ప్రభుత్వ ఉద్యోగులకు మెడల్స్, ఇంక్రిమెంట్


Sun,August 13, 2017 06:23 AM

Medals and increments to government employees

ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులుగా బంగారు, వెండి, కాంస్య పతకాలు
నగదు ప్రోత్సాహకంగా రూ.5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు
రాష్ట్రస్థాయిలో 12 మంది, జిల్లాస్థాయిలో 88 మంది అవార్డుకు ఎంపిక
అదనంగా ఒక ఇంక్రిమెంట్ కూడా

medalsహైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ ఇన్సెంటివ్ స్కీం నిబంధన ప్రకారం ఎంపికైన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవపూర్వకంగా మెడల్స్ ప్రదానం చేయనున్నది. ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులు అందుకుంటున్న ఉద్యోగులకు వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలను ఇచ్చి సత్కరించనున్నది. దీంతోపాటు నగదు ప్రోత్సాహకంగా రూ. 5 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 2 లక్షలు ఇవ్వనున్నది. రాష్ట్రస్థాయిలో నాలుగు విభాగాల్లో ఎంపికైన 12 మంది ఉద్యోగులను పంద్రాగస్టు వేడుకల్లో మెడల్స్‌తోపాటు నగదు ఇచ్చి సన్మానించనున్నట్లు అవార్డు కమిటీ చైర్మన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య శనివారం నమస్తే తెలంగాణ ప్రతినిధికి చెప్పారు. జిల్లాస్థాయిలోనూ మరో 88 మంది ఉద్యోగులను అవార్డులకు ఎంపికచేసినట్టు ఆయన పేర్కొన్నారు. వీరికి అదనంగా ఒక ఇంక్రిమెంట్ ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్రస్థాయిలో తొలిసారి ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా అవార్డులు ఇచ్చే విధానాన్ని రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. ఉమ్మడిరాష్ట్రంలో అవార్డులు ఇచ్చే విధానం ఉన్నప్పటికీ అశాస్త్రీయంగా ఎంపిక జరిగేదన్నారు.

state
తెలంగాణ రాష్ట్రంలో శాస్త్రీయంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉద్యోగ ప్రోత్సాహక అవార్డుల ఎంపిక జరిగిందని ఆచార్య చెప్పారు. గ్రూప్-1 క్యాటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు వరుసగా సీహెచ్ మధుసూదన్, సురేశ్‌బాబు, పీడబ్ల్యూ జాన్సన్, గ్రూప్-2 క్యాటగిరీలో ఖానాపూర్ చంద్రకళ, విశ్వనాథం గుప్తా, రమీజుద్దీన్ అహ్మద్, గ్రూప్-3 క్యాటగిరీలో ఎం జయమ్మ, కే ప్రకాశ్, డీ శంకర్‌కుమార్, గ్రూప్-4 క్యాటగిరీలో బీ దశరథ, కే గంగయ్య, కే కిష్టయ్య ఎంపికైనట్టు ఆయన వివరించారు.

1547

More News

VIRAL NEWS

Featured Articles