హైదరాబాద్‌షా అసద్


Fri,May 24, 2019 03:53 AM

MIM will go national Asaduddin Owaisi

- నాలుగోసారి వరుస గెలుపు
- పదోసారి ఎంఐఎం విజయం
- 3,36,186 ఓట్ల మెజార్టీ


హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి హైదరాబాద్‌షాగా నిలిచారు. హైదరాబాద్ స్థానం నుంచి నాలుగోసారి వరుసగా గెలుపొంది తన పట్టు నిలుపుకొన్నారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన భగవంత్‌రావుపై 3,36,186 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొదటి రెండు రౌండ్లలో భగవంతరావు అధిక్యాన్ని ప్రదర్శించినా, తర్వాత క్రమంగా పుంజుకున్న ఒవైసీ మిగతా అన్ని రౌండ్లలో మెజార్టీ సాధించారు. మొత్తం 22 రౌండ్లకుగాను 20 రౌండ్లలో ఒవైసీ ముందంజలో నిలిచి 2,82,186 ఓట్ల మెజార్టీ సాధించారు. అసదుద్దీన్‌కు 5,71,471 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి పుస్తె శ్రీకాంత్‌కు 63,239, బీజేపీ అభ్యర్థి భగవంతరావుకు 2,35,285, కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌కు 49,944 ఓట్లు లభించాయి. ఒక్క గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి 54,750 ఓట్ల మెజార్టీ వచ్చింది. 1984 నుంచి హైదరాబాద్ లోక్‌సభ స్థానం మజ్లిస్‌కు కంచుకోటగా ఉన్నది. 1984లో సుల్తాన్ సలావుద్దీన్‌ఒవైసీ 3,481ఓట్లతో గెలిచారు. అప్పటినుంచి మజ్లిస్ బలం పెంచుకున్నది. 1984, 1989, 1991, 1996, 1998, 1999 ఎన్నికల్లో ఎంపీగా సలావుద్దీన్, వరుస విజయాలు సాధించారు. 2004 నుంచి ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ గెలుస్తున్నారు.

జాతీయ భద్రత పేరుతో బీజేపీ గెలిచింది: ఒవైసీ

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ జాతీయ భద్రతను వాడుకొన్నదని అసదుద్దీన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. విజయం సాధించిన బీజేపీని తప్పనిసరిగా అభినందించాల్సిందే, అయితే ఇదే సమయంలో వారు జాతీయ భద్రత పట్ల ప్రజల్లో భయం కల్పించడంలో విజయం సాధించారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో ఎలాంటి భయం లేనప్పటికీ.. బీజేపీ నేతలు ముస్లింలతో ముప్పు వున్నదని ప్రజల్లోకి తీసుకెళ్లారని ఆరోపించారు. బీజేపీ నాయకత్వంలో దేశంలోని మిశ్రమ సంస్కృతికి అపాయమున్నదని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి రిగ్గింగ్ జరుగలేదని, అయితే హిందూ మెదళ్లను రిగ్గింగ్ చేశారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ తన స్వతంత్రతను నిరూపించుకోవాల్సిన అవసరమున్నదని చెప్పారు.


2139
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles