అర్చకులకు ట్రెజరీనుంచి జీతాలు దేశంలోనే ప్రథమం


Fri,November 9, 2018 02:27 AM

Minister KTR Speech at Brahmins Athmiya Sammelanam

-ఆలయాల అభివృద్ధికి వందల కోట్లు
-2,069 దేవాలయాల జీర్ణోద్ధరణ కోసం రూ.252 కోట్లు
-బ్రాహ్మణులకు అండగా ఉంటాం
-కుల, మత తేడాలు లేకుండా పేదలకు చేయూత
-బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలోనే ప్రప్రథమంగా అర్చకులకు ట్రెజరీ నుంచి జీతాలిస్తున్న ఘనత తెలంగాణకే దక్కిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో పేదల సంక్షేమానికి స్వర్ణయుగం వచ్చిందని, పేద బ్రాహ్మణులందరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని వండర్‌పార్కులో గురువారం నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కులం, మతంతో నిమిత్తం లేకుండా పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని, రాష్ట్ర బడ్జెట్‌లో 43 శాతం నిధులను ఇందుకు వెచ్చిస్తున్నామని చెప్పారు. పేదరికానికి కులం లేదు. ఏ కులంలో పుడతాం. ఎక్కడ పుడతామన్నది మన చేతుల్లో లేదు. కులానికి, పేదరికానికి లింకు కూడా లేదు. అగ్రవర్ణాలుగా చెప్పుకొనే చాలా కులాల్లో పేదలున్నారు అని మంత్రి పేర్కొన్నారు. బ్రాహ్మణుల స్థితిగతులు సీఎం కేసీఆర్‌కు తెలిసినంతగా ఏ ముఖ్యమంత్రికీ తెలియవని చెప్పారు. విశ్వకల్యాణం కోసం కేసీఆర్ అయుత చండీయాగం చేశారని, ఆలయాల అభివృద్ధికి వందల కోట్లు ఖర్చుచేస్తున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా 2002 గోదావరి పుష్కరాలనాటి సంగతులను వివరించారు.

టీఆర్‌ఎస్ ఏర్పడ్డ తొలినాళ్లలోనే గోదావరి పుష్కరాలు వచ్చాయని.. తెలంగాణ ఉద్యమనాయకుడిగా కేసీఆర్ అప్పట్లోనే.. గోదావరి పుష్కరాలు రాజమండ్రిలోనే ఎందుకు జరుగాలి? మా భద్రాచలంలో, బాసరలో, ధర్మపురిలో ఎందుకు కాకూడదని ప్రశ్నించారని గుర్తుచేశారు. దీనిని రాజకీయం చేయడం అవసరమా? అని అంతా అనుకున్నాం. వారిని నేను అడిగాను.. దీనిపై కేసీఆర్ చెప్పింది ఆశ్చర్యం కలిగించింది. గోదావరి పుష్కరాలుంటే రాజమండ్రికి, కృష్ణా పుష్కరాలుంటే విజయవాడకు.. లక్షల సంఖ్యలో భక్తులు పోతరు. అదే భక్తులు మన ప్రాంతానికి వస్తే మన అర్చకులు, మన బ్రాహ్మణులు, అందరూ బతుకుతరు. వ్యాపా రం, వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది. ఈ కోణంలో తప్ప.. దేవుడి విషయంలో కూడా రాజకీయం మాట్లాడటం లేదు అని చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరి, కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తుచేశారు.

ధూప, దీప, నైవేద్యం పథకం

రాష్ట్రంలో 1800కుపైగా ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యం పథకాన్ని అమలుచేస్తున్నామని, మరో 1200 ఆలయాలకు వర్తింపజేయాలని నిర్ణయించినా ఎన్నికల కోడ్ కారణంగా అమలుకాలేదని చెప్పారు. కామన్ గుడ్ ఫండ్ పెద్దమొత్తంలో లేకపోయినప్పటికీ సీఎం కేసీఆర్ చొరవతో 2,069 దేవాలయాల జీర్ణోద్ధరణ కోసం దాదాపు రూ.252 కోట్లు విడుదలచేశారని వివరించారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు

రమణాచారి, ఉపేంద్రశర్మ, భానుమూర్తి, వేణుగోపాలాచారి, వేదిక మీద ఉన్న పెద్దలందరి పట్టుదలతోనే బ్రాహ్మణ సంక్షేమపరిషత్ ఏర్పాటయిందని, పేద బ్రాహ్మణులకు వివిధ పథకాలు అమలుచేస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. బ్రాహ్మణ ఎంటర్‌ప్రెన్యూర్ స్కీంలో 72 మందికి సబ్సిడీ కింద రూ.రెండు కోట్లు, రామానుజ పథకం కింద 27 మంది విద్యార్థులకు రూ.5.90 లక్షలు, 14 వేద పాఠశాలల కోసం రూ.35.50 లక్షలు, విదేశీ విద్యాపథకం కింద 65 మందికి రూ.7.26 కోట్లు, 13 మంది వేద పండితులు, శాస్త్ర పండితులకు నెలకు రూ.2,500 చొప్పున పారితోషికం, 124 మంది పేద వేద విద్యార్థులకు రూ.2.82 లక్షలు బ్రాహ్మణ పరిషత్ ద్వారా అందిస్తున్నట్టు తెలిపారు. బ్రాహ్మణ సేవా సదనానికి శంకుస్థాపనచేసే అదృష్టం తనకు దక్కిందని, ఉగాది కల్లా ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది 17 పథకాలను ప్రతిపాదించగా ఐదు పథకాలకు ఆమోదం లభించిందన్నారు.
KTR1

బ్రాహ్మణులకు ధన్యవాదాలు

నేను మీ ఆశ్వీరాదం, మీ మద్దతు కోసం వచ్చాను. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించినవారికి, ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు. వరంగల్‌లో పూజారి సత్యనారాయణశర్మ మృతి బాధాకరం. ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా అధికారులు చర్యలు చేపట్టారని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణను ముంచేందుకు చంద్రబాబు వస్తున్నారు

చంద్రబాబుకు పక్క రాష్ట్రంలో కావాల్సినంత పని ఉంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలో రోడ్లు నెర్రెలు వాసినయి. ప్రాజెక్టులు కట్టుకోవాలి. కానీ, తెలంగాణను ముంచేందుకే చంద్రబాబు ఇక్కడకు వస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

స్వాముల ఆశీర్వచనం

బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు స్వాములు ఆశీర్వచనాలు పలికారు. జగన్నాథపీఠం వ్రతధరస్వామి, గాయత్రి తత్వానందస్వామి, ప్రయాగస్వామి, దివ్యజ్ఞాన సిద్ధాంతి మంత్రి కేటీఆర్‌కు ఆశీర్వదించారు. పలువురు అర్చకులు, బ్రాహ్మణులు మంత్రిని సత్కరించారు. సభకు అధ్యక్షత వహించిన బ్రాహ్మణ సంక్షేమపరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎక్కడ ధర్మం ఉంటుం దో అక్కడే బ్రాహ్మణులు ఉంటారన్నారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. బ్రాహ్మణుల స్థితిగతులు కేసీఆర్‌కు తెలుసన్నారు. హైదరాబాద్‌లో అద్భుతమైన బ్రాహ్మణభవన్ నిర్మిస్తున్న కేసీఆర్‌కు మనమంతా అండగా ఉండాలని బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ కోరారు. బ్రాహ్మణహితుడు సీఎం కేసీఆర్ అని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి కొనియాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక అర్చకులకు నెలకు రూ.30, 40 వేల వరకు వేతనం వస్తున్నదని, తామంతా టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉంటామని అర్చకసంఘం ప్రతినిధులు గంగు ఉపేంద్రశర్మ, గంగు భానుమూర్తి ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్, జగన్నాథ పీఠం వ్రతధరస్వామి, గాయత్రి తత్వానందస్వామి, ప్రయాగస్వామి తదితరులు పాల్గొన్నారు.

2720
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles