లైఫ్‌సైన్సెస్ లీడర్ తెలంగాణ


Fri,February 23, 2018 02:46 AM

Minister KTR Participates in Bio Asia Summit 2018 in HICC

రాబోయే పదేండ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యం
నాలుగు లక్షల మందికి ఉపాధి
-ప్రపంచానికే బెంచ్‌మార్క్‌గా ఫార్మాసిటీ
-ఏషియా లైఫ్‌సైన్సెస్ విభాగంలో అతిపెద్ద క్లస్టర్ జీనోమ్‌వ్యాలీ
-రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్
-బయోఏషియా సదస్సు, ప్రదర్శన ప్రారంభం
-52 దేశాల నుంచి 1600 మంది హాజరు

KTR
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం లైఫ్‌సైన్సెస్, ఐటీరంగాల్లో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ లీడర్‌గా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాబో యే పది సంవత్సరాల్లో లైఫ్‌సైన్సెస్ రంగం ద్వారా 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.5 లక్షల కోట్లు) పెట్టుబడులు రాబట్టుకోవడం, వీటిద్వారా నాలుగులక్షల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాల్లో అత్యధికం తయారీరంగంలోనే రానున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 800 కంపెనీలు, 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయన్నారు. హెచ్‌ఐసీసీలో మూడురోజులపాటు జరిగే 15వ బయోఏషియా సదస్సు ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ గురువారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..లైఫ్‌సైన్సెస్ ఆవిష్కరణలు, ఉత్పత్తి హబ్‌ల ఏర్పాటులో తెలంగాణ బలోపేతం అవుతున్నది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో మన హైదరాబాద్ ఒక్కటే దాదాపు 35 శాతం వాటా కలిగి ఉన్నది. ప్రపంచానికి, దేశానికి తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్‌హబ్‌గా పేరుపొందింది. ప్రపంచానికి అవసరమయ్యే వ్యాక్సిన్లలో 33శాతం మనవద్దే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, పుష్కలమైన మానవ వనరులు, ప్రోత్సాహక ప్రభుత్వం వంటి అంశాల వల్ల జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ లైఫ్‌సైన్సెస్ సంస్థలు తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నాయి. జినోమ్‌వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్ వంటివి ప్రపంచ లైఫ్‌సైన్సెస్ సంస్థలను హైదరాబాద్‌వైపు ఆకర్షిస్తున్నాయి.

ప్రపంచస్థాయి ఫార్మా సంస్థలను విశేషంగా ఆకట్టుకోవడానికి బయోఏషియా సదస్సు తోడ్పడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. 14వ బయోఏషియా సమ్మిట్‌లో ఇచ్చిన వాగ్దానం మేరకు జీనోమ్‌వ్యాలీకి ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) స్టేటస్‌ను మంజూరు చేశామని సహర్షంగా ప్రకటిస్తున్నాను. దీనివల్ల జీనోమ్‌వ్యాలీలో ఎలాంటి అనుమతులైనా సులువుగా లభిస్తాయి. కొత్తతరహా అభిృద్ధికి ఐలా సరికొత్త మార్గదర్శిగా నిలబడుతుందని విశ్వసిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం సులభ వాణిజ్య విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పట్ల అంకితభావంతో ఉన్నదని చెప్పడానికి ఐలాల ఏర్పాటు నిర్ణయమే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పొచ్చు. ఏషియా లైఫ్‌సైన్సెస్ విభాగంలోని జీనోమ్‌వ్యాలీ అతిపెద్ద క్లస్టర్ అని మీ అందరికీ తెలిసిందే. దీన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది.
KTR1
1999లో జినోమ్‌వ్యాలీ క్లస్టర్ ఆరంభం కాగా, ప్రస్తుతం 200 సంస్థలు పదివేల మంది సాంకేతిక నిపుణులు, ఉద్యోగులతో అది కళకళలాడుతున్నది. నోవార్టిస్, జీఎస్‌కే, సనోఫీ, ఫెర్రింగ్ ఫార్మా, కెమో, డూపాంట్, యాష్‌లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపియా, లాన్‌జా వంటి ప్రపంచ ఫార్మా దిగ్గజాలే కాకుండా భారతదేశానికి చెందిన పలు పేరెన్నికగల ఫార్మా సంస్థలు జినోమ్‌వ్యాలీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడానికి అవసరమయ్యే ఉత్పత్తులు తెలంగాణలో తయారు అవుతుండడంపై ఇక్కడి ప్రజలు ఎంతో గర్వపడుతున్నారు. ఈ ఏడాది స్లేబ్యాక్ ఫార్మా, కెమో వంటి సంస్థలు జినోమ్‌వ్యాలీలో కార్యకలాపాలు ప్రారంభించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. నోవార్టిస్, జీఎస్‌కే, బయోలజికల్ ఈ, అలెంబిక్ వంటివి జీనోమ్‌వ్యాలీలో అధ్యయనం, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించినందుకు అభినందిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వంతో కలిసి దేశంలోని అతిపెద్ద యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. దీనివల్ల లైఫ్‌సైన్సెస్ కంపెనీలకు ఉపయోగకరంగా ఉండడమే కాకుండా కొత్త మందులను తయారు చేసే సమయం గణనీయంగా తగ్గుతుంది. జీనోమ్ వ్యాలీ క్ల్లస్టర్‌ను విస్తరిస్తున్నాం. ఇందుకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ఫ్లాన్‌కు రూపకల్పన చేస్తాం.

తద్వారా జీనోమ్‌వ్యాలీ-2 తక్షణమే ప్రారంభించే ప్రయత్నం మొదలుపెట్టాం. ఆరోగ్య పరిరక్షణలో అనేక విజయాలు సాధించడానికి ఇది దోహదం చేస్తుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఈ రంగంలో స్టార్టప్‌లను అభివృద్ధిపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నారు. ఫలితంగా నిరుపేదలకు ఎంతో లబ్ధి కలుగుతున్నది. గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రం చవకగా వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేస్తున్నది. భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ, శాంతాబయోటెక్ వంటి సంస్థలు ఈ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించాయి. ఆరోగ్య పరిరక్షణపై అత్యధిక ప్రభావం చూపాయి. ఇకనుంచి తెలంగాణ రాష్ట్రం ఏటా ప్రతి కంపెనీ ఒక కొత్త వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నది. ఇందుకోసం లైఫ్‌సైన్స్ విభాగంలోనే ప్రప్రథమంగా వ్యాక్సిన్ అభివృద్ధికి సాయంచేసే ఇంక్యుబేటర్‌ను ప్రారంభిస్తున్నాం. అధికశాతం సంస్థలు, సొంతంగా ఉత్పత్తి సదుపాయాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధ్యయన కేంద్రాలు, ప్రముఖ కళాశాలల్లో ఇంక్యుబేషన్ సెంటర్లను ఆరంభించాలన్న ఆలోచన మాకుంది. ఈ రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి మాకు ప్రతిష్ఠాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించారు.
KTR2
గతేడాది నేను ఇదే వేదికపై ఈ రంగానికి సబంధించి మా లక్ష్యాలను వివరించాను. భారత్, అందులో తెలంగాణ ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రపంచస్థాయి గుర్తింపు కల్గి ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతులు తుదిదశకు చేరుకున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారాన్ని అందిస్తున్నది. 19వేల ఎకరాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీగా ఇది అవతరిస్తుంది. ప్రపంచంలో బెంచ్‌మార్క్‌గా ఈ ఫార్మా సిటీ నిలవెబోతుంది. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా ఏర్పాటు చేసే ఫార్మా క్లస్టర్ ఇదే. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు నైపుణ్యం ఉన్న విద్యార్థులను తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ సంస్థను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నది. ఇమ్యునోథెరపి, వ్యక్తిగత మెడిసిన్, నానో మెడిసన్ లాంటి కోర్సులను ప్రారంభించడానికి స్థానికంగా ఉన్న విద్యాసంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. లైఫ్‌సైన్సెస్ రంగంలో రాబోయే రెండుమూడు సంవత్సరాల్లో రూ.3 వేల కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం మెడికల్ డివైజెస్‌లో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన మెడికల్ డివైజెస్ పార్కు దేశంలోనే అతిపెద్దది. ఇక్కడ దేశీఆ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైజెస్ కంపెనీల మధ్య సమన్వయానికి కృషి చేస్తున్నాం.

ప్రపంచ మార్పులు తెలుసుకొనేందుకు

ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ, దేశంలో ముఖ్యమైన మూడు స్టార్టప్ ఇంక్యుబేటర్లు ఉన్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ రంగంలో వచ్చిన, వస్తున్న మార్పులు తెలుసుకోవడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోపడుతాయని తెలిపారు. ఐర్లాండ్ ఈ సదస్సుకు భాగస్వామ్యదేశంగా ఉండటం ఎంతో ఉపయోగకరమని అన్నారు. రాష్ట్ర లైఫ్ సైన్సెస్ సలహామండలి చైర్మన్ డీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ, 14 సంవత్సరాల క్రితం ప్రారంభమైన బయోఏషియా ప్రస్తుతం టీనేజ్‌లోకి చేరుకుందని, ఈ సమయంలో తదేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే ఫార్మాసిటీ, జినోమ్ వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు కానున్నట్టు చెప్పారు.

అవార్డు ప్రదానం

బయోఏషియా సదస్సు సందర్భంగా అందించే ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డును స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మిచెల్ ఎన్ హల్‌కు మంత్రి కేటీఆర్ అందచేశారు. ఈ సందర్భంగా హల్ మాట్లాడుతూ ఈ అవార్డును అందుకోవడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. లైఫ్ సైన్సెస్ ద్వారా మానవ జీవితంలో మార్పు తీసుకరావాలనేదే లక్ష్యమన్నారు.
KTR3

నేడు సీఈవో కాంక్లేవ్

బయోఏషియా రెండోరోజు సదస్సులో భాగంగా శుక్రవారం సాయంత్రం సీఈవో కాంక్లేవ్ సెషన్ జరుగుతుంది. ఈ సదస్సులో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పాల్గొంటారు. ప్యానెలిస్ట్‌లుగా బయోకాన్ సంస్థ సీఎండీ కిరణ్ మజుందార్‌షా, నోవార్టిస్ ఇండియా అధ్యక్షుడు జావేద్ జియా, రెడ్డి ల్యాబ్స్ చైర్మన్ సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. ఉదయం సెషన్స్‌లో నోవార్టిస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీరాం ఆరాధ్యే, జినోమ్‌వ్యాలీ అవార్డు గ్రహిత మైకేల్ హాల్, జర్మనీ మెర్క్ కంపెనీ లైఫ్‌సైన్సెస్ సీఈవో ఉదిత్ బాత్రా ప్రసంగిస్తారు.

మలేసియా రాష్ట్రంతో తెలంగాణ ఒప్పందం

మలేషియా దేశంలోని సిలోంగర్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం బయోటెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం అందించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిలోంగర్ రాష్ట్రానికి చెందిన సెంట్రల్ స్పెక్ట్రమ్ సీఈవో డాటో మహమూద్ అబ్బాస్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి సంతకాలు చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరు పత్రాలను మార్చుకున్నారు. సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ఎగ్జిబిషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచంలోని 52 దేశాల నుంచి 1600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అసోం, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఎనర్జీ, గ్రోత్ మార్కెట్స్ హెడ్ ఆండ్రూ వగ్లూర్, నోవార్టిస్ హైదరాబాద్ హెడ్ నవీన్ గుల్లపల్లి, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా యెల్లా, బయలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్ల, అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, శాంతా బయోటెక్ సీవోవో మహేశ్ బీ, మలేషియా ఇన్వెస్ట్ సిలోంగర్ సీఈవో దాతోహసన్ హజారీ ఇద్రిస్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, డీఆర్‌ఎల్ డైరెక్టర్ విశ్వనాథ్, ఫాబా అధ్యక్షుడు మలోబీ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
KTR4

1977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles