మౌలానా ఖురేషి కన్నుమూత..


Fri,January 15, 2016 12:47 AM

Maulana Qureshi passes away

moulana


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సహాయ ప్రధాన కార్యదర్శి, తామిరే మిల్లత్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ రహీం ఖురేషి (81) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ముస్లిం మేధావిగా గుర్తింపు పొందిన ఖురేషి యునైటెడ్ ముస్లిం ఫోరం(యూఎంఎఫ్) అధ్యక్షుడిగా, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (ఎంజేఏసీ) కన్వీనర్‌గా, మిల్లీ కౌన్సిల్ జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మృతికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతోపాటు అనేక మంది రాజకీయ, మత ప్రముఖులు సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లోని గౌలిగూడ ఉస్మాన్‌షాహి ముస్లిం శ్మశానవాటికలో ఖురేషి అంత్యక్రియలు జరిగాయి. ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన ఖురేషి 1950లో స్థాపించిన తామిరే మిల్లత్ (నాటి బజ్మేఅహెబాబ్ సంస్థ)లో చురుకుగా పనిచేశారు. ఖలీలుల్లా హుస్సేనీ మరణానంతరం తామిరే మిల్లత్ సంస్థ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.
-ముస్లిం పర్సనల్ లాబోర్డుతో సహా పలుసంస్థలకు నాయకత్వం
-గౌలిగూడ శ్మశానవాటికలో అంత్యక్రియలు

బాబ్రీమసీదు కేసులో ఖురేషి కీలకపాత్ర వహించారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, గౌస్‌ఖామోషీ, మౌలానా హమీదుద్దీన్ ఆఖిల్ హుస్సామీలాంటి నాటి ప్రముఖనేతలతో ఖురేషి కలిసి పనిచేశారు. ముస్లిం సమాజానికి చేసిన సేవలకు గాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖురేషి గుర్తింపు పొందారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, జీహెచ్‌సీసీ అధ్యక్షుడు దానం నాగేందర్, మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ,

ఆ పార్టీ ఎమ్మెల్యేలు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మాజీ మంత్రి మహ్మద్ ఫరీదుద్దీన్, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, మాజీ ఎమ్మెల్సీ, జమియతే ఉలేమా రాష్ట్ర అధ్యక్షుడు హాఫెజ్ పీర్ షబ్బీర్ అహ్మద్, టిఆర్‌ఎస్ నేతలు మీర్ ఇనాయత్ అలీ బాక్రీ, వహిద్, అమీర్, ఏసీబీ డీజీ ఏకేఖాన్, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్, తెలంగాణ రాష్ట్ర హజ్‌కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్‌ఏషుకూర్, జమాతే ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి జాహెద్ ఖాన్, ముస్లిం మత ప్రముఖులు తదితరులు ఖురేషికి నివాళుర్పించారు.

-సీఎం కేసీఆర్ సంతాపం
ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రహీం ఖురేషీ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజంలో వెనుకబడిన ప్రజల కోసం ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఖురేషి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

975
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS