పల్లెల్లో ప్రణాళిక పండుగ


Sat,September 14, 2019 03:02 AM

Minister Puvvada Ajay Kumar Participated in 30 Day Action Plan Program

-ఎనిమిదో రోజు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
-ముమ్మరంగా గ్రామసభలు
-అభివృద్ధి కార్యక్రమాల్ని నిర్దేశించుకుంటున్న గ్రామసీమలు
-పారిశుద్ధ్యం, హరితహారంపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో 30 రోజుల ప్రణాళిక ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్నది. గ్రామసీమల అభివృద్ధికి ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలకు తోడుగా మంత్రులతోపాటు ప్రజాప్రతినిధులంతా పల్లెబాట పడుతున్నారు. గ్రామాలను అభివృద్ధి చేయాలనే 30 రోజుల లక్ష్యానికి అనుగుణంగా ప్రగతిపనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులతోపాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా ప్రతి రోజూ రెండుమూడు గ్రామాలకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధంచేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళుతున్న ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు శ్రమదానం కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామంలోని మహిళా, స్వచ్ఛందసంఘాలు, యువతీయువకులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ఎనిమిదోరోజు శుక్రవారం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, తన్నీరు హరీశ్‌రావు, జీ జగదీశ్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్యేలు, అధికారులు విస్తృతంగా పర్యటించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామం లో రూ.1.82 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ పనులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శంకుస్థాపనచేశారు. పాఠశాల ఆవరణలో అంగన్వాడీ భవన నిర్మాణం, గ్రామంలో యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణపనులకు కూడా శంకుస్థాపనచేశారు. జిల్లాలోని భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్ గ్రా మంలో జరిగిన కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని అడికిచెర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్‌ఖానమ్ పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో కలెక్టర్ పీజే పాటిల్ పాల్గొన్నారు. మంచిర్యాల జన్నారం మండలంలోని ఇందన్‌పెల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి వివిధకాలనీల్లో పర్యటించి, రోడ్లపైన పేరుకుపోయిన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించి, గుంతలను పూడ్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా జరుగుతున్న పనులను కలెక్టర్ శివలింగయ్య పరిశీలించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పర్యటించారు.
Palle-Pragathi

784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles