అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్టా సదస్సు


Thu,June 20, 2019 02:19 AM

Minister Niranjan Reddy Speak On International Seeds Congress Conference

- ఈ నెల 26న సదస్సును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- తెలంగాణ సీడ్‌బౌల్ కావాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష
- అంతర్జాతీయంగా విత్తన ఎగుమతులకు అవకాశాలు
- మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ విత్తన సదస్సు (ఇస్టా)ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఆసియాలో తొలిసారిగా తెలంగాణలో జరుగనున్న 32వ ఇస్టా సదస్సును ఈ నెల 26న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని తెలిపారు. బుధవారం బేగంపేటలోని హోటల్ టూరిస్ట్ ప్లాజాలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సీడ్‌బౌల్ కావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా ఆయన దిశానిర్దేశంలో ఐదేండ్లుగా కార్యాచరణ చేపట్టామన్నారు. ఆ అనుభవంతోనే ఇస్టా కాంగ్రెస్‌కు అతిథ్యమిస్తున్నట్టు చెప్పారు. నాణ్యమైన విత్తనాలను అందించేందుకు అంతర్జాతీయ పరిశోధనలు, సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఎనిమిది రోజులపాటు కొనసాగే ఈ సదస్సుతో అంతర్జాతీయ విత్తన ఎగుమతులకు అవకాశాలు మెరుగవుతాయని, నూతన సాంకేతికత రైతులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రపంచదేశాల్లో పండే పంటలన్నీ తెలంగాణలో పండటం ఇక్కడి నేల విశేషమని, నాణ్యమైన విత్తన ఉత్పత్తికి మన రాష్ట్రం అనుకూలమైందని పేర్కొన్నారు.

జూలై 3న ముగింపు వేడుక

ఎనిమిది రోజులపాటు కొనసాగే ఈ సదస్సుకు 70 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరవుతారని, అలాగే దేశంలోని వివిధ పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి 300 మంది నిపుణులు హాజరవుతున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సదస్సు సందర్భంగా తెలంగాణ వైభవం, సంస్కృతిని చాటేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని, జూలై 3వ తేదీన జరిగే ముగింపు వేడుకకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, తెలంగాణ సీడ్స్ డైరెక్టర్, ఇస్టా కోఆర్డినేటర్ డాక్టర్ కే కేశవులు, మార్క్‌ఫెడ్ ఎండీ భాస్కరాచారి, వ్యవసాయశాఖ అదనపు కమిషనర్ విజయ్‌కుమార్, సీడ్ సర్టిఫికేషన్ డిప్యూటీ డైరెక్టర్లు సుదర్శన్, రవీందర్‌రెడ్డి, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్లు సదానంద్, వెంకటేశ్వర్‌రావు, మార్కెటింగ్‌శాఖ ఓఎస్డీ జనార్దన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు హైటెక్స్, హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఇస్టా కాంగ్రెస్ సదస్సు వేదికల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

140
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles