గొల్లభామకు చేయూత


Thu,July 12, 2018 03:01 AM

Minister KTR And Harish Rao Held Review Meet On Handlooms

-అన్ని గోల్కొండ షోరూంలలో చీరెల విక్రయాలు
-సిద్దిపేట, దుబ్బాకల్లో ప్రత్యేక చేనేత క్లస్టర్లు
-30 మందికి కొత్తగా పవర్‌లూంలు, జకాట్లు
-మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రకటన

హైదరాబాద్/ సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: తెలంగాణకు ప్రత్యేకమైన గొల్లభామ చీరెకు మరింత ప్రాచుర్యం కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా సిద్దిపేట గొల్లభామ చీరెలను రాష్ట్రంలోని అన్ని గోల్కొండ షోరూంలలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, మార్కెటింగ్, భారీ నీటిపారుదలశాఖల మంత్రి టీ హరీశ్‌రావు ప్రకటించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట చేనేత కార్మికుల సమస్యలపై బుధవారం సచివాలయంలో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టర్లు వెంకట్రాంరెడ్డి, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం అమలుచేయని కార్యక్రమాలను తెలంగాణ సర్కార్ చేనేత కార్మికులకు అందిస్తున్నదని చెప్పారు.

సిద్దిపేట గొల్లభామ చీరెకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నేతన్నల అభివృద్ధికోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నదని చెప్పారు. సిద్దిపేట, దుబ్బాక నేతన్నల అభివృద్ధికోసం ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. నేతన్నకు చేయూత, చేనేతమిత్ర, మగ్గాల ఆధునీకరణ వంటి కార్యక్రమాలను నేత కార్మికుల అందుబాటులోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. దుబ్బాక, చేర్యాల, సిద్దిపేటల్లోని సొసైటీల భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసేందుకు టెక్స్‌టైల్స్‌శాఖ అవసరమైన నిధులను అందిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. సిద్దిపేట, దుబ్బాకలలో ప్రత్యేక చేనేత క్లస్టర్లు ఏర్పాటుచేయాలన్నారు. టెక్స్‌టైల్స్‌శాఖ తరఫున ఇవ్వనున్న బతుకమ్మచీరెలను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో 30 మంది చేనేత కార్మికులకు కొత్తగా పవర్‌లూంలు, జకాట్లు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

మూడు జిల్లాల్లోని కార్మికులకు వర్కింగ్ క్యాపిటల్ త్వరగా ఇచ్చేలా చూడాలని సూచించారు. చేనేత కార్మికుల నుంచి ఎలాంటి గ్యారంటీలు (పూచీకత్తు) తీసుకోకుండా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సహాయం అందేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కార్మికులకు రుణమాఫీ సక్రమంగా అమలయ్యేలా చూడాలని, జిల్లాలవారీగా ఎంత మందికి రుణమాఫీ జరిగిందో పక్కావివరాలు అడిగి తెలుసుకోవాలన్నారు. అర్హులైనవారికి వర్తించకపోతే అందుకు సంబంధించిన ప్రతిపాదనలు అందించాలని సూచించారు. రుణమాఫీ అంశంపై చేనేత కార్మికులకు అధికారులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు సరైన అవగాహన కల్పించాలని చెప్పారు. దుబ్బాక, చేర్యాల, సిద్దిపేటలో భవనాల నిర్మాణాలను పూర్తిచేసేందుకు టెక్స్‌టైల్స్ శాఖ నుంచి నిధులు మంజూరు చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరగా కేటీఆర్ అంగీకారం తెలిపారు.

4523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles