పల్లెల్లో అభివృద్ధి మంత్రం


Sat,September 14, 2019 03:01 AM

Minister Harish Rao Participated in 30 Day Action Plan Program

-ఫలితమిస్తున్న 30 రోజుల కార్యాచరణ
-ఎనిమిదోరోజు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
-పల్లెబాటన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
-పారిశుద్ధ్యం, హరితహారంపై ప్రత్యేక దృష్టి
-హుషారుగా పాల్గొంటున్న ప్రజలు

పల్లెలను అభివృద్ధికి నిలయాలుగా మార్చేందుకు చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా యజ్ఞంలా జరుగుతున్నది. ప్రజాప్రతినిధులతోపాటు అధికారులుగ్రామాల్లో హరితహారం, పారిశుద్ధ్యం, డంపింగ్‌యార్డుల నిర్మాణంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఎనిమిదోరోజు శుక్రవారం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, తన్నీరు హరీశ్‌రావు, జీ జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామసభలు నిర్వహిస్తూ.. స్వయంగా తామే పారిశుద్ధ్య పనులు చేపడుతూ ప్రజల్లో స్ఫూర్తినింపుతున్నారు. -నమస్తే తెలంగాణ నెట్‌వర్క్
Palle-Pragathi
ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన 30 రోజుల ప్రగతి కార్యాచరణ ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని 441 గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. గుంతలు, నీటి నిలువ ప్రాంతాలు, పాడుబడిన బావులు పూడ్చారు. భూత్పూరు మండలం అన్నాసాగర్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శ్రమదానం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలకేంద్రంలో 30 రోజుల ప్రణాళిక పనులు జరుగుతున్న తీరును కలెక్టర్ తెలుసుకున్నారు. మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళీకేరీ జన్నారం మండలం ఇందన్‌పల్లిలో రోడ్లపైన పేరుకుపోయిన గడ్డి, పిచ్చి మొక్కలను స్వయంగా తొలగించారు. గుంతలను పూడ్చి శుభ్రం చేశారు. మందమర్రి మండలం అందుగులపేటలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నరేందర్ పాల్గొన్నారు. బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ రాహుల్‌రాజ్ బెల్లంపల్లి మండలం గురజాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు పల్లెల్లో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షించారు.

ముమ్మరంగా హరితహారం

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా గ్రామాల్లో హరితహారం కార్యక్రమం ముమ్మరంగాసాగుతున్నది.వరంగల్‌అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్, గోపాల్‌పూర్ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ మొక్కలు నాటారు. ప్రతీ ఇంట్లో ఆరుమొక్క లు పెంచేలా సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డుకిరువైపులా మొక్కలు పెంచాలని, మొక్కల సంరక్షణకు తప్పకుండా ట్రీగార్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. 100 శాతం మొక్కలను సంరక్షించిన గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. సర్పంచ్ మమత, ఎంపీపీ స్వప్న, మండల ప్రత్యేకాధికారి నీరజ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో కలెక్టర్ రామ్మోహన్‌రావు పాల్గొన్నారు. మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో జెడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూర్‌లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మొక్కలు నాటారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం వాడపల్లిలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మాడ్గులపల్లి మండ లం చెర్వుపల్లిలో డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.

అధికారుల పల్లెనిద్ర..

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పలు జిల్లాల్లో పల్లె నిద్ర చేస్తున్నారు. మెదక్ జిల్లా పంచాయతీ అధికారి హనోక్ చేగుంట మండలం చిన్నశివునూర్‌లో పల్లెనిద్ర చేశారు. ఉదయం గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కో-ఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, మహిళాసంఘాల సభ్యులతో కలసి పిచ్చిమొక్కలు తొలగించారు. సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెనిద్ర చేపట్టారు. సంగారెడ్డి మండలం చెర్లగూడెంలో.. కలెక్టర్ హనుమంతరావు, కొండాపూర్ మండలం గుంతపల్లిలో జెడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీ, నారాయణఖేడ్ మండలం చాప్టా-కే గ్రామంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పల్లెనిద్ర చేశారు.

ఉత్సాహంగా 30 రోజుల కార్యాచరణ

నల్లగొండ జిల్లాలో 30 రోజుల కార్యాచరణ 844 గ్రామపంచాయతీల్లో విస్తృతంగా కొనసాగుతున్నది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పీఏపల్లి మండలం మల్లాపురంలో మార్కెటింగ్ ఏడీ ఎంఏ అలీం డ్రైనేజీలను శుభ్రం చేశారు. నిడమనూరు మండలం ముకుందాపురంలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పాల్గొని చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రజలతో చర్చించారు.
Palle-Pragathi4

జిల్లాల్లో కలెక్టర్ల ఆకస్మిక తనిఖీలు

జిల్లాల్లో పల్లెప్రగతి సందడి కనిపిస్తున్నది. సర్పంచ్‌లతో కలిసి ప్రజలు స్వచ్ఛందంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కలెక్టర్ శ్రీధర్ తాడూరు మండలం చర్లతిర్మలాపూర్‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. కొల్లాపూర్‌లో జిల్లా పరిషత్ సీఈవో నాగమణి పర్యటించి అధికారులతో సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతి పట్ల ఎవ్వరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అధికారులను హెచ్చరించారు. వంగూరు మండలం ఉప్పలపాడులో జరిగిన పల్లెప్రగతి ప్రణాళిక పనులను జేడీ అంజిలప్ప పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30 రోజుల ప్రగతి ప్రణాళిక ఉత్సాహంగా కొనసాగుతున్నది. గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్, గోరంటాల, దమ్మన్నపేట గ్రామాల్లో శుక్రవారం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమ అమలు తీరును కలెక్టర్ కలెక్టర్ కృష్ణభాస్కర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హరితహారంలో నాటిన మొక్కల తొలగించినవారితోపాటు పశువులను మేపిన వారిపై రూ.500 జరిమానా విధించాలని ఆదేశించారు.

30రోజుల ప్రణాళికతో ఆరోగ్య తెలంగాణ

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ ఏర్పడుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొల్గూరు, తడ్కపల్లి, చిన్న గుండవెల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పారిశుద్ధ్య పనులపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రతి ఇంటిలో వేప, తులసి మొక్కలను నాటాలని మంత్రి కోరారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రోజారాధాకృష్ణశర్మతో కలిసి పారిశుద్ధ్య పనుల్లో పాల్గొని చెత్తను ఎత్తి ట్రాక్టర్లలో వేశారు. పాడుబడ్డ ఇండ్ల కూల్చివేయడానికి మంత్రి స్వయంగా జేసీబీ నడిపారు.

ప్లాస్టిక్‌పై సమరం

30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్‌ను తొలిగించేందుకు జోగుళాంబ గద్వాల జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ధరూర్ మండలం బూరెడ్డిపల్లిలో కలెక్టర్ శశాంక, జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, సర్పంచ్ జ్యోతి, రహదారులపై ప్లాస్టిక్‌ను తొలగించారు. ఇటిక్యాల మండలం వల్లూరులో జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం ప్లాస్టిక్‌ను తొలగించే కార్యక్రమం చేపట్టారు. మల్దకల్ మండలంలో డీపీవో కృష్ణ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా ఎల్లంల, పెంబర్తి గ్రామాల్లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పర్యటించి పాడుబడ్డ బావులను పూడ్చివేయాలని, శిథిలావస్థకు చేరిన ఇండ్లు, ఇతర కట్టడాలను కూల్చివేయాలని, మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రంచేయాలని అధికారులకు సూచించారు. చిలుపూర్‌లో జెడ్పీచైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి 30 రోజుల ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ శ్రమదానం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రమదానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ దౌడుబాబు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 30 రోజుల కార్యచరణ ప్రణాళికలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. జిల్లాలోని 560 పంచాయతీల్లో గ్రామ ప్రత్యేకఅధికారులు, మండల ప్రత్యేక అధికారులు పర్యటించారు. జిల్లా ఇంచార్జి కలెక్టర్ హరీశ్ ఫరూఖ్‌నగర్ మండలంలోని కిషన్‌నగర్, హాజిపల్లి గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరిని భాగస్వాములను చేయాలన్నారు. జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలో పర్యటించారు.
Palle-Pragathi5

పల్లె పచ్చగుండాలె

-రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
మామిళ్లగూడెం: తెలంగాణలోని ప్రతిపల్లె పచ్చగా ఉండాలన్నదే ప్రభుత్వధ్యేయమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. 30 రోజుల కార్యాచరణలో భాగంగా వైరా మండలం రెబ్బవరంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణతో కలిసి మంత్రి హాజరయ్యారు. అనంతరం రోడ్డుపక్కన ఉన్న పిచ్చిమొక్కలను మంత్రి కొడవలితో తొలగించి, హరితహారం మొక్కలు నాటారు.

స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దుదాం

-మంత్రి మల్లారెడ్డి పిలుపు
మేడ్చల్ జిల్లా పరిధిలోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చుదామని మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ డా ఎంవీ రెడ్డి పిలుపునిచ్చారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కాప్రా మండలం జవహర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో మంత్రి మల్లారెడ్డి పర్యటించగా.. ఘట్‌కేసర్ మండలం అవుషాపుర్, ఘట్‌కేసర్‌లో కలెక్టర్ సందర్శించారు. గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 30 రోజుల్లో గ్రామాలను క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చాలని గ్రామస్థులను కోరారు.
MALLA-REDDY11

ఊరికోసం మేముసైతం

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు అయిదేండ్ల పాటు నెలకు రూ.10 వేల చొప్పున అందిస్తానని నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన రాష్ట్ర ఉపాధిహామీ మండలి సభ్యుడు చిక్యాల హరీశ్‌కుమార్ ప్రకటించారు. ఈమేరకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా సర్పంచ్ భూమేశ్వర్‌కు రెండు నెలలకు సంబంధించిన రూ.20వేల చెక్కును అందజేశారు.
-దిలావర్‌పూర్

-పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అత్తగారు ఊరు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మాల్యాల గ్రామానికి ఆయన సతీమణి ఉష రూ.2 లక్షలు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి రూ. లక్ష, సాంబశివారెడ్డి 30 గుంటల స్థలం, రంగారావు రూ.లక్ష, సులోచనాదేవి రూ. లక్ష, అమరేందర్‌రావు రూ. లక్ష, రామకృష్ణారావు 50 వేలు. గ్రామకార్యదర్శి రూ.10 వేలు విరాళం అందిస్తున్నట్టు ప్రకటించారు.
-భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామానికి చెందిన సోమరాజు వెంకటలక్ష్మీనరసింహరాజు గ్రామంలో శ్మశాన వాటికకు 20 గుంటల భూమిని శుక్రవారం విరాళమిచ్చారు. చండ్రుగొండ మండలం బెండాలపాడులో శ్మశాన వాటిక కోసం కారం వెంకటేశ్వర్లు 20 గుంటలు, డంపింగ్ యార్డు కోసం బచ్చల కృష్ణయ్య అనే వ్యక్తి 10 గుంటల భూమిని అందజేశారు.
-సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మం డలం మొండిచింతతండా పరిధిలోని జాటోత్‌తండాకు చెందిన జాటోత్ దస్రూనాయక్ గ్రామంలో నర్సరీ ఏర్పాటుకు 5 గుంటల స్థలం, మొండిచింతతండాకు చెందిన ధరావత్ సింగ్యానాయక్ శ్మశానవాటిక కోసం 5 గుంటల స్థలమిచ్చారు.
-సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని హిందూశ్మశాన వాటిక మహాప్రస్థానం పునర్నిర్మాణానికి దాత సిరిపురం విశ్వనాథం శుక్రవారం మహాప్రస్థానం కమిటీ సభ్యులకు రూ. లక్ష అందజేశారు. నేరేడుచర్ల మండలం ఫత్తేపురంలో మొక్కల సంరక్షణకు హైదరాబాద్‌లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన ముత్తినేని సోమనాథం-జ్యోతి దంపతులు శుక్రవారం రూ.45 వేల విలువైన 150 ట్రీగార్డ్స్‌ను అందజేశారు.
-మంచిర్యాల జిల్లా చిర్రకుంటకు వాసి అత్తి మల్లయ్య 20 గుంటల భూమిని గ్రామాభివృద్ధి కోసం ఇచ్చారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండ లం న్యూ లోలం గ్రామానికి చెందిన నల్ల రామస్వామి గ్రామాభివృద్ధికి రూ.40 వేలను పంచాయతీ కార్యదర్శికి అందజేశారు.
-మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో చెత్తబుట్టల పంపిణీకి డోర్నకల్ మండలం ఉయ్యాలవాడకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు నున్నా రమణ రూ.2 లక్షలు, టీఆర్‌ఎస్ మండల శాఖాధ్యక్షుడు గొర్ల సత్తిరెడ్డి రూ.25వేలు, మాజీ జెడ్పీటీసీ స్వరూప కోటిలింగం రూ.25 వేలు, టీఆర్‌ఎస్ పట్టణ కార్యదర్శి రూ.11వేలు, నల్గొండ శ్రీనివాస్ రూ.11వేలు, మాజీ సర్పంచ్ మాదా లావణ్యశ్రీనివాస్ రూ.51 వేలు, సురేందర్ జైన్ రూ.51వేలు, రామకృష్ణ రూ.5 వేలు విరాళ మిచ్చారు. దాతలకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ కృతజ్ఞతలు చెప్పారు.
-నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం మారేపల్లి గ్రామాభివృద్ధికి గ్రామస్థులు రూ.2.25 లక్షలు విరాళంగా అందజేశారు.
-నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని గంగన్నపాలెంకు చెందిన కోటయ్యఅనే వ్యక్తి రూ.10,116 విరాళంగా అందించారు.

మార్పుతెచ్చిన ప్రణాళిక

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు ఆ గ్రామస్థులు స్పందించారు. ఓ చికెన్‌సెంటర్ నిర్వాహకుడు ఆకులలో కోడి మాంసం విక్రయిస్తూ ఆదర్శంగా నిలిచాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామాన్ని పోలీసులు దత్తత తీసుకున్నారు. ఈ మేరకు గ్రామాన్ని సందర్శించిన సీపీ కమలాసన్‌రెడ్డి ప్లాస్టిక్‌వాడకాన్ని నిషేధించాలని గ్రామస్థులను కోరారు. ఈ మేరకు గ్రామంలోని చికెన్‌సెంటర్ నిర్వాహకుడు నారాయణరెడ్డి కవర్లకు బదులుగా ఆకులలో పెట్టి చికెన్ విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ సందర్భంగా నారాయణరెడ్డిని గ్రామస్థులు అభినందించారు.
- చొప్పదండి,నమస్తేతెలంగాణ

మార్పు కోసం..

30 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో పర్యటించిన కలెక్టర్ భారతి హోళికేరి రోడ్డు పక్కన ప్లాస్టిక్‌గ్లాసులు, ఖాళీసీసాలు నిల్వచేసిన శ్రీసాయిరాం వైన్స్ యజమానులకు రూ.30 వేలు జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వైన్స్ యయజమానులుఅధికారులకు జరిమా నా చెల్లించారు.
- మంచిర్యాల ప్రతినిధి, నమస్తేతెలంగాణ

పల్లె సీమలే భాగ్య రేఖలు

పల్లె సీమలను భాగ్యరేఖలుగా తీర్చిదిద్దేందుకే సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రణాళికను రూపొందించారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి జగిత్యాల జిల్లాలో శుక్రవారం పర్యటించారు. కొడిమ్యాల, వెల్గటూర్, గొల్లపెల్లి మండలాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొని,హిమ్మత్‌రావుపేటలో మొక్కలు నాటారు. గ్రామంలో ఉన్న పాత బావిని పూడ్చేందుకు మంత్రులు తట్టలతో మట్టిని ఎత్తిపోశారు.
-జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ

అభివృద్ధికి సహకరించాలి

గ్రామాలను అభివృద్ధి చేసుకొనేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం సోలీపూర్‌లో పల్లెప్రగతిలో భాగంగా చేపడుతున్న పనులను జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ 30 రోజుల కార్యాచరణను అమలు చేస్తున్నారనీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు సమిష్టిగా పనిచేయాలని
కోరారు.
-ఖిల్లాఘణపురం

కలిసికట్టుగా ముందుకెళ్దాం

కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ ఎంపీడీవో కార్యాలయంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యదర్శులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమావేశమయ్యారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు వందశాతం పూర్తిచేసిన గ్రామాలకు రూ.10 లక్షలు మంజూరు
చేస్తామని హామీ ఇచ్చారు.
-హన్వాడ
Palle-Pragathi2

799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles