పేదల పక్షపాతి రిటైర్డ్ ఐఏఎస్ యుగంధర్ కన్నుమూత


Sat,September 14, 2019 03:01 AM

Microsoft CEO Satya Nadella father B N Yugandhar passes away

-గత కొంతకాలంగా అనారోగ్యం
-కొంతకాలంగా అనారోగ్యం
-పేదల పక్షపాతిగా ప్రఖ్యాతి
-జాతీయ, రాష్ట్రస్థాయిలో సేవలు
-మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈయన కుమారుడే
-అమెరికా నుంచి సత్య నాదెళ్ల రాగానే అంత్యక్రియలు
-యుగంధర్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రణాళికాసంఘం మాజీ సభ్యుడు, దేశంలో దారిద్య్ర నిర్మూలన పథకాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన మేధావి, పేదల పక్షపాతి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. ఈయన కుమారుడే. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాగర్‌సొసైటీలో నివాసం ఉంటున్న యుగంధర్.. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ మార్చురీలో భద్రపరిచారు. కుమారుడు సత్య నాదెళ్ల అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. యుగంధర్ మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.

సమర్థ అధికారిగా చెరగని ముద్ర

1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన బీఎన్ యుగంధర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, జాతీయస్థాయిలో అనేక ఉన్నత పదవులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బుక్కాపురం ఆయన స్వగ్రామం. తదుపరి గుంటూరు జిల్లా నాదెళ్లకు వెళ్లారు. అందుకే ఇంటిపేరులో రెండుఊళ్ల పేర్లను ఉంచుకున్నారు. నిజాయతీపరుడిగా, సమర్థ ఐఏఎస్‌గా చెరుగని ముద్రవేశారు. ఎన్టీరామారావు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1983 నుంచి 1985 మధ్యకాలంలో ఆయనకు కార్యదర్శిగా వ్యవహరించారు. ఎన్టీఆర్‌కు అత్యంత నమ్మకస్థుడైన అధికారిగా ఉండేవారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం రూపొందించడంలో యుగంధర్ కీలకపాత్ర పోషించారు. పీవీ నరసింంహారావు ప్రధానిగా ఉన్న సమయంలో పీఎంవో అధికారిగా పనిచేశారు. ముస్సోరీలోని లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా 1988 నుంచి 1993 వరకు బాధ్యతలు నిర్వర్తించారు.

ఆ సమయంలో అకాడమీలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శిగా, 2004-09 మధ్యకాలంలో ప్రణాళికాసంఘం సభ్యుడిగా పనిచేశారు. దివ్యాంగులకు సంబంధించి ఒక అధ్యాయాన్ని పంచవర్ష ప్రణాళికలో చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. దేశంలో దారిద్య్ర నిర్మూలనకు అనేక కీలక పథకాల రూపకల్పనలో ఆయనది ముఖ్య భూమిక. పీఎంవోలో పనిచేసిన సమయంలో తన సహచర ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్‌తో కలిసి పేదలకోసం అనేక పథకాలను రూపొందించారు. ఉద్యోగపరంగా మిత్రులుగా ఉన్న యుగంధర్, కేఆర్ వేణుగోపాల్ తదనంతరం వియ్యంకులయ్యారు. వేణుగోపాల్ కుమార్తె అనుపమను యుగంధర్ ఏకైక కుమారుడు సత్య నాదెళ్ల వివాహం చేసుకున్నారు. యుగంధర్‌ను నిజాయతీపరుడైన, వామపక్ష భావాలున్న అధికారిగా ఆయన సహచరులు గుర్తుచేసుకుంటారు. వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకంలో నిధులు కేంద్రం నుంచి నేరుగా జిల్లాలకు చేరే విషయంలో మార్గదర్శకాలను ఆయనే రూపొందించారని చెప్పుకొంటారు. సాదాసీదాగా, నిరాడంబరంగా ఉండే యుగంధర్.. తన కుమారుడి వివాహాన్ని కూడా అంతే నిరాడంబరంగా జరిపించారు. అప్పటికి ఆయన ప్రధాని కార్యాలయంలో పనిచేస్తున్నా.. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావును సైతం ఆహ్వానించలేదని చెప్తారు. తన కుమారుడు మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులైన సమయంలో కూడా మీడియా అత్యుత్సాహాన్ని తన దరిచేరనివ్వలేదు.
BN-Yugandhar1

ఐఏఎస్‌లకు ఆయన గురుతుల్యుడు: ఎస్కే జోషి

ఐఏఎస్ అధికారులకు బీఎన్ యుగంధర్ గురుతుల్యుడని, ఆణిముత్యం లాంటి అధికారి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నివాళులర్పించారు. యుగంధర్ యువ ఐఏఎస్ అధికారులకు రోల్ మోడల్‌గా ఉంటారని ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు, ఎంసీహెచ్చార్డీ డైరెక్టర్ బీపీ ఆచార్య పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిలో ఆయన కృషి ఎనలేనిదని చెప్పారు. చిత్తశుద్ధి, నేర్పు కలిగిన అధికారిగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కే పద్మనాభయ్య నివాళులర్పించారు. వామపక్షభావాలతో ఉండేవారని, యువ ఐఏఎస్ అధికారులకు స్ఫూర్తినిచ్చేవారని గుర్తుచేసుకున్నారు.

మంత్రి కేటీఆర్ సంతాపం

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ మృతిపట్ల ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు తీవ్ర సంతాపం తెలిపారు. దేశంలో అనేక గ్రామీణాభివృద్ధి సంస్కరణల కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. యుగంధర్ కుమారుడు, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యుగంధర్ మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆబ్కారీ, సాంస్కృతికశాఖల మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర సంతాపం తెలిపారు.

యుగంధర్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. యుగంధర్ నిజాయతీ కలిగిన అధికారి అని, నిరంతరం పేదల కోసం పనిచేసేవారంటూ ప్రజలకు ఆయన చేసిన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. యుగంధర్ కుటుంబసభ్యులకు, ఆయన కుమారుడు, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

1111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles