కన్నెపల్లిలో ఎత్తిపోత పునఃప్రారంభం


Mon,July 22, 2019 02:53 AM

Medigadda Barrage Gates lifted

-నాలుగురోజుల విరామం తర్వాత మొదలు
-అన్ని మోటర్లను ఆటోమోడ్‌లోకి తీసుకొచ్చిన అధికారులు
-3, 4 నంబర్ల మోటర్లతో ఎత్తిపోత.. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూసివేత
-అన్నారం పంపుహౌస్‌లో 1వ మోటర్‌కు సింక్రనైజేషన్ ప్రక్రియ పూర్తి
-నేడు రెండు మోటర్ల ద్వారా సుందిల్లకు జలాల ఎత్తిపోత!
-ఎగువన గోదావరిలోకి వరద

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌లో గోదావరి జలాల ఎత్తిపోత ఆదివారం మళ్లీ మొదలయింది. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో మేడిపల్లి బరాజ్ గేట్లను అధికారులు మూసివేశారు. కాసిపేటలోని అన్నారం పంప్‌హౌస్‌లో సోమవారం 1, 2వ నంబర్ల మోటర్లను ద్వారా సుందిల్లకు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మ్యానువల్ నుంచి ఆటోమోడ్‌లోకి తీసుకొచ్చేందుకు నాలుగు రోజులపాటు మోటర్లను నిలిపివేసిన ఇంజినీరింగ్ అధికారులు ఆదివారం రెండుమోటర్లను ఆన్‌చేసి.. అన్నారం బరాజ్‌లోకి జలాలను ఎత్తిపోశారు. పంప్‌హౌస్‌లో అన్ని మోటర్లు ఆటోమోడ్‌లోకి వచ్చాయని ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు.
kaleshwaram7
శనివారం అర్ధరాత్రి 3వ నంబర్ మోటరు ఆన్‌చేసిన అధికారులు ఆదివారం ఉదయం 8 గంటల వరకు నడిపి ఆఫ్‌చేశారు. తిరిగి 11 గంటలకు 3, 4వ నంబర్ల మోటర్లను ఆన్‌చేసి డెలివరీ సిస్టర్న్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బరాజ్‌లోకి గోదావరి జలాలను తరలించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని 2వ నంబర్ మోటర్‌ను ఏక్షణంలోనైనా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంజినీర్లు తెలిపారు. అన్నారం బరాజ్ గేట్లవద్ద గోదావరి జలాలు 9.92 మీటర్లకు చేరుకున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు మేడిగడ్డ నుంచి అన్నారం బరాజ్‌కు 5.87 టీఎంసీల నీరు చేరిందని అధికారులు తెలిపారు. కాగా, మేడిగడ్డ బరాజ్ గేట్లను ఆదివారం మూసివేశారు. ఎగువ నుంచి ప్రాణహిత వరద తగ్గుముఖం పట్టడం, కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లను తిరిగి ప్రారంభించడంతో బరాజ్‌లో నీటిని నిల్వచేసేందుకు అధికారులు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం బరాజ్‌లో 8.5 మీటర్ల ఎత్తులో ఏడు టీఎంసీల నీరునిల్వ ఉన్నది.

కన్నెపల్లిని సందర్శించిన సీఎండీ ప్రభాకర్‌రావు

kaleshwaram2
కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ట్రాన్స్‌కో- జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆదివారం కుటుంబసమేతంగా పూజలుచేశారు. వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మండపంలో ఆశీర్వచనంచేసి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ప్రభాకర్‌రావు కుటుంబసమేతంగా కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ మెఘా కంపెనీ సీజీఎం వేణుమాధవ్, ఇంజనీర్లు వారికి స్వాగతంపలికారు. పంప్‌హౌస్ వ్యూపాయింట్ నుంచి డీఈఈ సూర్యప్రకాశ్ ప్రాజెక్టు గురించి వివరించారు. ఫోర్‌బే, డెలివరీ సిస్టర్న్ వద్ద గ్రావిటీ కెనాల్‌లో పోస్తున్న నీటిని పరిశీలించారు.

ఐదు బాహుబలి మోటర్ల డ్రైరన్ పూర్తి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన బాహుబలి మోటర్ల డ్రైరన్ ఒక్కొక్కటిగా పూర్తవుతున్నది. ఇప్పటివరకు ఐదుమోటర్ల డ్రైరన్‌ను అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఈ క్రమంలో అధికారులు సింక్రనైజేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-8 కింద రామడుగు పంపుహౌస్‌లో ఈ మోటర్లను అమర్చారు. 139 మోగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడుమోటర్లను రామడుగు పంపుహౌస్‌లో అమరుస్తున్నారు. తద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు వీలవుతుంది. అయితే ఇప్పటివరకు ఐదు మోటర్ల డ్రైరన్‌ను కూడా అధికారులు పూర్తిచేశారు. మిగిలిన రెండింటిలో ఈ నెలాఖరుకు ఒకటి, వచ్చేనెలలో మరోమోటర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తుచేస్తున్నారు.

కృష్ణా బేసిన్‌లో ఇన్‌ఫ్లోలు తగ్గుముఖం

కృష్ణాబేసిన్‌లో ఇన్‌ఫ్లోలు పడిపోతున్నాయి. ఆదివారం ఆల్మట్టి వద్ద 19,155 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే నమోదైంది. 129.72 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఆల్మట్టిలో ప్రస్తుతం 116.34 టీఎంసీల నిల్వ ఉన్నది. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో కర్ణాటక అధికారులు అవుట్‌ఫ్లోను నిలిపివేశారు. నారాయణపూర్‌కు 190 క్యూసెక్కువ స్వల్ప ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. దిగువన ఉజ్జయినికి 3,141 క్యూసెక్కులు, తుంగభద్రకు 4,895 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తున్నది. స్థానికంగా కురిసిన వర్షాలతో నాగార్జునసాగర్‌కు రెండు రోజుల కిందట రెండువేల క్యూసెక్కులకు పైగా ఉన్న ఇన్‌ఫ్లో ఇప్పుడు 643 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రకాశం బరాజ్ వద్ద 5,226 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది.
kaleshwaram6

అన్నారం రెండోమోటర్‌కు వెట్న్ ప్రక్రియ ప్రారంభం

మంథని మండలం కాసిపేటలోని అన్నారం పంపుహౌస్ 1వ నంబర్ మోటర్ సింక్రనైజేషన్ ప్రక్రియ పూర్తయింది. 2వ నంబర్ మోటర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఇంజినీరింగ్ నిపుణుల సమక్షంలో వెట్న్ ప్రక్రియను ప్రారంభించారు. 1వ మోటర్‌కు శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు పలుమార్లు వివిధ రకాల పరీక్షలను నిర్వహించి సింక్రనైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ మోటర్ సుందిల్ల పంపుహౌస్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నది. 2వ మోటర్‌కు సోమవారమే వెట్న్ చేసి నీటిని ఎత్తిపోసేలా సిద్ధంచేశారు. వాస్తవానికి రెండోపంపును ఆదివారమే ప్రారంభించాల్సి ఉండగా విదేశీ ఇంజినీర్లు మధ్యాహ్నం 2 గంటల తర్వాత పంపుహౌస్‌కు చేరడంతో ప్రక్రియ ఆలస్యమయింది. సోమవారం సాయంత్రం నీటిని ఎత్తిపోసే విధంగా చర్యలు చేపడుతున్నారు. కాగా, అన్నారం పంప్‌హౌస్‌లో మొదటి మోటర్ పరీక్షల నిమిత్తం చేసిన పంపింగ్‌తో సుందిల్ల బరాజ్‌లోకి ఇప్పటివరకు 0.06 టీఎంసీల నీరు చేరింది.

గోదావరికి చేరుతున్న వరద

kaleshwaram4
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద వచ్చిచేరుతున్నది. దీంతో గోదావరి ప్రవాహం స్వల్పంగా పెరుగుతున్నది. నిర్మల్ జిల్లాలోని బాసర గోదావరి నదికి క్రమంగా వరద వచ్చి చేరుతున్నది. ఆదివారం జలకళ సంతరించుకున్నది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి సమీపంలో గోదావరి, హరిద్ర, మంజీరా నదుల సంగమక్షేత్రంలో వరద ప్రవాహం పెరిగింది. కందకుర్తి వంతెన వద్ద గోదావరి నిండుగా పారుతున్నది. నదిలో గల పురాతన శివాలయాన్ని వరద ముంచెత్తింది. దిగువన కడెం జలాశయంలోకి స్వల్పంగా నీరుచేరుతున్నది. రెండ్రోజులుగా కురిసిన వర్షానికి దుబ్బవాగు, గండివాగు పొంగిపొర్లడంతో సింగూరు జలాశయానికి 1,067 క్యూసెక్కుల నీరు వచ్చింది. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం స్వల్పంగా పెరిగింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 8.6 అడుగుల ప్రవాహం ఉండగా, సాయంత్రం 6 గంటలకు 9 అడుగులకు చేరుకున్నది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భద్రాచలం సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం దేవాదుల ఇన్‌టేక్ వెల్ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం 71.70 మీటర్లుగా ప్రవహిస్తున్నది. మేడిగడ్డ వద్ద గేట్లు ఎత్తడంతో కిందివైపున గోదావరి ప్రవాహం నెమ్మదిగా పెరుగుతున్నది.
kaleshwaram3
kaleshwaram5
kaleshwaram
kaleshwaram1

3631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles