వంద సీట్లు పక్కా మావే


Thu,December 6, 2018 03:57 AM

Minister KTR Road Show In Sircilla Telangana Elections 2018

-గెలిపించుకొనేందుకు ఓటర్లు సిద్ధం
-రాహుల్‌గాంధీ బిగ్గెస్ట్ బఫూన్
-టీఆర్‌ఎస్- టీడీపీ పొత్తుకు లగడపాటి యత్నం
-చంద్రబాబుతో ఇక్కడి ప్రజలు స్వీయఅస్తిత్వం తేల్చుకునే సమయం వచ్చింది
-ఓటమి భయంతోనే కొడంగల్‌కు సీఎం కేసీఆర్‌ను రావొద్ద్దన్నారు
-మీడియా ఇష్టాగోష్ఠిలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వంద సీట్లు సాధించి చరిత్ర తిరగరాయడం ఖాయమని మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రజలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి అధికారంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారని, ఎవరు ఎలాంటి జిమ్మిక్కులు, మైండ్‌గేమ్‌లు ఆడినా తెలంగాణ ప్రజల మనసును మార్చలేరు.. టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరని అన్నారు. మంత్రి కేటీఆర్ బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చంద్రబాబు ఇక్కడ కూటమిలో చేరడం ద్వారా గతంలో ఆయన సీఎంగా చేసినప్పటి ఘోరాలు అన్న ప్రజలకు గుర్తుకొచ్చాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు ప్రయత్నించి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపారని ఆరోపించారు. హరికృష్ణ పార్థివదేహం వద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లిన సమయంలో తమ పార్టీతో పొత్తుపై మాట్లాడారని చెప్పారు. కూటమిని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతానంటారేమో? ఏపీని లోకేశ్‌కు వదిలేసి చంద్రబాబు ఇక్కడకి వస్తాడేమో? అన్న అనుమానాలను వ్యక్తంచేశారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ను రూ.500 కోట్లకు చంద్రబాబు కొనుగోలు చేసినందునే రాహుల్ మొదలుకొని ఉత్తమ్ వరకు అందరూ అబద్ధాలు, తప్పులే మాట్లాడుతున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 6న ఓ స్నేహితుడి ఇంట్లో కలిసినప్పుడు టీఆర్‌ఎస్ గెలువబోతున్నదని లగడపాటి తనతో చెప్పి.. టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి ప్రయత్నించగా.. సాధ్యంకాదని తేల్చిచెప్పానన్నారు. కాంగ్రెస్‌తో జట్టుకట్టడంలో లగడపాటి కీలకపాత్ర పోషించారని చెప్పారు. అక్టోబరు 20 నుంచి చేసినట్లుగా చెప్పిన సర్వే ఫలితాల్లో టీఆర్‌ఎస్‌కు 65-70 స్థానాలు వస్తున్నాయని లగడపాటి తనకు వాట్సప్ ద్వారా పంపించారన్నారు. అయితే టీడీపీతో కలువనందునే కూటమిదే పైచేయంటూ మంగళవారం రాత్రి మరో సర్వే ఫలితాలను వెల్లడించారని స్పష్టంచేశారు. మైండ్‌గేమ్‌లో ప్రజలను కన్విన్స్ చేయలేక కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని.. దీనిలో భాగంగానే లగడపాటి సర్వే అని చెప్పారు. కూటమిలో నాలుగు పార్టీలే కాకుండా రెండు మీడియా సంస్థల అధిపతులు కూడా ఉన్నారని తెలిపారు.

ఫెడరల్ ఫ్రంట్‌పై దృష్టి..

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 నుంచి 170 సీట్లు వచ్చే అవకాశమున్నదని, ఇప్పటికే కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌పై ఈ నెల 11 తరువాత ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు ఏర్పడాలన్నదే ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యమని తెలిపారు. జీఎస్టీ ద్వారా పన్ను చెల్లింపుదారులు పెరగడమేకాకుండా ప్రభుత్వాల ఆదాయం కూడా పెరుగుతున్నదని పేర్కొన్నారు. అందుకనే జీఎస్టీకి మద్దతు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌లో పదుల సంఖ్యలో ఉన్న సీఎం అభ్యర్థులు కనీసం వాళ్ల సొంత నియోజకవర్గంలో తప్ప.. పక్క నియోజకవర్గంలో ప్రచారం చేయలేకపోతున్నారని ఎద్దేవాచేశారు.

కొడంగల్‌కు కేసీఆర్ రావద్దా?

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎంలతోపాటు ఎందరో జాతీయనేతలు వచ్చారని, రాహుల్‌గాంధీ, చంద్రబాబు కూడా అనేకచోట్ల ప్రచారం చేశారని.. వీళ్లందరు ప్రచారం చేయగా లేనిది సీఎం కేసీఆర్ కొడంగల్ ప్రచారసభ నిర్వహిస్తే అడ్డుకొంటారా? ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఓడిపోతాననే భయంతోనే రేవంత్ నాటకం ఆడారని ఎద్దేవాచేశారు. ఎన్నికల వేళ పర్యాటకులుగా వచ్చిన రాహుల్‌గాంధీ సహా ఎవ్వరూ మళ్లీ ఈ గడ్డపై కనిపించరని, వీళ్లను నమ్మే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరని చెప్పారు. గాంధీ అనే పేరు మినహా ప్రధాని కావడానికి రాహుల్‌కు ఉన్న అర్హత ఏమిటి? ఏదైనా సమస్యపై ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు. ఆయనో బిగ్గెస్ట్ బఫూన్... ఆయన ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్‌కు అంతే సంగతులు అని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలంటే..

సాగునీరు, తాగునీరు, విద్యుత్ విషయంలో 60 ఏండ్లలో సాధించని ప్రగతిని కేవలం నాలుగేండ్లలో సాధించామని, సంక్షేమరంగంలోనూ ఎన్నో కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్లామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గతంలో తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉండే.. స్వరాష్ట్రంలో తమ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ఎలా ఉంది? అనేది స్పష్టంగా అందరికి కనిపిస్తున్నదని పేర్కొన్నారు. అంతేకాదు కూటమి వల్ల, చంద్రబాబు వల్ల తమకు లాభమే కలిగిందని, స్వయంపాలన కావాలో.. ఢిల్లీ గులాం గిరి, అమరావతికి బానిసలుగా ఉండటం కావాలో స్వీయ అస్తిత్వం తేల్చుకునే సమయం వచ్చిందని చెప్పారు. అందుకే టీఆర్‌ఎస్‌కే ఓటేసి తెలంగాణ మరింత అభివృద్ధి జరిగేందుకు ప్రజలు ముందుకురావాలని పిలుపునిచ్చారు.

4912
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles