హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్

Sun,October 13, 2019 03:02 AM

-కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏర్పాటుచేస్తాం
-అంతర్జాతీయస్థాయి సేవలందించేలా తీర్చిదిద్దుతాం
-వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సదస్సులో మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలోనే తొలి జాతీయ డిజైన్ సెంటర్(ఎన్డీసీ)ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నామని, దీనికోసం కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం హెచ్‌ఐసీసీలో వరల్డ్ డిజైన్ అసెంబ్లీకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దేశీయ, అంతర్జాతీయసంస్థలకు సేవలను అందించేలా హైదరాబాద్‌లో ఏర్పాటుచేయబోయే నేషనల్ డిజైన్ సెంటర్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. తద్వారా దేశ డిజైన్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. డిజైన్ రంగంలో సరికొత్త పోకడలను ఆవిష్కరించడంతోపాటు మార్కెటింగ్ చేసేందుకు డిజైన్ సెంటర్ ప్రయత్నిస్తుందని చెప్పారు. తద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలిపారు. ఈ రంగానికి సంబంధించిన పరిశోధన జరిపేందుకు, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు కృషిచేస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ రంగం ఆరంభదశలోనే ఉన్నదని, అవగాహనను పెంచడంతోపాటు పూర్తిస్థాయి నిపుణులను ప్రోత్సహించేలా జాతీయ డిజైన్ సెంటర్ ఉంటుందని వివరించారు. దేశంలో డిజైనింగ్ ఎడ్యుకేషన్‌లో నాణ్యత పెంపొందించేందుకు సైతం ఇది దోహదపడుతుందని చెప్పారు.

డిజైన్ పరిశ్రమ విలువ రూ.19 వేల కోట్లు

డిజైన్లకు ఉన్న విలువను పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకోకుండా సంప్రదాయ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు అంతర్గత సిబ్బందిపైనే ఆధారపడుతున్నారని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. విదేశీ డిజైన్లను తమకు అనుకూలంగా మార్చుకోవడంపైనే దృష్టి సారిస్తున్నారని చెప్పారు. 2020 నాటికి దేశంలో డిజైన్ పరిశ్రమ విలువ దాదాపు రూ.19 వేల కోట్లకు చేరుకుంటుందన్న సీఐఐ అంచనాల్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. కాగా, ఇందులో ఏటా పది నుంచి పదిహేను శాతమే మనం వినియోగించుకుంటామని వెల్లడించారు. బహుళజాతి సంస్థలు దేశంలో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, స్థానిక మార్కెట్లకు ఉపయోగపడే తాజా ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నాయని వివరించారు. అంతర్జాతీయ సదస్సును నిర్వహించడానికి హైదరాబాద్‌ను ఎంచుకున్న వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. డిజైన్ కమ్యూనిటీయేకాకుండా విద్యార్థులు, ప్రతినిధుల నుంచి ఈ సదస్సుకు మంచి ఆదరణ లభించిందని చెప్పారు. వ్యాపారాలను మెరుగుపరిచేందుకు, విస్తరణకు వినూత్న డిజైన్లు తోడ్పడతాయని విశ్లేషించారు.
KTR1

పాస్టిక్ వాడకాన్ని తగ్గించాం

వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించేందుకే ఈ కార్యక్రమంలో తిరిగి వినియోగించే ఉత్పత్తులను వాడామని, పాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించామని చెప్పారు. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడకుండా సదస్సును నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. కార్యక్రమ ఎజెండాను తెలియజేసేందుకు కాగితాల బదులు మొబైల్‌ఫోన్ల ద్వారా సమాచారాన్ని అందజేశామని తెలిపారు. అంతకుముందు అక్కడ ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఒక్కో స్టాల్ వద్దకు వెళ్లి ప్రత్యేకతలను తెలుసుకున్నారు. డిజైనింగ్ రంగంలో హైదరాబాద్ ప్రత్యేకతలు, హైదరాబాద్ చారిత్రక అంశాలతో రూపొందించిన కాఫీటేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ఆశిష్, శ్రీనిశ్రీనివాసన్, నలభై దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ డిజైన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక ఆవిష్కరణలకు ప్రాధాన్యం

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన డిజైన్ పరిశ్రమకు గల ప్రాముఖ్యతను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే, ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లో తొలి వరల్డ్ డిజైన్ అసెంబ్లీని నిర్వహిస్తున్నామని తెలిపారు. టీహబ్, టీ వర్క్స్, ఇమేజ్ టవర్స్ వంటి వాటిని గమనిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఆధునిక ఆవిష్కరణలకు ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తుందని వివరించారు. లూ కెఫే, డైలాగ్ ఇన్ ద డార్క్ వంటి వినూత్న పోకడలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. చేనేత, హస్తకళలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదని, గద్వాల, గొల్లభామ చీరలు, నిర్మల్ ఫర్నిచర్, పోచంపల్లి చీరలు, చేర్యాల హస్తకళలు, పోచంపల్లి చీరలు తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతాయని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో పేరున్న ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయని చెప్పారు. తెలుగు సినీపరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందుతున్నదని, యానిమేషన్ రంగానికి హైదరాబాద్ చిరునామాగా మారిందని.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన బాహుబలి చిత్రమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

1402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles