినా కేటాయించిందా? అని ప్రశ్నించారు. పరిషత్ ఎన్నికల్లో 28 జిల్లాల్లో బీజేపీ కనీసం ఖాతా కూడా తెరువలేకపోయిందని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో పేదరికం పోవాలని, ప్రజలందరూ చల్లగా ఉండాలని, పొలాలు పచ్చబడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. మంత్రివర్గంలో ఉన్న జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, తాను తెలంగాణ ఉద్యమకారులం కాదా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయాలని, మూడు షిప్టుల్లో పనిచేయించాలని సూచించినందుకు జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ప్రజలందరు పండుగ చేసుకుంటున్నారని అన్నారు.

1313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles