సబ్సిడీపై ఆసు యంత్రాలు

Sun,October 13, 2019 02:38 AM

-హెచ్‌ఐసీసీలో పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్
-50% తానా.. 25% ప్రభుత్వ రాయితీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సబ్సిడీపై చేనేత కార్మికులకు ఆసు యంత్రాలను అందజేసే కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు శ్రీకారం చుట్టారు. శనివారం హెచ్‌ఐసీసీలో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రారంభసూచకంగా పది మంది చేనేత కార్మికులకు ఆసుయంత్రాలను అందజేశారు. యంత్రాలు అందుకొన్నవారికి, తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కో ఆసు యంత్రానికి రూ.27 వేల వ్యయం అవుతున్నది. ఇందులో 50 శాతం తానా భరిస్తుండగా, 25 శాతం ప్రభుత్వం, మిగిలిన 25 శాతం లబ్ధిదారుడు చెల్లించాలి. ఈ లెక్కన కార్మికుడు రూ.6,750 చెల్లించాలి. వెయ్యిమందికి సబ్సిడీ కింద ఆసు యంత్రాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం, తానా సంయుక్తంగా ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. జియోట్యాగింగ్ ద్వారా గుర్తించిన చేనేత కార్మికుల్లో వెయ్యిమందికి వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, ఆసు యంత్రం సృష్టికర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

కార్మికులను ఆదుకోవాలనే ముందుకొచ్చాం

చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి చలించిపోయామని, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆసు యంత్రాలను అందించేందుకు ముందుకొచ్చామని తానా అధ్యక్షుడు తాళ్లూరు జయశేఖర్ పేర్కొన్నారు. వెయ్యి మందికి ఆసు యంత్రాల పంపిణీకి తమ వాటాగా దాదాపుగా రూ.1.4 కోట్లు వ్యయమవుతున్నదని తెలిపారు. అలాగు భారత్ బయోటెక్ సంస్థ పిల్లలకు రూ.ఏడు కోట్ల విలువైన వ్యాక్సిన్లు ఉచితంగా అందించడానికి ముందుకొచ్చిందని తెలిపారు. భవిష్యత్‌లో ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ క్లాసురూంలుగా మార్చాలని ఆలోచిస్తున్నామన్నారు. తానా 42 ఏండ్లుగా సేవా కార్యక్రమాలను చేస్తున్నదని, అమెరికాలోని 10 లక్షల మంది తెలుగువారు ఏటా రెండు మిలియన్ డాలర్లను సేవాకార్యక్రమాలకు వెచ్చిస్తున్నారని తెలిపారు.

కష్టాలు తగ్గుతాయి

చేనేత వృత్తిపైనే ఆధారపడి ఉండి ఇన్నేండ్లు చేతులతో పనిచేయడంతో అనారోగ్యం బారినపడ్డాం. భుజం నొప్పి వచ్చింది. కొంత కాలంపాటు పని బంద్‌చేశాం. ఆసు యం త్రం గురించి తెలిసినా పైసలు లేక కొనుక్కొలేదు. తానా, ప్రభుత్వం కలిసి ఆసు యం త్రం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉన్నది. దీంతో మా కష్టాలు తగ్గినట్టే.
-భాగ్యలక్ష్మి, భూదాన్‌పోచంపల్లి

854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles