టీఆర్‌ఎస్ హుషారు విపక్షం బేజారు


Fri,October 12, 2018 01:57 AM

Minister KTR Speech in TRS Party Cadre Meeting at Sircilla

-పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న గులాబీ దళం
-ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కిలా కూటమి వ్యవహారం
-ఎక్కడ.. ఎన్ని సీట్లో తెలియక భాగస్వామ్య పార్టీల్లో గందరగోళం
-సర్దుబాట్లు త్వరగా తేల్చాలంటూ కోదండరాం అల్టిమేటం
-మాకూ సీట్లు కావాలంటూ టీడీపీ మహిళా నేతల గోల
-బీజేపీలో చేరిన రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి
-పార్టీ నాయకుల ఒత్తిడితో సాయంత్రానికే మళ్లీ కాంగ్రెస్‌లోకి..
-మొదటి విడుత ప్రచారాన్ని పూర్తిచేసిన టీఆర్‌ఎస్
-ఇప్పటికే నాలుగుజిల్లాల్లో బహిరంగసభల్లో పాల్గొన్న కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తూ గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతుంటే.. ప్రతిపక్ష పార్టీలు కూటమి పేరుతో కుమ్ములాటలతో క్షేత్రస్థాయి క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తున్నాయి. నెలరోజుల క్రితమే 105 మంది అభ్యర్థులను ప్రకటించి టీఆర్‌ఎస్ ముందువరుసలో నిలువగా.. అసలు తాము ఎన్నిచోట్ల, ఏయేస్థానాల్లో పోటీచేస్తామో తెలియక తర్జనభర్జన పడుతున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి.. అక్టోబర్ 3 నుంచి 5 వరకు నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో భారీ బహిరంగసభలు నిర్వహించారు. ఈ సభల్లో తన ప్రసంగంతో పార్టీ క్యాడర్‌లో మరింత ఉత్తేజం నింపారు. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ కవిత పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటుచేసుకొని పక్కా ప్రణాళిక, వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాలవారు ముందుకొస్తుండటంతో టీఆర్‌ఎస్‌లో చేరేవారితో తెలంగాణభవన్ నిత్యం కిటకిటలాడుతుండగా.. కాంగ్రెస్ నాయకులు గోల్కొండ హోటల్, కూటమి పార్టీల నేతల ఇండ్ల వద్ద మోకరిల్లుతుండటంతో గాంధీభవన్ వెలవెలబోతున్నది. ఒక్కపార్టీగా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేమని.. అలా అయితే డిపాజిట్లు కూడా దక్కవని గ్రహించిన కాంగ్రెస్.. సిద్ధ్దాంతాలు, ప్రజల ఆకాంక్షలను సైతం పక్కకు పెట్టి నాలుగుపార్టీలతో మహాకూటమి ఏర్పాటుకు ముందుకొచ్చింది. అయితే కూటమి కడుతామని ప్రకటించిన నాటినుంచి చర్చల దశలోనే ఒక అడుగు ముందు కు.. రెండడుగులు వెనకకు అన్నట్టుగా వారి వ్యవహారం సాగుతున్నది. జెండా, ఎజెండా అనేది లేకుండా అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా కిందామీదా పడుతున్నాయి. కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందిస్తామని ప్రకటించినా.. అదికూడా నేటికీ అతీ గతీ లేదు. ఏ సీటు ఎవరికిపోతుందో తెలియక కూటమిలోని పార్టీల నేతలు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది.

కాంగ్రెస్‌లో పద్మినీరెడ్డి కలకలం

మహాకూటమి పొత్తులు తేలక కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటుంటే.. ఆ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి గురువారం ఉదయం బీజేపీలో చేరడం తీవ్ర కలకలం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పనలో రాజనర్సింహ బిజీగా ఉండగా.. ఆయన సతీమణి సిద్ధాంత వైరుధ్యమున్న పార్టీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర్‌రావు సమక్షంలో పద్మినీరెడ్డి కాషాయకండువా కప్పుకొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు ఆసక్తి చూపిన ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవడం వల్లనే పార్టీ మారారని ప్రచారం జరిగింది. బీజేపీలో చేరడం తన భర్త రాజనర్సింహకు తెలుసునని పద్మినీరెడ్డి పేర్కొనడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఆ పార్టీ నాయకులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆమెను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొవచ్చేందుకు రాజనర్సింహతోపాటు, పార్టీ ముఖ్యనేతలు బుజ్జగింపులు ప్రారంభించారు. రాత్రి వరకు వారి ప్రయత్నాలు ఫలించి.. తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు పద్మినీరెడ్డి ప్రకటించారు. అయితే, సీట్ల పంపకాలు కూడా ఖరారు కాకముందే అగ్రనాయకులే తమ కుటుంబసభ్యులను ఒప్పించుకోలేకపోతున్నారని, సీట్లు తేలాక సమస్యాత్మక సీట్లలో పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడవు అంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు అవుతాయంటూ వారు పేర్కొంటున్నారు.

నచ్చకపోతే ఎవరిదారి వారిదే..

కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణితో విసిగివేసారిన టీజేఎస్ నేత కోదండరాం సీట్ల సంగతిని త్వరగా తేల్చాలంటూ అల్టిమేటం జారీచేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి భాగస్వామ్య పార్టీల పట్ల కాంగ్రెస్ చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా ఇప్పటివరకు సీట్ల పంపకాలు చేయకపోవడంతో ప్రచారంలో వెనుకబడిపోతున్నామని, కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణి విడనాడి ఉత్కంఠకు తెరదించాలని సూచించారు. ముందుగా సీట్ల సంఖ్య తేల్చితే ఇష్టమైన వారు కూటమిలో ఉంటారు.. లేదంటే ఎవరి దారివారు చూసుకుంటారు అని వ్యాఖ్యానించారు. మహాకూటమి ఉమ్మడి కార్యాచరణకు కట్టుబడి భరిస్తున్నామని, అయితే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యపార్టీలు అడిగిన సీట్లలో ప్రచారం ప్రారంభించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. తెలంగాణ పోరాటంలో జేఏసీ చైర్మన్‌గా టీడీపీని జేఏసీ నుంచి బహిష్కరించి.. ఆ పార్టీకి ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చిన కోదండరాం ఇప్పుడు ఆ పార్టీతో అంటకాగుతున్నారని .. ఇప్పుడు టీడీపీ సచ్ఛీల పార్టీ ఎలా అయిందో చెప్పాలంటూ తెలంగాణవాదులు నిలదీస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక కోదండరాం ముఖం చాటేస్తున్నారు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చడానికే పొత్తు పెట్టుకుంటున్నామంటూ చెప్పినదానిపై టీఆర్‌ఎస్ నాయకులు వేసిన ప్రశ్నకు ఇంతవరకు సూటిగా సమాధానం ఇవ్వలేదు.

ఆలు లేదు.. సూలు లేదు..

కూటమిలో టీడీపీకి ఎన్నిసీట్లు ఇస్తారో తేలక ఆ పార్టీ నాయకులు తర్జనభర్జనలు పడుతుంటే తమకు కూడా సీట్లు కేటాయించాల్సిందేనంటూ టీడీపీ మహిళలు గోలపెడుతున్నారు. 20 సీట్లు కావాలంటూ కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నా టీడీపీకి 15 సీట్లకు మించి లభించడం అనుమానమే. అయితే సీట్ల పంపకాలు పూర్తి కాకముందే మహిళా నేతలు తమకు టికెట్లు కావాలని లైను కట్టడంతో ఆ పార్టీ నేతలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు ఇస్తే అందులో కనీసం నాలుగు సీట్లు కేటాయించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఏలేటి అన్నపూర్ణమ్మ, పాల్వాయి రజనీ, బండ్రు శోభారాణి, ఉప్పలపాటి అనుషారాం తదితరులు టికెట్ల కోసం తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. నలుగురిలో ఒక్కరికి, సాధ్యమైతే ఇద్దరికీ మాత్రమే టికెట్ ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక పార్టీకి మరో పార్టీకి ఎక్కడా పొసగకపోయినా కడుపులో కత్తులు పెట్టుకొని ముందుకుసాగుతున్నారు. కూటమి పేరుతో ఇతర పార్టీలకు తమ సీట్లను కేటాయించవద్దంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు గాంధీభవన్‌లో ఇప్పటికే ధర్నాలు మొదలుపెట్టారు. సీపీఐ అడుగుతున్న సీట్లపై కాంగ్రెస్ స్థానిక నాయకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వీటన్నింటి నేపథ్యంలో కూటమి సాధ్యమయ్యేనా? అనే అనుమానాలు ఆయాపార్టీల నేతల నుంచే వస్తున్నాయి.

మరోమారు చర్చలు

మహాకూటమి భాగస్వామ్యపక్షాలు గురువారం రాత్రి గోల్కొండ హోటల్‌లో చర్చలు జరిపాయి. అయితే, ఆయా పార్టీల నుంచి ద్వితీయశ్రేణి నేతలు మాత్రమే రావడంతో ఇందులో సీట్ల పంపకం, ఉమ్మడి కార్యాచరణ వంటి అంశాలపై ఎలాంటి స్పష్టత రాలేదు చర్చల సందర్భంగా కూటమి నేతలు చెప్పినవాటిని నోట్ చేసుకుని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవిస్తామని చెప్పి చర్చలు ముగిస్తున్నట్టు తెలిపి కాంగ్రెస్ నేతలు వెళ్లిపోయారు. ప్రతిసారి చర్చల్లోనూ ఇలాగే జరుగుతున్నదంటూ కూటమిలోని ఇతర పక్షాలు తీవ్ర నిరాశతో ఉన్నాయి. సీపీఐ, టీజేఎస్ పార్టీలు సీట్ల పంపకాలపై డిమాండ్ చేస్తూ తమ గళాలను పెంచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతగా పట్టించుకున్నట్టు లేదని తెలిసింది.

2151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles