గురుకుల విద్యతో బడుగుల ప్రగతి


Sun,June 16, 2019 03:24 AM

Minister Koppula Eshwar Press Meet On New BC Welfare Residential School

-రేపు ఒకేసారి 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రారంభోత్సవాలు
-పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ తపన
-సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో నాణ్యమైన విద్యను ప్రభుత్వమే ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేసేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా మంజూరుచేసిన 119 మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయాలను సోమవారంనాడు ప్రారంభిస్తునట్టు తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా గురుకుల పాఠశాలల విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నామన్నారు. డైట్‌చార్జీలను పెంచడంతోపాటు యూనిఫామ్, కాస్మొటిక్స్, షూస్ అందజేస్తామని వివరించారు. గురుకులాల్లో సీట్ల కోసం విద్యార్థులు పోటీపడుతున్నారని, ఫలితాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించామని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు వాటి సంఖ్య 281కి పెరిగిందని వివరించారు. నాడు విద్యార్థుల సంఖ్య 8,282 మంది మాత్రమే ఉండగా నేడు 91,680 మందికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా, వారిని విద్యాపరంగా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, అడిషనల్ సెక్రటరీ సైదా, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.

బీసీ సంఘాల హర్షం

బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఒకేసారి 119 బీసీ గురుకులాలు ప్రారంభిస్తుండటం పట్ల ఎనిమిది బీసీ సం ఘాల నాయకులు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో బీసీ గురుకులాలు ప్రథమస్థానంలో నిలిచాయని, మరింత దృష్టిసారించి దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలపాలని కోరారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపినవారిలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎంబీసీ సంఘం అధ్యక్షుడు సంగెం సూర్యారావు, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకల శ్యాంనంద, యూనివర్సిటీ విద్యార్థి ఫోరం అధ్యక్షుడు లింగంగౌడ్, బీసీ ప్రజాసేన అధ్యక్షుడు సింగం నగేశ్, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఈ నిరంజన్, బీసీ రచయితల సంఘం అధ్యక్షుడు బైరు శేఖర్, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు సీ లక్ష్మి ఉన్నారు.
KOPPULA-ESWAR1

2394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles