రోత రాతల చంద్రజ్యోతి


Thu,May 23, 2019 02:26 AM

Minister Prashanth Reddy Fires on Andhra Jyothi Over False News

-ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కట్టుకథలు
-బిల్లులు చెల్లించక ఎక్కడా పనులు ఆగలేదు
-తెలంగాణపై విషం కక్కుతున్న రాధాకృష్ణ.. చంద్రకృష్ణగా పేరు మార్చుకో
-ఎగ్జిట్ పోల్ ఫలితాలతో రాధాకృష్ణకు మైండ్ బ్లాంక్ అయింది
-మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజలను తప్పుదోవపట్టించడానికే ఆంధ్రజ్యోతి కట్టుకథలతో రోత రాతలు రాస్తున్నదని, ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా కథనాలు ప్రచురిస్తూ పత్రిక ఎండీ రాధాకృష్ణ తెలంగాణపై వ్యతిరేకత, విషం చిమ్ముతున్నారని రాష్ట్ర రవాణా, ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాలు గెలుచుకుంటుందని ఇటీవల ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించడంతో రాధాకృష్ణ మైండ్ బ్లాంక్ అయిందని.. దీంతో పిచ్చిరాతలు, పిచ్చికూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాధాకృష్ణ పేరును చంద్రకృష్ణగా, పత్రిక పేరును చంద్రజ్యోతిగా మార్చుకొంటే మంచిదని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, టీఎస్‌టీఎస్ చైర్మన్ రాకేశ్, టాంకాం చైర్మన్ రంగారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిధుల కొరతతో ఎక్కడా నిర్మాణ పనులు నిలిచిపోలేదని.. బుధవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం శుద్ధ అబద్ధమని మంత్రి స్పష్టంచేశారు. తప్పుడు వార్తలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు.

రాష్ట్రంలో అభివృద్ధి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు ఇక్కడికి వచ్చి పనులు జరుగుతున్న తీరును చూసి ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. ఉమ్మడిరాష్టంలో ఆర్‌అండ్‌బీ శాఖలో ఏడాదికి రూ.500-600 కోట్ల కంటే ఎక్కువ పనులు చేపట్టలేదని, కానీ తెలంగాణలో మాత్రం రూ.రెండువేల కోట్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణపై విషప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. తప్పుడు వార్తలపై న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తున్నామని, ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. గతంలో సీఎం కేసీఆర్‌పై ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా.. ఆయన నాయకత్వం రాష్ర్టానికి అవసరమంటూ ప్రజలు టీఆర్‌ఎస్‌ను 88 సీట్లతో రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశమైనా అప్పు చేస్తుందని, అయితే ఆ అప్పు దేనికి ఖర్చు పెట్టారనేదే ముఖ్యమని.. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని అన్నారు.
Prashanth-Reddy1

తప్పుడు ఫొటో.. తప్పుడు లెక్కలు

ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకు ఫొటో మిషన్ భగీరథకు సంబంధించినదని కాదని.. భగీరథ ట్యాంకులన్నీ ఆరు పిల్లర్లతోనే డిజైన్ చేశామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కానీ, ఎనిమిది పిల్లర్లతో ఉన్న తప్పుడు ఫొటోను ప్రచురించారని ఆధారాలతో బయటపెట్టారు. రాష్ట్రంలో 50 ఏండ్లల్లో 20 వేల నీటి ట్యాంకులను నిర్మిస్తే.. మిషన్ భగీరథ కింద 18,500 నిర్మించాలని నిర్ణయించి, ఇప్పటివరకు 14 వేల ట్యాంకుల నిర్మాణాన్ని పూర్తిచేశామని, మిగిలినవి చివరి దశలో ఉన్నాయని తెలిపారు. మిషన్ భగీరథలో మెయిన్‌గ్రిడ్ పైపులైన్ పనులు పూర్తయ్యాయని, గ్రామాల్లోని అంతర్గత పైపులైన్ పనులు కూడా 90 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. దాదాపు రూ. 30 వేల కోట్ల పనుల్లో రూ.వేయి కోట్ల పని మాత్రమే మిగిలి ఉన్నదన్నారు. మెయిన్ పనుల్లో రూ.25,507 కోట్లు చెల్లించామని, కేవలం రూ.424 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉన్నదని చెప్పారు. రూ.4,185 కోట్ల ఇన్‌ఫ్రా పనుల్లో రూ.243 కోట్ల బిల్లులు మాత్రమే పెండింగ్ ఉన్నాయన్నారు. రహదారులు, భవనాలశాఖలో రూ.13,234 కోట్ల పనులు చేపట్టగా ఇప్పటివరకు రూ.7,100 కోట్ల పనులు పూర్తి అయ్యాయని, వీటిలో రూ.6500 కోట్ల బిల్లులు చెల్లించామని, మరో రూ.600 కోట్లు చెల్లించాలని చెప్పారు.

భవనాల్లో రూ.2,435 కోట్లు పనులు చేపట్టగా రూ.1,308 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని వీటిలో రూ.1,238 కోట్ల బిల్లులు చేల్లించామన్నారు. రూ.69 కోట్ల బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గజ్వేల్ రింగ్‌రోడ్ పనులు నిలిచిపోయాయని, రూ.30 కోట్ల బిల్లులు ఇవ్వాల్సి ఉందంటూ తప్పుడు వార్త రాశారని.. వాస్తవంగా రూ.184.94 కోట్ల విలువైన పనులు మంజూరయితే ఇప్పటివరకు రూ.112 కోట్లు పనులు పూర్తయ్యాయని, అందులో రూ.100 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌కు సంబంధించి కూడా ఇదేవిధంగా రాశారని.. రూ.38.38 కోట్లతో పనులు చేపట్టగా ఇప్పటివరకు రూ.11.75 కోట్లు పనులు పూర్తయ్యాయని, రూ.11.67 కోట్లు బిల్లులు చెల్లించినట్టు చెప్పారు. రూ.8 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉందని, పనులు కూడా ఎక్కడా ఆగలేదని తెలిపారు. మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డు పనులు మంజూరై టెండర్ ఖరారయింది ఏడాది క్రితమేనని, ఇప్పటివరకు 10.59 కోట్ల పనులు జరిగితే రూ.5.41 కోట్ల చెల్లింపులు జరగ్గా మరో రూ.5.18 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి వివరించారు.

12907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles