రికార్డుల మేడిగడ్డ


Thu,June 20, 2019 02:50 AM

MEIL completes work on the mega Kaleshwaram lift irrigation project

-కోటిన్నర బస్తాల సిమెంట్ వినియోగం
-సీఎం కేసీఆర్ రీడిజైనింగ్‌తో అద్భుతమైన నిర్మాణం
-28.25 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్
-గరిష్ఠంగా 1990లో 22.17 లక్షల క్యూసెక్కుల వరద
-గోదావరి సుదీర్ఘ ప్రవాహంలో కీలక మైలురాయి

గుండాల కృష్ణ - హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరి నదీ ప్రస్థానంలో మరో చారిత్రక మైలురాయి నమోదయ్యే క్షణాలు సమీపిస్తున్నాయి. అనేక బరాజ్‌లను దాటుకుంటూ తెలంగాణ మీదుగా.. అడ్డులేకుండా దిగువకు ఉరకలేసే గౌతమీ పరవళ్లు గమనాన్ని మార్చకోనున్నాయి. సీఎం కేసీఆర్ రూపొందించిన సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు వన్నెతెచ్చిన మేడిగడ్డ బరాజ్ నిర్మాణం గోదారమ్మ సుదీర్ఘ ప్రవాహంలో అపురూప మజిలీగా మారనున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక నదీమార్గంలో రివర్సబుల్ పంపింగ్‌తో వందల కొద్దీ టీఎంసీలను వెనుకకు తరలించి.. తద్వారా లక్షల ఎకరాలకు జీవంపోసే మహాక్రతువులో మేడిగడ్డ నిర్మాణం చరిత్రలో నిలిచిపోనున్నది. మరో 24 గంటల్లో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్న మేడిగడ్డ బరాజ్ అనేక ఆసక్తి కలిగించే సాంకేతిక పునాదులపై నిర్మితమైంది.

18 కిలోమీటర్ల గట్టు

మేడిగడ్డ బరాజ్ డిజైన్‌లో బ్యాక్‌వాటర్ అధ్యయనమనేది కూడా ఆసక్తికరం. ఈ బరాజ్ నీటినిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఈ నేపథ్యంలో అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ వైపు నీరు విస్తరించకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై సర్వేచేశారు. మేడిగడ్డ ఎగువన (అప్‌స్ట్రీమ్‌లో) మంచిర్యాల, దిగువన (డౌన్ స్ట్రీంలో) పెరూర్ వద్ద నమోదైన వివరాల్ని క్రోడీకరించి.. వాటిని హెక్-రాస్ (HEC-RAS) అనే సాఫ్ట్‌వేర్ ద్వారా బ్యాక్‌వాటర్ విశ్లేషణ వివరాలను సేకరించారు. తద్వారా వచ్చిన వివరాల ఆధారంగా మేడిగడ్డ బరాజ్‌కు ఇరువైపులా గట్టు (ఎంబాంక్‌మెంట్) నిర్మాణం చేపట్టారు. కుడివైపు 6.380 కిలోమీటర్లు, ఎడమవైపున 11.710 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణాల్ని చేపట్టి, రివిట్‌మెంట్ చేశారు. అదేవిధంగా కుడివైపు 4.300 కిలోమీటర్లు, ఎడమవైపున 12.720 కిలోమీటర్ల డైవర్షన్ చానెల్స్‌ను కూడా నిర్మించారు. దీంతో రెండువైపులా ముంపును పూర్తిస్థాయిలో నియంత్రించారు.
MEDIGADDA

74.60 కోట్ల కిలోల సిమెంటు

గోదావరిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన బరాజ్ పొడవు 1,632 మీటర్లు. అంటే కిలోమీటరున్నరకు పైగా ఉంటుంది. ఇందులో స్పిల్‌వే 1,308 మీటర్లు కాగా, బే పొడవు 324 మీటర్లు. ఇందుకుగాను 85 గేట్లు (స్పిల్ వే గేట్లు - 68, సైజు 15 మీటర్లు x 11 మీటర్లు. స్లూయిజ్ గేట్లు - 17, సైజు 15 మీటర్లు x 12 మీటర్లు) అమర్చారు. బరాజ్ నిర్మాణానికిగాను 71.90 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని చేయాల్సి వచ్చింది. కీలకమైన కాంక్రీట్ పరిమాణాన్ని ఏకంగా 18,65,074 క్యూబిక్ మీటర్లు చేపట్టారు. సాధారణంగా బరాజ్‌ల నిర్మాణంలో ఒక్క క్యూబిక్ మీటర్ కాంక్రీట్‌కు దాదాపు ఎనిమిది బస్తాల (400 కిలోలు) సిమెంటును వినియోగిస్తారని ఇంజినీర్లు తెలిపారు. ఈ క్రమంలో మేడిగడ్డ బరాజ్ నిర్మాణానికి ఏకంగా 1.50 కోట్ల సిమెంటు బస్తాలు అంటే 74,60,29,600 కిలోల సిమెంటును వినియోగించారు. ఇదొక రికార్డు. ఇంత భారీస్థాయిలో కాంక్రీట్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తిచేయడమనేది తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఇంజినీర్ల అంకితభావానికి నిదర్శనం.
MEDIGADDA2

284.3 టీఎంసీల నీటి లభ్యత

గోదావరి.. సుదీర్ఘ ప్రవాహంలో భాగంగా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి వద్ద తెలంగాణ గడ్డలోకి ప్రవేశిస్తుంది. ప్రాణహిత కలయికతో మరింత ఉధృతమవుతుంది. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తూ.. ఆదిలాబాద్ జిల్లా కౌటాల వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత నీరు.. గోదావరి నీటి లభ్యతలో దాదాపు 35 శాతంపైగా ఉంటుంది. అందుకే మేడిగడ్డ వద్ద అత్యధికంగా 284.3 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని కేంద్ర జలసంఘం నిర్ధారించింది. ప్రధానంగా పెన్‌గంగ, వార్ధ్దా, మానేరు, మధ్య గోదావరి, ప్రాణహిత వంటి ఐదు సబ్‌బేసిన్ల నుంచి మేడిగడ్డ వద్దకు వరద వస్తుంది. అత్యాధునిక లైడార్ సర్వేను పరిగణనలోకి తీసుకొని సీఎం కేసీఆర్ చేపట్టిన రీడిజైనింగ్‌లో ఈ ప్రదేశాన్ని గుర్తించారు. దీంతో మహారాష్ట్ర- తెలంగాణ అంతర్రాష్ట్ర ఒప్పందానికి ఈ బరాజ్ వేదికగా నిలిచింది.

సాంకేతిక అద్భుత అంశాలెన్నో..

మేడిగడ్డ బరాజ్ డిజైన్ వెనుక సాంకేతిక కసరత్తు ఎంతో ఉంది. ఈ ప్రాంతంలో వం దేండ్ల ప్రవాహ రికార్డులను మదింపుచేశారు. 1996లో అతి తక్కువ డిశ్చార్జి నమోదు కాగా, గరిష్ఠంగా 1990లో 62,800 క్యూమెక్స్ ఉన్నది. ఆ సమయంలో 87 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉన్నది. మరోవైపు పెరూర్ (వరంగల్- ఖమ్మం సరిహద్దు ప్రాం తంలో గోదావరి ప్రవాహం) పాయింట్ వద్ద వివరాల్ని ఆధారం చేసుకొన్నారు. దీనిప్రకారం 80వేల క్యూమెక్స్ (28,25,173.29 క్యూసెక్కులు) ప్రవాహం ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. మేడిగడ్డ వద్ద గోదావరిలో ప్రాణహిత, మానేరు, ఇతర కీలకమైన వాగులు, వంకలు కలుస్తాయి. పెరూర్ వద్దకొచ్చేసరికి అదనంగా ఇంద్రావతి కూడా కలుస్తుంది. మేడిగడ్డ కంటే పెరూరు వద్ద గోదావరిలో వరదప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పాయింట్ ఆధారంగా మేడిగడ్డ బరాజ్‌ను డిజైన్ చేశారు.

2085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles