ఎందుకీ చిన్నచూపు!

Thu,December 5, 2019 03:24 AM

-పనిచేసే రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించడం లేదు
-పారిశ్రామికరంగంలో రాజకీయాలు
-రక్షణరంగంలోనూ వివక్ష
-డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో తాత్సారం
-ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ విమర్శ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పనిచేసే రాష్ర్టాలను ప్రోత్సహించకుండా కేంద్రప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. పనిచేసే రాష్ట్రాలను ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తాయని, కానీ దురదృష్టవశాత్తు అలా జరగడంలేదని చెప్పారు. పారిశ్రామికరంగంతోపాటు, రక్షణ రంగంలోనూ కేంద్రం రాజకీయాలు చేస్తున్నదన్నారు. కేంద్రం ఏదైనా ప్రాజెక్టు ప్రారంభిస్తే అది ఢిల్లీ-ముంబైకే పరిమితమవుతున్నదని పేర్కొన్నారు. టీఎస్‌ఐపాస్ ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం మాదాపూర్ శిల్పకళావేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ వస్తే ఢిల్లీ-ముంబైకి మంజూరుచేస్తుందని, బుల్లెట్ ట్రైనూ ఢిల్లీ -ముంబైకే పరిమితం చేస్తూ పనిచేసే రాష్ర్టాల పట్ల వివక్ష చూపుతున్నదన్నారు. పారిశ్రామిక కారిడార్ మంజూరుచేయడానికి, బుల్లెట్ ట్రైన్ ఇవ్వడానికి హైదరాబాద్ లేదా ఇతర దక్షిణాది రాష్ట్రాలు, ప్రాంతాలు లేవా? అని ప్రశ్నించారు. హైదరాబాద్- బెంగళూరు- చన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఎందుకివ్వడం లేదని నిలదీశారు. దీనిని మంజూరుచేస్తే ఇక్కడి ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందికదా అని కేటీఆర్ అన్నారు.

ఇంక్యుబేటర్ కోరినా ఇంతే సంగతులు

తెలంగాణలో రక్షణరంగానికి సంబంధించి ఇంక్యుబేటర్ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరినా ఫలితం లేకుండా పోతున్నదని.. కానీ, అది ఎప్పటికైనా సాధ్యమవుతుందన్న నమ్మకం ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం సైతం రిడ్జ్‌ను నెలకొల్పి ఈ రంగంలో పరిశోధనలకు కృషి చేస్తున్నదని చెప్పారు. ట్రైడెంట్ హోటల్‌లో సీఐఐ ఆధ్వర్యంలో డిఫెన్స్‌కాన్‌క్లేవ్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గత ఐదేండ్లలో పరిశ్రమల మంత్రిగా తెలంగాణలో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, దశాబ్దాల నుంచి హైదరాబాద్‌లో పలు కీలకమైన రక్షణసంస్థలు పనిచేస్తున్నాయని నలుగురు రక్షణమంత్రులకు వివరించినట్టు తెలిపారు.

ఇన్ని అనువైన పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్-బెంగళూరు నగరాలను కలుపుతూ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుచేయాలని కోరామన్నారు. అయితే కేంద్రం మాత్రం యూపీలోని బుందేల్‌ఖండ్‌లో ఒకటి, చెన్నైలో మరో ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు సమాచారమిచ్చిందని చెప్పారు. స్థానికంగా ఉన్న అనుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజకీయాల కోసం ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి నిర్ణయాలు ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయని కేటీఆర్ చెప్పారు.

1767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles