మహిళా సంక్షేమానికి కృషిచేద్దాం


Sat,September 14, 2019 02:26 AM

Minister Satyavathi Rathod review meeting on women and child welfare

- అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మహిళా, శిశుసంక్షేమంలో తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుదామని మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందేలా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. శుక్రవారం అమీర్‌పేటలోని మహిళా, శిశుసంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా, శిశు సంక్షేమశాఖలో చిన్నారులు, మహిళలు అనేక సమస్యలతో మన వద్దకు వచ్చినప్పుడు ప్రేమతో దగ్గరకు తీసుకొని పరిష్కారం చూపించాలని సూచించారు. తల్లి పాల ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.

సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ఇంటింటికి అంగన్‌వాడీ పేరుతో పోషకాహారలోపాన్ని తగ్గించే కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో భాగంగా సెప్టెంబర్ నెలను పోషణ్ అభియాన్ మాసంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమీక్షా సమావేశంలో మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్, డైరెక్టర్ విజయేంద్ర బోయి, దివ్యాంగులశాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమీర్‌పేటలోని శిశుసంరక్షణ కేంద్రాన్ని సందర్శించి పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్నారు. పలువురు చిన్నారులను ఎత్తుకొని ఆడించారు.

గిరిజన ప్రగతికి కృషి

అభివృద్ధికి దూరంగా ఉంటున్న గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ సర్కారు ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. శుక్రవారం సంక్షేమ భవన్లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బెనహర్ మహేశ్‌దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా ఝడ్ చోంగ్తు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు భిక్షపమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్‌వాడీ ఉపాధ్యాయులు మంత్రి సత్యవతి రాథోడ్‌ను శుక్రవారం సచివాలయంలో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రికి దోమతెరను బహుకరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల, సౌజన్యం, విజయలక్ష్మి, సునీత, వెంకటరమణ, సౌదామిని, ఇందిర, కవిత, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles