మళ్లీ జీహెచ్‌ఎంసీ విభజన


Wed,June 13, 2018 04:23 AM

Minister KTR  Fires On GHMC Officials Over Roads

-50 సర్కిళ్లు.. 10 జోన్ల ఏర్పాటు: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయం
-పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ కోసమే విభజన
-ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు
-నాలాలపై ఆక్రమణల తొలిగింపులో అలసత్వంపై ఆగ్రహం
-వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు
-సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుకాకపోవడంపై అసంతృప్తి
-జీహెచ్‌ఎంసీపై కేటీఆర్ సమీక్ష

KTR
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పరిపాలనాసౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మరోసారి పునర్విభజించనున్నట్టు పురపాలకశాఖమంత్రి కే తారక రామారావు ప్రకటించారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే నగరవాసులకు మరింత మెరుగైన సేవలు అందించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని, ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీని పునర్విభజించాలని నిర్ణయించామని చెప్పారు. మంగళవారం మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో రోడ్ల పునరుద్ధరణ, నాలాల పూడికతీత, నాలాల ఆక్రమణలు, ప్రధాన అడ్డంకుల తొలిగింపు, నీరు నిలిచే ప్రాంతాలు, వర్షాకాల ముందస్తు ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్‌లోని సర్కిళ్లను 30 నుంచి 50కి, జోన్లను 6నుంచి 10కి పెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ఒక సర్కిల్‌లో కేవలం మూడు వార్డులు మాత్రమే ఉండేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. నాలాలు, చెరువుల ఆక్రమణల తొలిగింపులో అధికారుల అలసత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చీఫ్ ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జోనల్ కమిషనర్లు తమ పనితీరును కాగితాలపై కాకుండా క్షేత్రస్థాయిలో ప్రదర్శించాలని హితవుపలికారు. ఆక్రమణల తొలిగింపును ఎవరైనా అడ్డుకుంటే చట్టప్రకారం వారిపై కేసులు నమోదుచేయాలని ఆదేశించారు. శిథిల భవనాలతోపాటు, నాలాలు, చెరువులపై అక్రమ నిర్మాణాల తొలిగింపు నిరుత్సాహకరంగా ఉందని మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. టౌన్‌ప్లానింగ్, విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అక్రమ నిర్మాణాల తొలిగింపులో మరింత కఠినంగా, దూకుడుగా వ్యవహరించాలని సూచించారు. అక్రమ నిర్మాణాలను ప్రాథమికస్థాయిలోనే అడ్డుకోవాలని, నిర్మాణమైన తరువాత వాటి తొలిగింపు సమస్యగా మారుతున్నదని చెప్పారు.

ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే నగరంలో వర్షాలు ప్రారంభం అయినందున అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. ఇప్పటికే గుర్తించిన ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. నగరంలో చేపడుతున్న రోడ్ల పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని, జోనల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేదిలేదని కేటీఆర్ హెచ్చరించారు.
KTR1

భూసేకరణ కోసం ప్రత్యేక విభాగం

నగరంలో పెద్దఎత్తున ఎస్సార్డీపీ, డబుల్ బెడ్‌రూమ్, రోడ్ల విస్తరణ తదితర పనులు చేపట్టినందున వీటికి సంబంధించి భూసేకరణకోసం జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక భూసేకరణ విభాగాన్ని ఏర్పాటుచేసే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జిల్లా కలెక్టర్లకు పనిభారం ఎక్కువైనందున భూసేకరణలో జాప్యం జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక భూసేకరణ విభాగాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

ప్లాస్టిక్ వినియోగంపై అసంతృప్తి..

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ప్లాస్టిక్ నీటి బాటిళ్ల వినియోగంపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. 2022 నాటికి హైదరాబాద్‌లో ఒకేసారి వాడి పడేసే (సింగిల్‌యూజ్డ్ ప్లాస్టిక్) ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ఇటీవల పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంకల్పించినప్పటికీ ఆచరణలో మార్పు రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. నిషేధాన్ని కచ్చితంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సింగిల్‌యూజ్డ్ ప్లాస్టిక్‌ను వాడరాదని, నిషేధాన్ని తు.చ. తప్పకుండా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీలోని అన్ని కార్యాలయాల్లో నిషేధం అమలైతే ఇతర పట్టణాలు, నగరాల్లో సైతం నిషేధం అమలుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

4904
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles