సుందిళ్ల వేగం పెంచాలి


Wed,June 13, 2018 04:22 AM

Minister Harish Rao Sudden Inspection Kaleshwaram Nandi Medaram Pump House Works

-జూలై 15 నాటికి పనులు పూర్తికావాలి
-అదనంగా కార్మికులను తీసుకోండి
-ఇంజినీర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
-ఇక వారంవారం పనుల సమీక్షకు వస్తా
-రికార్డుస్థాయిలో నాణ్యతతో ప్రాజెక్టు పూర్తి కావాలి
-రెండోరోజు సుందిళ్ల బరాజ్, అన్నారం పంప్‌హౌస్, 6వ ప్యాకేజీ పనుల పరిశీలన

Kaleshwaram
పెద్దపల్లిప్రతినిధి/ మంథని, నమస్తే తెలంగాణ/ ధర్మారం/ మంథనిరూరల్/ రామడుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సిరిపురం వద్ద నిర్మిస్తున్న సుందిళ్ల బరాజ్ పనులను వచ్చేనెల 15 కల్లా పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు నీటిపారుదలశాఖ అధికారులు, నిర్మాణసంస్థ ప్రతినిధులను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంపుహౌస్, అన్నారం బరాజ్, గ్రావిటీ కెనాల్ పనుల పురోగతిని జోరువానలో పరిశీలించారు. రాత్రి వరకు అన్నారం బరాజ్ వద్ద సమీక్ష నిర్వహించిన మంత్రి అదేవర్షంలో అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా మంథని మండలం సుందిళ్ల బరాజ్‌కు చేరుకున్నారు. పనుల పరిశీలనకు వీలుకాకపోవడంతో అక్కడే నవయుగ క్యాంపులో బసచేశారు. తిరిగి మంగళవారం ఉదయాన్నే కాళేశ్వరం ప్రాజెక్టు గుత్తేదారులు, ఇంజినీర్లతోపాటు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనతో కలిసి సుందిళ్ల బరాజ్ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. జూలై 15 నాటికి 4 పంపుహౌస్‌లు పూర్తిచేయాలని గుత్తేదారులకు స్పష్టంచేశారు. వీటికి సంబంధించిన మోటర్ల బిగింపు పనులు వేగవంతం చేయాలన్నారు. మోటార్లకు రూఫ్‌షెడ్ నిర్మించాలని సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల హెడ్‌రెగ్యులేటర్ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని చెప్పారు. పనులన్నీ పూర్తయ్యే వరకు ఇంజినీర్లు ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించారు. పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీ ఎండీలతో మంత్రి హరీశ్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. కార్మికులు, యంత్రసామగ్రి సంఖ్య పెంచి పనులను వేగవంతం చేలని కోరారు. ఇకమీదట వారం రోజులకు ఒకసారి పనుల సమీక్షకు వస్తానని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

11 టీఎంసీల సామర్థ్యం

సుందిళ్ల బరాజ్ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఈసారి రుతుపవనాలు ముందుగా వస్తున్నాయనీ, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టులోకి ఇప్పటికే నీరు వచ్చి చేరుతుందన్నారు. ఆ నీరు సుందిళ్ల బరాజ్‌లోకి వచ్చే అవకాశం ఉందనీ, అందువల్ల పనులు మరింత వేగంగా పూర్తిచేయాలని ఆదేశించినట్టు తెలిపారు. బాగా వర్షాలు పడితే పైనుంచి ఎస్సారెస్పీ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. అలా నీళ్లు వచ్చినప్పుడు నీళ్లు సుందిళ్ల బరాజ్ దగ్గర నిలిచేవిధంగా ఉండాలన్నారు. నీళ్లు కిందికి వదలకుండా ఇక్కడే మనం 11 టీఎంసీల నీటిని నింపుకునే సామర్థ్యం సుందిళ్ల బరాజ్‌కు ఉందనీ, ఎల్లంపల్లికి నుంచి వచ్చే నీటిని నిలుపుకునేలా బరాజ్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఇంజినీర్లు, గుత్తేదారులను ఆదేశించినట్టు తెలిపారు. రివిట్మెంట్ పనులకు కార్మికుల సంఖ్యను పెంచాలని ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. అనంతరం అక్కడి నుంచి మంత్రి హరీశ్‌రావు, ప్రాజెక్ట్ సీఈ నల్లా వెంకటేశ్వర్లుతో కలిసి మధ్యాహ్నం 12.30 నందిమేడారం శివారులో జరుగుతున్న 6వ ప్యాకేజీ అండర్‌టన్నెల్‌ను సందర్శించారు. ఇక్కడ ఎక్కువ సమయం గడపకుండా నీటిని నిల్వచేసే సర్జిఫూల్‌ను పరిశీలించారు. అనంతరం అధికారులు, నవయుగ, మ్యాక్స్ ఇన్‌ఫ్రా కంపెనీ ప్రతినిధులతో నవయుగ క్యాంప్‌లో సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలనీ, టన్నెల్‌లోని పంప్‌హౌస్‌లో ఇదివరకే 2 పంపులు పూర్తి అయిన నేపథ్యంలో 3వ పంపును జూలై 15కల్లా పూర్తి చేసే విధంగా ఇంజినీరింగ్ అధికారులు శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు.
Kaleshwaram3

ఏడో ప్యాకేజీ టన్నెళ్లు పూర్తి చేయాలి

ఆరో ప్యాకేజీ పరిశీలించిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని ఎనిమిదో ప్యాకేజీ వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు అధికారులతో కలిసి వాహనాల్లో నేరుగా సొరంగమార్గం ద్వారా ప్రధాన కుడిటన్నెల్ నుంచి ఏడో ప్యాకేజీ పనులు జరుగుతున్న చోటికి చేరుకున్నారు. ఏడో ప్యాకేజీ టన్నెల్ నిర్మాణంలో ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు హిమాచల్‌ప్రదేశ్ నుంచి వచ్చిన నిపుణుడు విక్రంసింగ్ చౌహాన్ చేపట్టిన చర్యలను మంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు సీఈ ఎన్ వేంకటేశ్వర్లు ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి మంత్రి వెంట ఉన్నారు. అక్కడినుంచి ఎనిమిదో ప్యాకేజీకి చేరుకొని కాన్ఫరెన్ హాల్‌లో ప్రాజెక్టు అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం జరుగుతుండగా మధ్యలో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ఎనిమిదో ప్యాకేజీని సందర్శించారు.
Kaleshwaram2

1866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS